Share News

ఉల్లంఘన లేదు..లీకూ లేదు

ABN , Publish Date - May 31 , 2026 | 05:00 AM

మెగా డీఎస్సీ-2025ని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియలో దరఖాస్తుల నుంచి తుది ఎంపిక వరకు ఎక్కడా ఒక్క ఉల్లంఘన కూడా జరగలేదని..

ఉల్లంఘన లేదు..లీకూ లేదు

  • మెగా డీఎస్సీ అత్యంత పారదర్శకం

  • దరఖాస్తుల నుంచి ఫలితాల వరకు రూల్స్‌ పాటింపు

  • హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అర్థం కాకే గందరగోళం

  • మహిళా, దివ్యాంగుల, క్రీడా కోటా వారికి వర్తింపు

  • జిల్లాలవారీగా మెరిట్‌ జాబితాలు విడుదల చేశాం

  • మెరిట్‌ ర్యాంకు రాకపోతే ఉద్యోగం ఎలా వస్తుంది?

  • ఒక్కో సబ్జెక్టుకు క్వశ్చన్‌ బ్యాంకులో 3 వేల ప్రశ్నలు

  • ఇద్దరు ఉద్యోగులకే వాటిని యాక్సెస్‌ చేసే అవకాశం

  • పరీక్ష రోజే జంబ్లింగ్‌తో ప్రశ్నలు మారిపోతాయి

  • ఈ క్రమంలో లీకేజీకి ఎక్కడా అవకాశమే లేదు

  • పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్‌ స్పష్టీకరణ

అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-2025ని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియలో దరఖాస్తుల నుంచి తుది ఎంపిక వరకు ఎక్కడా ఒక్క ఉల్లంఘన కూడా జరగలేదని, పారదర్శక విధానంలో మెరిట్‌తోనే అభ్యర్థులంతా ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. డీఎస్సీలో అక్రమాలు అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. జిల్లాల వారీగా మెరిట్‌ జాబితాలు విడుదల చేశామని, మెరిట్‌ జాబితాలు ఇవ్వలేదనే ఆరోపణలో నిజం లేదని పేర్కొన్నారు. హారిజాంటల్‌ రిజర్వేషన్‌ విధానం అర్థంకాకే గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. 241 కోర్టు కేసులు పడినా.. వాటిని ఎదుర్కొని ముందుకు సాగామని, 148 రోజుల్లో రికార్డు స్థాయిలో నోటిఫికేషన్‌ ప్రక్రియను పూర్తిచేశామన్నారు. మెగా డీఎస్సీపై శనివారం మంగళగిరిలోని విద్యాభవన్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. మొత్తం ప్రక్రియ ఎలా జరిగిందో ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ‘‘2018 తర్వాత 2025లో డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చింది. 16,347 పోస్టులు నోటిఫై చేశాం. 3.36 లక్షల మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులు చేసుకున్నారు. డీఎస్సీకి ముందు 2024 జూలైలో టెట్‌ నోటిఫికేషన్‌ జారీచేశాం. 3,00,068 మంది టెట్‌ రాస్తే, 1.87 లక్షల మంది అర్హత సాధించారు. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. 2025 ఏప్రిల్‌ 20న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. దరఖాస్తులను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే స్వీకరించాం. తొలిసారి ఈ నోటిఫికేషన్‌లోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేశాం. ఇంత పెద్ద నోటిఫికేషన్‌లో హారిజంటల్‌ రిజర్వేషన్‌ వర్తింపజేయడం ఇదే తొలిసారి’’ అని కోన శశిధర్‌ పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...


