Share News

‘మెగా’ గర్జన!

ABN , Publish Date - Aug 17 , 2026 | 03:51 AM

కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా ‘గురువులు’ గర్జించారు.

‘మెగా’ గర్జన!

  • ప్రతిభతో సాధించాం.. నిందలు సహించం

  • ఉపాధ్యాయులను అవమానిస్తే పుట్టగతులుండవ్‌

  • రేయింబవళ్లు కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నాం

  • అధికారంలో ఉండగా ఒక్క డీఎస్సీ ఇవ్వకుండా.. ఇప్పుడు కుట్ర బుద్ధితో, నిస్సిగ్గుగా వైసీపీ ఆరోపణలు

  • గ్రూప్‌-1 అక్రమాలను కప్పిపుచ్చడానికి మాపై నిందలా?

  • పాఠాలే కాదు.. గుణపాఠాలు కూడా చెబుతాం

  • వాస్తవాలు తెలుసుకొని.. బురద చల్లడం మానుకోండి

  • ఆనందించే సమయంలో ఆవేదనకు గురిచేస్తున్నారు

  • బెజవాడలో కదం తొక్కిన ‘మెగా డీఎస్సీ’ ఉపాధ్యాయులు

  • ఆత్మగౌరవ ర్యాలీకి భారీ సంఖ్యలో టీచర్ల హాజరు

  • అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ

  • ఒక్క డీఎస్సీ ఇవ్వని అసమర్థ వైసీపీ

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు ఇదిగో.. అదిగో అంటూ ఊరించిందే తప్ప డీఎస్సీ ఇవ్వలేదు. ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వని అసమర్థ నాయకుడు జగన్‌ మాత్రమే. కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. గ్రూప్‌-1 అవకతవకలను కప్పి పుచ్చుకునేందుకే జగన్‌ డీఎస్సీపై ఆరోపణలు చేస్తున్నారు. నేను పదేళ్లు కష్టపడి ఉద్యోగం సాధించా. 46 ఏళ్ల వయసులో మూడు పీజీలు చేసిన నాకు ఉద్యోగం కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది?

- ప్రవీణ్‌ కుమార్‌, కృష్ణా జిల్లా

ఇక నుంచి జగన్‌ అభిమానిని కాదు

నేను, మా కుటుంబంలోని వారందరం జగన్‌ అభిమానులమే. నేను డీఎస్సీ కోసం ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. ఎంతో కష్టపడి చదువుకోవడం ద్వారా మెరిట్‌తో ఉద్యోగం సాధించా. కూటమి ప్రభుత్వంలో మీ (జగన్‌) అభిమానికి కూడా ఉద్యోగం వచ్చింది. నేను డబ్బు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నట్టుగా మాట్లాడుతుంటే చాలా బాధ వేసింది. ఇక నుంచి నేను జగన్‌ అభిమానిని కాదు.

- ఎండీ ఫసీన్‌ అలీ, పశ్చిమ గోదావరి జిల్లా

విజయవాడ, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా ‘గురువులు’ గర్జించారు.


వైసీపీ తీరుకు నిరసనగా ఆదివారం విజయవాడలో మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయులు భారీ స్థాయిలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన టీచర్లు కదంతొక్కారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై దిక్కులు పిక్కటిల్లేలా తమ గళాన్ని వినిపించారు. ఈ ర్యాలీ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బందర్‌ రోడ్డులోని అంబేడ్కర్‌ స్మృతివనం వరకు సాగింది.ఉపాధ్యాయులంతా ముక్తకంఠంతో ‘ఇది మీరు చెబుత్నుట్లు దగా డీఎస్సీ కాదు.. మెగా డీఎస్సీ.. ప్రతిభ గల డీఎస్సీ.. పాఠాలే కాదు.. గుణపాఠాలు కూడా చెబుతాం, నిజం తెలుసుకోండి.. బుద్ధి తెచ్చుకోండి.. బురదచల్లటం మానుకోండి..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘గురువులను అవమానించిన వారికి పుట్టగతులుండవు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై విషప్రచారాన్ని ఆపకపోతే విజయవాడ సాక్షిగా ప్రకాశం బ్యారేజీలో పడేస్తాం’ అని హెచ్చరించారు.


మా కృషిని అవమానిస్తే.. సహించం

ఏళ్ల పాటు రేయింబవళ్లు కష్టపడి, కుటుంబాలకు దూరంగా ఉండి ఉద్యోగాలు సాధిస్తే.. ఆనందించాల్సిన సమయంలో మమ్మల్ని, మా తల్లిదండ్రులను కన్నీరు పెట్టేలా చేస్తున్నారని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్‌-1లో వైసీపీ చేసిన అక్రమాలను కప్పిపెట్టుకోవటానికే డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. కొత్త డీఎస్సీని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ కుట్రకు తెరతీసిందన్నారు. నిరుద్యోగులు వారి ట్రాప్‌లో పడొద్దని సూచించారు. ముందుగా ఉపాధ్యాయులంతా స్టేడియం దగ్గర సంఘటితమయ్యారు. ప్రతి ఒక్క టీచర్‌ ప్లకార్డులను చేతబూనారు. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్లలో నెలకొన్న నిరాశను మెగా డీఎస్సీ తొలగించిందని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు దుష్ప్రచారానికి దిగడం తగినది కాదని హితవు పలికారు. ‘ఇది మా స్వయం కృషి, అవమానిస్తే, హేళన చేస్తే ఊరుకోం’ అని స్పష్టం చేశారు. హారిజాంటల్‌ రిజర్వేషన్ల గురించి తెలుసుకోవాలన్నారు.

దద్దరిల్లిన అత్మగౌరవ ర్యాలీ

ర్యాలీ ఆద్యంతం ఉపాధ్యాయులు నినాదాలతో హోరెత్తించారు. ‘నిరుద్యోగుల కలలకు ప్రతిరూపం మెగా డీఎస్సీ, అసత్యాలు ప్రచారం చేయొద్దు’, ‘స్వార్థ రాజకీయాలకు మమ్మల్ని బలిచేయొద్దు’, ‘ప్రతిభతో గెలిచిన విజేతలం, నిందలు వేస్తే బుద్ధి చెబుతాం’ అనే నినాదాలు రాసివున్న పలు ప్లకార్డులను ప్రదర్శించారు. ర్యాలీ అసాంతం ఉపాధ్యాయులు ఎత్తిన ప్లకార్డులు కిందకు దించలేదు. దీనిని బట్టి ఎంత అంకితభావంతో ఉపాధ్యాయులు ఆత్మగౌరవ ర్యాలీలో పాల్గొన్నారో అర్థమవుతుంది. ర్యాలీ స్టేడియం నుంచి అంబేడ్కర్‌ స్మృతివనంలోకి ప్రవేశించాక కొందరు ఉపాధ్యాయులు అంబేడ్కర్‌ విగ్రహం పాదాల వద్దకు చేరారు. ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు షేక్‌ ఇమామీ చేతుల మీదుగా మెగా డీఎస్సీ ఉపాధ్యాయులంతా అంబేడ్కర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Updated Date - Aug 17 , 2026 | 03:57 AM