Share News

నో లీక్‌.. నో కాపీ

ABN , Publish Date - Aug 08 , 2026 | 05:00 AM

మెగా డీఎస్సీ-2025లో ఒక్క ఉల్లంఘన కూడా జరగలేదని అధికారులు పునరుద్ఘాటించారు. పేపరు లీకేజీ, కాపీయింగ్‌ లాంటి అక్రమాలకు అవకాశమే లేదని మరోసారి స్పష్టం చేశారు.

నో లీక్‌.. నో కాపీ

  • మెగా డీఎస్సీ పూర్తి పారదర్శకం

  • పరీక్షల నిర్వహణలో ఒక్క ఉల్లంఘనా లేదు

  • అక్టోబరులో మరో డీఎస్సీ.. డిసెంబరులోనే పరీక్షలు

  • లీకేజీ, కాపీయింగ్‌ వంటి అక్రమాలకు నో చాన్స్‌

  • ఉద్యోగాలు సాధించిన వారంతా మెరిట్‌ అభ్యర్థులే

  • ఫేక్‌ క్రీడా సర్టిఫికెట్లపై కేసుల్లేవ్‌

  • ఎంపికైనవారు, సన్నద్ధమయ్యే వారు ఆందోళన చెందొద్దు

  • శాప్‌ ఎండీ భరణి, పాఠశాల విద్య డైరెక్టర్‌ అన్సారియా స్పష్టీకరణ

అమరావతి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-2025లో ఒక్క ఉల్లంఘన కూడా జరగలేదని అధికారులు పునరుద్ఘాటించారు. పేపరు లీకేజీ, కాపీయింగ్‌ లాంటి అక్రమాలకు అవకాశమే లేదని మరోసారి స్పష్టం చేశారు. ఉద్యోగాలు సాధించిన వారంతా మెరిట్‌ అభ్యర్థులేనని.. మెగా డీఎస్సీ ద్వారా టీచర్లుగా ఎంపికైన వారు, వచ్చే డీఎస్సీకి సన్నద్ధమయ్యే వారు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. డీఎస్సీపై ఆరోపణల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, శాప్‌ ఎండీ ఎస్‌.భరణి శుక్రవారం సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అన్సారియా మాట్లాడుతూ... ‘డీఎస్సీపై చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం గతంలోనే వివరణ ఇచ్చింది. అయినా కొందరు ఇప్పటికీ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. దీనివల్ల మెరిట్‌ ద్వారా మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లు, త్వరలో రాబోయే డీఎస్సీకి సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. మెరిట్‌ ద్వారా ఇప్పటికే ఎంపికైన టీచర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మెగా డీఎస్సీలో 13 సబ్జెక్టులున్నాయి. ఒక్కో సబ్జెక్టుకు 3వేల ప్రశ్నలతో క్వశ్చన్‌ బ్యాంక్‌ తయారు చేశారు. మొత్తం 42వేల ప్రశ్నలు రూపొందించారు. ఇవి ప్రతి అభ్యర్థికి జంబ్లింగ్‌ విధానంలో మారుతూ వచ్చాయి. ఒక పరీక్షలో వచ్చే 160 ప్రశ్నలను ఒక్కరే టీచర్‌ తయారు చేయలేదు.