ప్రశ్నల లీకేజీకి చాన్సే లేదు

‘‘13 సబ్జెక్టులు, 67 రకాల పోస్టులతో 89 సెషన్లలో మెగా డీఎస్సీ పరీక్షలు టీసీఎస్‌ అయాన్‌ సెంటర్ల ద్వారా నిర్వహించాం. 154 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటిలో 19 రాష్ట్రం వెలుపల ఉన్నాయి. పరీక్షలు పూర్తిగా సీబీటీ విధానంలో జరిగాయి. ప్రతి పరీక్షకు 3 వేల ప్రశ్నలను సబ్జెక్టు నిపుణులు ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయంలోనే రూపొందించారు. అనంతరం టీసీఎస్‌ సర్వర్‌లోకి అప్‌లోడ్‌ చేశారు. ఈ క్వశ్చన్‌ బ్యాంకులను యాక్సెస్‌ చేసే అధికారం ఇద్దరు శాశ్వత ఉద్యోగులకే ఇచ్చారు. సర్వర్‌లో ముందే అప్‌లోడ్‌ చేసినా జంబ్లింగ్‌ విధానంలో ఎవరికి ఎలాంటి ప్రశ్నలు వెళ్లాలి అనేది పరీక్ష రోజే డీకోడ్‌ అయింది. అన్ని సబ్జెక్టులకు కలిపి 42వేల ప్రశ్నలు తయారు చేశాం. అవి ప్రతి సెషన్‌కు జంబ్లింగ్‌ అయ్యాయి. టీఎసీఎస్‌ అయాన్‌ ప్లాట్‌ఫామ్‌ను దేశంలోని ప్రముఖ సంస్థలు, హైకోర్టులు వినియోగిస్తున్నాయి. వీటిపై ఎక్కడా ఒక్క ఆరోపణ లేదు. క్వశ్చన్‌ బ్యాంక్‌ సర్వర్‌ నుంచి పూర్తిగా ఎన్‌క్రిప్ట్‌ అయ్యింది. అభ్యర్థికి ప్రశ్నలు వెళ్లేవరకూ ఎవరికి ఏం వస్తాయో ముందుగా తెలియదు. ప్రశ్నలను యాక్సెస్‌ చేసి చూడటం ఎవరికీ సాధ్యం కాదు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలున్నాయి. బయోమెట్రిక్‌ ద్వారానే అభ్యర్థులను అనుమతించారు. 24 రోజుల పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు జరిగాయి’’ అని వివరించారు. ‘‘జూలై 7న ప్రాథమిక కీలు విడుదల చేశాం. వాటిపై అభ్యంతరాలు స్వీకరించి, ఆగస్టు 1న తుది కీలు ఇచ్చాం. అదే నెల 11న నార్మలైజేషన్‌ స్కోర్లు ప్రకటించాం. 22న జిల్లాల వారీగా మెరిట్‌ జాబితాలు విడుదల చేశాం. సర్టిఫికెట్ల పరిశీలన సమయానికి సర్టిఫికెట్లన్నీ ఉండాలని స్పష్టం చేశాం. 1:1 నిష్పత్తిలో పోస్టుకు ఒకరు చొప్పున సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచాం. ఎవరైనా రాకపోతే తర్వాత మెరిట్‌ అభ్యర్థులకు అవకాశం వచ్చింది’’ అని శశిధర్‌ పేర్కొన్నారు.


తొలిసారి హారిజాంటల్‌ రిజర్వేషన్‌

‘‘తొలిసారి ఇంత పెద్ద నోటిఫికేషన్‌లో హారిజంటల్‌ రిజర్వేషన్‌ విధానం అమలు చేశాం. ఈ విధానం అమలు చేయాలనేది సుప్రీంకోర్టు ఆదేశం. ఇందులో 3 శాతం మహిళా కోటా ఉంటుంది. మహిళా, దివ్యాంగుల, క్రీడా కోటా అభ్యర్థులకు హారిజాంటల్‌ రిజర్వేషన్‌ వర్తిస్తుంది. జీవో 77 ప్రకారం యథావిథిగా రిజర్వేషన్‌లో నిబంధనలు పాటించాం. ఇందులో ఎక్కడా ఉల్లంఘనలు లేవు. హారిజాంటల్‌ రిజర్వేషన్‌ విధానం కొందరికి పూర్తిగా అర్థం కాలేదు. దీంతో గందరగోళానికి గురై, వారికి ఉద్యోగాలు రాలేదు అనుకుంటున్నారు. మెరిట్‌ ఉన్న ఒక్క అభ్యర్థినీ పక్కన పెట్టలేదు. ఎంపిక అనంతరం కూడా జిల్లా, జోనల్‌, రాష్ట్ర స్థాయి కమిటీలు నియమించి వినతు లు స్వీకరించి పరిష్కరించాం. అక్కడే ఎందుకు ఉద్యోగం రాలేదో వివరించాం. క్రీడా కోటా కాకుండా 16,291 మందిని పరిగణలోకి తీసుకోగా 15,569 మందిని ఎంపిక చేశాం. 722 మందిని తిరస్కరించాం’ అని తెలిపారు.


నవీన్‌ సర్టిఫికెట్ల పరిశీలనకు రాలేదు

‘‘ఎస్‌సీఈఆర్‌టీలో ఉద్యోగిగా ఉన్న నవీన్‌కు ర్యాంకులు రావడంపై చర్చ జరుగుతోంది. అతను 2016 నుంచి ఎస్‌సీఈఆర్‌టీలో పనిచేస్తున్నాడు. డీఎస్సీ పరీక్షలు రాస్తున్న విషయంలో శాఖ నుంచి ఎన్‌వోసీ తీసుకోలేదు. దీంతో పరీక్షల అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. రెండు పోస్టులో ఒక దానిలో మొదటి ర్యాంకు, మరో దానిలో ఆరో ర్యాంకు వచ్చింది. మెరిట్‌ జాబితాలు ఇచ్చాక అతను పరీక్షలు రాశాడని మా దృష్టికి వచ్చింది. అయినా అతన్ని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచాం. కానీ నవీన్‌ హాజరు కాలేదు. అందుకే అతను ఎంపిక కాలేదు. కానీ తనకు ఉద్యోగం ఇవ్వలేదని హైకోర్టుకు వెళ్లాడు. జరిగిన విషయాన్ని న్యాయస్థానానికి వివరించాం. అతనికి ముందే పేపర్‌ లీకు కాలేదు. ఒక్కో క్వశ్చన్‌ బ్యాంక్‌లో 3 వేల ప్రశ్నలుంటాయి. రెండు పరీక్షలకు 6 వేల ప్రశ్నలు అతను చదివి గుర్తుంచుకోవడం కూడా సాధ్యం కాదు. ఎంపికైన వారిలో ఒక్కరూ అడ్డదారిలో రాలేదు. దీనిపై టీచర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్రీడా కోటా విషయంలో శాప్‌ ఇచ్చిన జాబితాలు తీసుకుని రిజర్వేషన్‌ అమలుచేశాం’’ అని వివరించారు.


