Share News

మా ప్రతిభను అవమానిస్తే ఊరుకోం!

ABN , Publish Date - Aug 15 , 2026 | 04:49 AM

మెగా డీఎస్సీ-2025పై వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలు తిప్పికొడుతూ నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు, డీఎస్సీ అభ్యర్థులు శుక్రవారం తిరుపతి జిల్లా చంద్రగిరిలో..

మా ప్రతిభను అవమానిస్తే ఊరుకోం!

  • వైసీపీపై ‘మెగా డీఎస్సీ’ టీచర్ల ఆగ్రహం

  • చంద్రగిరిలో భారీ ఆత్మగౌరవ ర్యాలీ

చంద్రగిరి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-2025పై వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలు తిప్పికొడుతూ నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు, డీఎస్సీ అభ్యర్థులు శుక్రవారం తిరుపతి జిల్లా చంద్రగిరిలో భారీస్థాయిలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని, కూటమి నాయకులు సంఘీభావం తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తమను, తమ కుటుంబాలను వైసీపీ నాయకులు క్షోభకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మెగా డీఎస్సీ నిర్వహణపై తాము చర్చకు సిద్ధమని, విషప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు అందుకు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సంపాదించుకున్న తమను అవమానిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎమ్మెల్యే నాని మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. 2019-24 మధ్య జరిగిన గ్రూప్‌-1 పరీక్షల్లో భారీ అవకతవకలు జరిగాయని, వాటిపై సిట్‌ విచారణ ముగింపు దశకు చేరుకుందని, ప్రజల దృష్టి మళ్లించేందుకు డీఎస్సీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

Updated Date - Aug 15 , 2026 | 04:50 AM