Share News

ప్రజారోగ్యానికి పెద్ద కష్టం!

ABN , Publish Date - Mar 17 , 2026 | 05:03 AM

ప్రజారోగ్యానికి పెద్ద కష్టం వచ్చింది. రాష్ట్రంలో మందుల నిల్వలు నిండుకున్నాయి..! ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల్లో డిమాండ్‌కు సరిపడా మందుల్లేవు. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌లో ఉన్న కాస్తోకూస్తో నిల్వలతోనే కాలం వెళ్లదీస్తున్నారు.

ప్రజారోగ్యానికి పెద్ద కష్టం!

  • ఆస్పత్రులను వేధిస్తున్న మందుల కొరత

  • పీహెచ్‌సీల్లో పరిస్థితి మరింత దారుణం

  • కనీసం బీపీ, షుగర్‌ ట్యాబ్లెట్లు కూడా లేవు

  • బోధనాస్పత్రుల్లో గగ్గోలు పెడుతున్న రోగులు

  • విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు, కడప,

  • కర్నూలు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మరింత తీవ్రం

  • స్టోర్స్‌లో నిండుకుంటున్న నిల్వలు.. 20 రోజుల్లో ఖాళీ

  • పీవోలు పెట్టి 2 నెలలు.. చోద్యం చూస్తున్న అధికారులు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ప్రజారోగ్యానికి పెద్ద కష్టం వచ్చింది. రాష్ట్రంలో మందుల నిల్వలు నిండుకున్నాయి..! ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల్లో డిమాండ్‌కు సరిపడా మందుల్లేవు. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌లో ఉన్న కాస్తోకూస్తో నిల్వలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. అవి కూడా మరో 20 రోజుల్లో నిండుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్నది సూపరింటెండెంట్లకు దిక్కుతోచడం లేదు. బోధనాస్పత్రులే కాదు.. ఎన్నడూ లేనివిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (పీహెచ్‌సీ)లను కూడా మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులతో పాటు బోధనాస్పత్రుల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో డాక్టర్లు రాసిన మందులు ఇవ్వడం లేదని రోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌లో పారాసిటమాల్‌ నిల్వలు కూడా అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి మరో వారం కొనసాగితే కనీసం పారాసిటమాల్‌ కూడా ఇవ్వలేని దుస్థితికి ఆస్పత్రులు చేరుకుంటాయి. ఒకవైపు రాష్ట్రంలో మందుల కొరత తీవ్రంగా ఉంటే.. ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నిత్యం డాక్టర్ల దగ్గర నుంచి ఓపీలు, ఐపీల డేటా తెప్పించడం మినహా, క్షేత్రస్థాయిలో మందుల కొరత గురించి పట్టించుకోవడం లేదు.


పీవోలు ఇచ్చి రెండు నెలలు..

ఏపీఎంఎ్‌సఐడీసీ (ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలె్‌పమెంట్‌ కార్పొరేషన్‌) అధికారులు మందుల కోసం కంపెనీలకు పర్చేజ్‌ ఆర్డర్‌ (పీవో) ఇచ్చి రెండు నెలలైంది. నాలుగో క్వార్టర్‌లో మందుల కొనుగోలుకు సంబంధించి ఒక్క పీవో కూడా ఇవ్వలేదు. దీనివల్లే ఆస్పత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. బోధనాస్పత్రుల్లో 712 రకాల మందులు ఉండాల్సిన చోట.. 350 నుంచి 400 రకాలు మాత్రమే ఉన్నాయి. ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో కనీసం 350 రకాల ఉండాల్సి ఉండగా.. 150 నుంచి 200 రకాలే ఇస్తున్నారు. పీహెచ్‌సీల్లో 214 రకాలకు గాను 100 రకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి కూడా ఏ రోజు అయిపోతాయో తెలియని పరిస్థితి. కొన్నిచోట్ల ఆస్పత్రుల సూపరింటెండెంట్లు తమ వద్ద ఉన్న లోకల్‌, హెచ్‌డీఎస్‌ బడ్జెట్‌ల నుంచి మందులు కొనుగోలు చేసి రోగులకు అందిస్తున్నారు. బోధనాస్పత్రులు, ఆస్పత్రుల్లో 712 ఎమర్జెన్సీ మెడిసిన్‌ లిస్ట్‌లో కనీసం 660 రకాలైనా అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. వాటిలో 80 రకాల మందులకు రేట్‌ కాంట్రాక్ట్‌ (ఆర్సీ)నే లేదు. ఈ లెక్కన కార్పొరేషన్‌ అధికారులు పీవోలు ఇచ్చేది 580 రకాలమందులకే. అయితే అవీ కూడాసక్రమంగా సీడీఎ్‌సల్లోఅందుబాటులో ఉంచలేకపోతున్నారు.

చాలా రకాలు బయటే కొనుగోలు..

ఈ మధ్య ఆరోగ్యశాఖ తెప్పించుకున్న నివేదికల ఆధారంగా.. విశాఖలో 450, కాకినాడలో 476, రాజమండ్రిలో 409, విజయవాడలో 360, మచిలీపట్నంలో 439, గుంటూరులో 433, కర్నూలులో 332, ఓంగోలులో 360, నెల్లూరులో 410, తిరుపతిలో 440, కడపలో 434 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో వైద్యులు రాస్తున్న మందులను రోగులు చాలా వరకు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో తమకు ఇదేమి బాధ అంటూ రోగులు గగ్గోలు పెడుతున్నారు.


అదనపు బడ్జెట్‌కు నో..

మరోవైపు మందుల కొరతకు ఆర్థిక శాఖ కూడా కొంత కారణమైంది. ఆస్పత్రుల్లో డ్రగ్స్‌, సర్టికల్స్‌కు కలిసి ప్రతి ఏటా దాదాపు రూ.700 కోట్ల వరకూ కేటాయిస్తున్నారు. 2023-24లోనూ రూ.500 కోట్లు బడ్జెట్‌ ఇచ్చి.. అదనంగా మరో రూ.200కోట్లు కేటాయించారు. 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించింది. ఆ ఏడాది డిమాండ్‌ ఆధారంగా మరో రూ.100 కోట్లు అదనంగా ఇచ్చింది. ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా అదనపు బడ్జెట్‌ ఇవ్వడం లేదు. 2025-26కు సంబంధించిన ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించగా.. అవి మూడో త్రైమాసికంలోనే ఖర్చయిపోయాయి. దీంతో నాలుగో త్రైమాసికా (జనవరి నుంచి మార్చి)నికి మందుల కొనుగోలుకు నిధులు లేవు. ఈ ఏడాది అదనపు నిధులివ్వాలని ఆరోగ్యశాఖ అడిగినా ఆర్థిక శాఖ పైసా కూడా ఇవ్వలేదు.

రూ.185 కోట్ల బిల్లులు పెండింగ్‌: ప్రస్తుతం డ్రగ్స్‌, సర్జికల్స్‌ బడ్జెట్‌ కలిపి దాదాపు రూ.185 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవికాకుండా ఎక్విప్మెంట్, సివిల్‌ బిల్లులు రూ.85 కోట్ల వరకూ సీఎఫ్ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. సాధారణంగా డ్రగ్స్‌, సర్జికల్‌ బిల్లులు ఆర్థిక శాఖ నుంచి విడుదల చేయించి, తర్వాత సివిల్‌ బిల్లులపై దృష్టి పెట్టాలి. కానీ ఆరోగ్యశాఖ అధికారులంతా రివర్స్‌లో వెళ్తున్నారు.

Updated Date - Mar 17 , 2026 | 05:04 AM