వీరికి ఉద్యోగాలు ఎలా వస్తాయి?

  • ఎం.ఏకాంబరం- ర్యాంకు 125, బీసీ(డి): చిత్తూరు జిల్లాలో ఈ కేటగిరీలో సోషల్‌ స్టడీ్‌సలో మొత్తం ఏడు పోస్టులున్నాయి. మొద టి 5 ఉద్యోగాలు మెరిట్‌ ఆధారంగా 114 ర్యాంకు వరకు వచ్చాయి. ఆ తర్వాత దివ్యాంగుల కోటాలో 139 ర్యాంకు, 906 ర్యాంకు అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చా యి. హారిజాంటల్‌ రిజర్వేషన్‌లో పీహెచ్‌ అభ్యర్థులకు తప్పనిసరిగా ఉద్యోగాలు ఇవ్వాలి. హారిజాంటల్‌ను కాదని 125 ర్యాంకు వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇలా ఇస్తారు?

  • షేక్‌ నసీమూన్‌- ర్యాంకు 43, బీసీ(ఇ): కడపలో ఈ కేటగిరీలో రెండే బయాలజీ పోస్టులున్నాయి. 4, 30 ర్యాంకులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయి.

  • బండారు యమున- ర్యాంకు 68, బీసీ(డి): విశాఖపట్నం జిల్లాలో ఈ కేటగిరీలో 5 ఫిజికల్‌ సైన్స్‌ పోస్టులున్నాయి. 30 ర్యాంకుతో నాలుగు పోస్టులు భర్తీ అయ్యాయి. 310 ర్యాంకు వచ్చిన అభ్యర్థికి క్రీడా కోటాలో హారిజాంటల్‌ విధానంలో ఉద్యోగం వచ్చింది.

  • ఎర్రిపల్లి శ్రవణ్‌కుమార్‌- ర్యాంకు 53, బీసీ(ఎ): విశాఖపట్నంలో ఈ కేటగిరీలో నాలుగు ఫిజికల్‌ సైన్స్‌ పోస్టులున్నాయి. 31 ర్యాంకుతో రెండు పోస్టులు భర్తీ అయ్యాయి. 114 ర్యాంకరుకు మహిళా కోటాలో, 417 ర్యాంకరుకు పీహెచ్‌ కోటాలో ఉద్యోగాలు వచ్చాయి. దీంతో శ్రవణ్‌కుమార్‌కు ఉద్యోగం రాలేదు.

  • సమదం పృద్వీరాజు- ర్యాంకు 157, బీసీ(బి): జోన్‌-1లో టీజీటీ తెలుగు పోస్టులు ఐదు పోస్టులున్నాయి. 141 ర్యాంకు వరకే ఐదు పోస్టులు భర్తీ అయ్యాయి. ఇక 157 ర్యాంకరుకు ఉద్యోగం వచ్చే పరిస్థితే లేదు.

  • విషయాలను గ్రీవెన్స్‌ స్థాయిలో అప్పట్లోనే అభ్యర్థులకు వివరించాం. కానీ హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అర్థం కాక తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని అనుకుంటున్నారు. ఇప్పుడు దానిపై అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. మెరిట్‌ ర్యాంకులు కాదని.. తర్వాత ర్యాంకుల వారికి ఉద్యోగాలు ఎలా వస్తాయని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ప్రశ్నించారు.


దుష్ప్రచారంపై కేసు నమోదు

‘‘పూర్తి పారదర్శకంగా మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసినా, కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఓ కేసు నమోదు చేశాం. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకుంటాం. డీఎస్సీ కన్వీనర్‌ మార్పు పరిపాలనా సమన్వయం కోసం జరిగింది. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌, డీఎస్సీ కన్వీనర్‌ ఒక్కరే ఉంటే రెండు విభాగాల మధ్య సమన్వయం ఉంటుందని కావాలనే కన్వీనర్‌ మార్పు నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా ఎవరి మాటలైనా నమ్మి మోసపోతే మాకు సంబంధం లేదు’’ అని స్పష్టం చేశారు.

Updated Date - May 31 , 2026 | 05:02 AM