ఆన్‌లైన్‌ విధానంలో ప్రతి అభ్యర్థికి ప్రశ్నలు, ఆప్షన్లు మారిపోయాయి. ఈ ప్రశ్నలను యాక్సెస్‌ చేసే అధికారం ఇద్దరు ఉద్యోగులకు మాత్రమే ఉంది. టీసీఎస్‌ అయాన్‌ ప్లాట్‌ఫాం దేశంలో అనేక సంస్థలకు సేవలు అందిస్తోంది. పరీక్షల విధానం ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటుంది. డీఎస్సీ పరీక్షల్లో అసలు క్వశ్చన్‌ పేపర్‌ విధానమే లేదు. క్వశ్చన్‌ బ్యాంక్‌ మాత్రమే ఉంటుంది. అందువల్ల పేపరు లీకేజీకి గానీ, కాపీయింగ్‌కు గానీ అవకాశం లేదు. పరీక్షల అనంతరం మెరిట్‌ జాబితాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాం. సర్టిఫికెట్ల పరిశీలన ఏడు దశల్లో జరిగింది. ఎంపికపై వచ్చిన అభ్యంతరాలను మూడుస్థాయిల్లో పరిష్కరించాం. హారిజాంటల్‌ రిజర్వేషన్‌ కారణంగా కొందరిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచినా ఉద్యోగం రాలేదు. చాలా మందికి ఈ విధానం అర్థంకాక అపోహలకు గురౌతున్నారు’ అని అన్నారు. అక్టోబరులో మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, డిసెంబరులో పరీక్షలు ఉంటాయని, అభ్యర్థులు లక్ష్యంపై దృష్టి సారించాలని సూచించారు.


‘హారిజాంటల్‌’ అర్థం కాకే అపోహలు!

‘‘ఇటీవల సోషల్‌ మీడియాలో కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సంతోషి పార్వతి అనే అభ్యర్థి జోన్‌-1లో పీజీటీ ఇంగ్లిష్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. జోన్‌-1లో ఈడబ్ల్యూఎస్‌ కోటాలో రెండు పోస్టులున్నాయి. మొదటి పోస్టు 84వ ర్యాంకరు పద్మజకు వచ్చింది. 92వ ర్యాంకు సాధించిన తనకు రెండో పోస్టు రావాలని పార్వతి అంటున్నారు. అయితే రెండో పోస్టు అశోక్‌కుమార్‌ అనే దివ్యాంగ అభ్యర్థికి హారిజాంటల్‌ కోటాలో వెళ్లింది. భాస్కర్‌రెడ్డి అనేక కడపకు చెందిన అభ్యర్థికి ఉద్యోగం రాలేదని మరో ఆరోపణ. కడపలో 8 ఎస్‌ఏ-ఇంగ్లిష్‌ పోస్టులున్నాయి. మెరిట్‌లో చివరి స్థానంలో ఉన్న భాస్కర్‌రెడ్డి స్థానంలోకి హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అభ్యర్థి వచ్చారు. దీంతో భాస్కర్‌రెడ్డికి ఉద్యోగం రాలేదు’’ అని తమీమ్‌ అన్సారియా వివరించారు.

ప్రతి సర్టిఫికెట్‌నూ ధ్రువీకరించుకున్నాం..

శాప్‌ ఎండీ భరణి మాట్లాడుతూ... ‘‘మెగా డీఎస్సీలో 421 క్రీడా కోటా పోస్టులకు 3600 మంది దరఖాస్తు చేసుకున్నారు. 382 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మొదటిసారి క్రీడా కోటాకు హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అమలైంది. క్రీడా కోటా అభ్యర్థులకు అందరికీ అన్ని విద్యార్హతలు, టెట్‌ ఉన్నాయి. ప్రతి అభ్యర్థి సమర్పించిన క్రీడా సర్టిఫికెట్లను... క్రీడాసంఘాలు, సమాఖ్యలు, యూనివర్సిటీలకు పంపి ధ్రువీకరించుకున్నాం. అందుకే కోర్టు కేసుల్లో ఒక్కటి కూడా నకిలీ సర్టిఫికెట్లపై లేదు. ఇటీవల వేసిన పిల్‌ కూడా సంఘాల మధ్య విభేదాలతోనే దాఖలైంది. ఓ ప్రైవేటు వ్యక్తి, అభ్యర్థితో ఉద్యోగం ఇప్పిస్తానని మాట్లాడిన వీడియోపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. నిందితుడిని పట్టుకున్నారు. దానికి శాప్‌కు సంబంధం లేదు’ అని పేర్కొన్నారు.

Updated Date - Aug 08 , 2026 | 05:01 AM