Share News

‘మెగా’ విజేతలం.. దగా అంటే సహించం

ABN , Publish Date - Aug 09 , 2026 | 05:06 AM

మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయులు కర్నూలులో కదం తొక్కారు. డీఎస్సీ నియామకాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, నిరాధారమైన ఆరోపణలను ఖండించారు.

‘మెగా’ విజేతలం.. దగా అంటే సహించం

  • డీఎస్సీలో అక్రమాలు అనడం అజ్ఞానం.. అవివేకం

  • జగన్‌, వైసీపీపై టీచర్ల ధ్వజం.. కర్నూలులో ‘మెగా’ ర్యాలీ

  • ఉపాధ్యాయుల సంఘీభావ ప్రదర్శన ‘ఎక్స్‌’లో ట్రెండింగ్‌

కర్నూలు/అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయులు కర్నూలులో కదం తొక్కారు. డీఎస్సీ నియామకాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, నిరాధారమైన ఆరోపణలను ఖండించారు. ‘ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ నిర్వహించడం చేతకాని మీరు మెగా డీఎస్సీని ‘దగా డీఎస్సీ’ అంటారా..? అక్రమాలు జరిగాయనడం.. ఉద్యోగాలు అమ్ముకున్నారనడం మీ అజ్ఞానం, అవివేకం కాదా?’ అంటూ వైసీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు చెందిన నూతన ఉపాధ్యాయులు ‘మెగా డీఎస్సీ- 2025.. మెగా సంఘీభావ ర్యాలీ’లో భాగంగా శనివారం చలో కర్నూలు పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటలకే ఆయా జిల్లాలకు చెందిన టీచర్లు కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకున్నారు. ‘మెరిట్‌తో వచ్చిన మెరికలం.. తప్పుడు ఆరోపణలు సహించం..! పాఠాలు చెప్పే ఉపాధ్యాయులం.. పాలిటిక్స్‌లో పావుల్ని చేయొద్దు..! ఇది మా కష్టం.. మా ప్రతిభ..! అవమానిస్తే ఊరుకోం..!, టీచర్లం పాఠాలు చెప్తాం.. కుట్ర చేస్తే గుణపాఠం చెబుతాం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కొండారెడ్డి బురుజు ఎక్కి తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. ‘థ్యాంక్యూ సీఎం సర్‌.. థ్యాంక్యూ లోకేశ్‌ సర్‌.. థ్యాంక్యూ పవన్‌ కల్యాణ్‌ సర్‌’ అంటూ ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతూ వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, వారు లేవనెత్తిన అనుమానాలకు సమాధానం చెప్పినా.. వాస్తవాలు వివరించినా వైసీపీ నాయకులు పదేపదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.


కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్‌ కార్యాలయం వరకు సంఘీభావం, ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈ ర్యాలీలో 3వేల మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పలువురు ఉపాధ్యాయినులు పసిపిల్లలతో సహా ర్యాలీలో పాల్గొని తమ ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండించారు. కొండారెడ్డి బురుజు, నగర వీధులను నినాదాలతో హోరెత్తించారు. జగన్‌, వైసీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ జడ్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు టీచర్లు మాట్లాడారు. ‘కుటుంబాలకు దూరంగా ఏళ్ల తరబడి కోచింగ్‌ సెంటర్లలో ఉంటూ.. రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఆన్‌లైన్‌ పరీక్షల్లో ప్రతిభ చూపి సాధించుకున్న ఉద్యోగాలివి.. మీ స్వార్థ రాజకీయాలకు మమ్మల్ని రోడ్లపైకి లాగుతారా..? లేనిపోని అనుమానాలు కల్పించి నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలాడుకుంటారా..? గురువులుగా పాఠాలు చెప్పడమే కాదు.. గుణపాఠాలు చెప్పడం కూడా మాకు తెలుసు’ అంటూ గర్జించారు. తాము కష్టపడి ఉద్యోగాలు సాధించుకొంటే ఓర్వలేని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకంతో 16వేలకు పైగా డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు. పదేపదే తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వారిపై పరువు నష్టం దావా వేయడానికి కూడా వెనకాడబోమని తీవ్రంగా హెచ్చరించారు. కాగా, మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న నిరసన దీక్షలకు వ్యతిరేకంగా కర్నూలులో ఉపాధ్యాయులు చేపట్టిన ఉద్యమం టీచర్స్‌ వర్సెస్‌ వైసీపీ హ్యాష్‌ట్యాగ్‌తో శనివారం రోజంతా ట్రెండింగ్‌లో నిలిచింది.


మమ్మల్ని రోడ్డుపైకి లాగుతారా..?

డీఎస్సీ అంటే ఏమిటో అర్థం కూడా తెలియనివారు దానిగురించి మాట్లాడుతున్నారు. దీక్షలు చేస్తున్నారు. ఆ దీక్షల్లో అసలు అభ్యర్థులు ఉన్నారా? డీఎస్సీ నిర్వహించడం చేతకానివారు కూడా ఇవాళ డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో సీఎం జగన్‌కు ఎన్నిసార్లు విన్నవించినా ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఇప్పుడు మమల్ని రోడ్డుపైకి లాగుతారా..? ఏపీలో అత్యధిక సార్లు డీఎస్సీ నిర్వహించిన చరిత్ర ఈ ప్రభుత్వానిదే.

- వెంకట్రాముడు నాయక్‌, బసలదొడ్డి, పెద్దకడబూరు మండలం, కర్నూలు జిల్లా


గుణపాఠం చెబుతాం

ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేని వైసీపీ నాయకులు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. విద్యాశాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఒకసారి చదివితే హారిజాంటల్‌ రిజర్వేషన్‌పై అవగాహన వస్తుంది. మాపై ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేయడం మానుకోండి. విద్యార్థుల భవిషత్తు తీర్చిదిద్దేందుకే బడికి వెళ్లి తరగతి గదిలో పాఠాలు చెబుతున్నాం.. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగితే గుణపాఠాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం.

- కిరణ్‌కుమార్‌, చిత్తూరు జిల్లా


అవగాహన లేని మాటలు

హారిజాంటల్‌ రిజర్వేషన్‌పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. జీవో.77 తీసుకొచ్చింది గత ప్రభుత్వంలోనే. ఎంతో కష్టపడి చదవితేనే మాకు ఉద్యోగాలు వచ్చాయి. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించడానికి డీఎస్సీలో అక్రమాలు జరిగాయని అరోపించడం సమంజసం కాదు. క్రీడా కోటా ఉద్యోగాలు రావాలంటే మైదానంలో ఎన్నో ఏళ్లు శ్రమించాలి. రాష్ట్ర స్థాయిలో ఆడితే రాష్ట్ర అసోసియేషన్లు, జాతీయ స్థాయిలో అడితే జాతీయ స్థాయి ఫెడరేషన్లు సరిఫికెట్లు ఇస్తాయి.

- రవికుమార్‌ నాయక్‌,

సోషల్‌ టీచర్‌, అనంతపురం జిల్లా

Updated Date - Aug 09 , 2026 | 05:08 AM