Share News

మందులు కావాలి!

ABN , Publish Date - Apr 20 , 2026 | 03:56 AM

ప్రభుత్వ ఆస్పత్రులను మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ (సీడీఎ్‌స)లోనూ నిల్వలు నిండుకోవడంతో ఆస్పత్రులకు సరఫరా నిలిచిపోయింది.

మందులు కావాలి!

  • ఆస్పత్రులను వేధిస్తున్న ఔషధాల కొరత

  • సీడీఎస్‌ల్లోనూ నిండుకున్న నిల్వలు

  • జనవరి నుంచే వేధిస్తున్న సమస్య

  • బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ తీవ్ర నిర్లక్ష్యం

  • తొలి త్రైమాసికంలో 55 కోట్లకుగాను 32 కోట్లకే ఓకే

  • బడ్జెట్‌ సరిపోదని సూపరింటెండెంట్ల గగ్గోలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ ఆస్పత్రులను మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ (సీడీఎ్‌స)లోనూ నిల్వలు నిండుకోవడంతో ఆస్పత్రులకు సరఫరా నిలిచిపోయింది. సీడీఎ్‌సల్లో, ప్రభుత్వాస్పత్రుల్లో 550 రకాల మందులు ఉండాల్సిన చోట.. 200 రకాలు మాత్రమే ఉంటున్నాయి. దీంతో రోగులకు కనీసం రెండు, మూడు రకాల మందులు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఓపీ, ఐపీ చూపించుకునే రోగులు.. వైద్యులు రాసిన మందులను బయటే కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో రోగులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచే మందుల కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. గతేడాది చివరి క్వార్టర్‌లో అదనపు కేటాయింపులు చేయకపోవడం వల్ల మందలకు కొరత ఏర్పడింది. ఆర్థిక శాఖ నుంచి రూ.200 కోట్ల అదనపు నిధులు తెప్పించుకోవడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారు. దీంతో గతేడాది చివరి క్వార్టర్‌లో మందుల కొనుగోలుకు నిధుల సమస్య వచ్చింది. అప్పటికే సీడీఎస్‌ల్లో ఉన్న కాస్తోకూస్తో నిల్వలతో మార్చి నెలాఖరు వరకూ నెట్టుకొచ్చారు. కనీసం జ్వరం, జలుబు, దగ్గుకు కూడా మందులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ఆయా విభాగాధిపతులకు మందుల కోసం, బడ్జెట్‌ కోసం లేఖలు మీద లేఖలు రాస్తున్నారు. బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు గగ్గోలు పెడుతున్నారు.


మందుల బడ్జెట్‌లో కోత..

పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది మొదటి క్వార్టర్‌లో ఆస్పత్రులకు విడుదల చేసిన మందుల బడ్జెట్‌ను 65 శాతానికి కుదించారు. ఇది సూపరింటెండెంట్లకు మరింత తలనొప్పిగా మారింది. డీఎంఈ అధికారులు ప్రతి ఏటా మొదటి క్వార్టర్‌లో మందుల కొనుగోలుకు రూ.50-55 కోట్ల వరకూ విడుదల చేస్తారు. ఈసారి మందుల వినియోగం, గతేడాది కేటాయింపుల లెక్కలేవీ పట్టించుకోకుండా.. ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌ ఆధారంగా త్రైమాసికానికి ఎంత విడుదల చేయాలో అంతే ఇవ్వాలని అధికారులు డీఎంఈని ఆదేశించారు. ఈ మేరకు డీఎంఈ తమ పరిధిలో ఉన్న బోధనాస్పత్రులకు రూ.32 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఈ బడ్జెట్‌ సరిపోదని, కేటాయింపులు పెంచాలని కోరుతూ సూపరింటెండెంట్లు డీఎంఈకి లేఖలు మీద లేఖలు రాస్తున్నారు. డీఎంఈ ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన నుంచి కనీస స్పందన లేకపోగా.. బడ్జెట్‌ వ్యవహారం తాము చూసుకుంటాంలే అని సమాధానం ఇచ్చినట్టు సమాచారం.


ఇంకా పూర్తికాని డిమాండ్‌ ప్రక్రియ..

ఏయే రకాల మందులు కావాలన్న దానిపై ప్రతి త్రైమాసికంలో ఆస్పత్రుల నుంచి ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు డిమాండ్‌ తీసుకుంటారు. ఆ డిమాండ్‌ ఆధారంగానే కొనుగోలుకు పీవో (పర్చేజ్‌ ఆర్డర్లు) ఇస్తారు. ఏటా ఈ తతంగం మార్చి చివరి వారం లేదా ఏప్రిల్‌ మొదటి వారంలో పూర్తవుతుంది. ఈ ఏడాది ఇప్పటికీ ఆస్పత్రుల నుంచి డిమాండ్‌ తీసుకునే పనిలోనే ఉన్నారు. తర్వాత మందుల సరఫరాకు కంపెనీలకు 45 రోజుల సమయం ఇస్తారు. అంటే ఇప్పుడు మందులు కొనుగోలుకు ఆర్డర్లు పెడితే జూన్‌ రెండో వారానికి సీడీఎ్‌సలకు మందుల సరఫరా జరుగుతుంది. ఇప్పటికే ఆస్పత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఏపీఎంఎ్‌సఐడీసీ డిమాండ్‌ తీసుకుని, పీవోలు ఇచ్చి, తర్వాత కంపెనీలు సరఫరా చేయాలంటే జూన్‌ నెలాఖరు వరకూ సమయం పడుతుంది. అప్పటి వరకూ ఆస్పత్రుల్లో మందులు ఎలా?


సమన్వయ లోపం.. తీవ్ర నిర్లక్ష్యం

ప్రభుత్వాస్పత్రుల్లో మందులుంటే మాకేంటి.. లేకుంటే మాకేంటి...? మందులు ఉంటే రోగులు తీసుకుంటారు.. లేదంటే బయట కొనుక్కుంటారు... అన్న ధోరణిలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీఎంఎ్‌సఐడీసీలో అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపమే మందుల కొరతకు ప్రధాన కారణం. ఆస్పత్రులకు మందుల సరఫరా బాధ్యత కార్పొరేషన్‌ అధికారులదే. సీడీఎ్‌సల్లో నిల్వలు ఎంత ఉన్నాయి, అవి ఎన్ని నెలలకు వస్తాయన్న దానిపై ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని, ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాల్సిన బాధ్యత వారిదే. అయితే డ్రగ్స్‌ విభాగాన్ని కమీషన్లకు అడ్డాగా మార్చేశారు. అర్హత లేని వ్యక్తులను తీసుకొచ్చి కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టారు. దీంతో మొత్తం డ్రగ్స్‌ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది.

Updated Date - Apr 20 , 2026 | 03:57 AM