Deputy CM Pawan: నెలకోరోజు గ్రామాలకు వైద్యులు!
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:48 AM
వైద్యులు ఎంత బిజీగా ఉన్నా.. నెలకోసారి గ్రామాలు, గిరిజన ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు.
పల్లెలు, గిరిజన ప్రాంతాల్లో స్పెషలిస్టుల కొరత
నెలలో ఒకసారి అక్కడకు వెళ్లి సేవలందించాలి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచన
కాకినాడ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): వైద్యులు ఎంత బిజీగా ఉన్నా.. నెలకోసారి గ్రామాలు, గిరిజన ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. రాష్ట్రంలో అనేక గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో స్పెషలిస్టుల కొరత ఉందన్నారు. దీన్ని అధిగమించేందుకు వైద్యులు నెలలో ఒకసారి అక్కడకు వెళ్లి శిబిరాలు నిర్వహించి, వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలోని కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థులు రూ.10.11 కోట్లతో చేపట్టిన నూతన భవనాల నిర్మాణానికి పవన్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యులు పేద ప్రజలకు చికిత్సలు అందిస్తూ సమాజానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇటీవల అరకులో పర్యటించినప్పుడు, అక్కడ గిరిజన మహిళలు సికిల్‌సెల్, అనీమియాతో బాధపడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అందుకే అక్కడ తన వంతుగా, దాతల సహకారంతో బ్లడ్‌బ్యాంక్ భవనం నిర్మిస్తున్నట్లు పవన్ తెలిపారు. రంగరాయ మెడికల్ కాలేజీలో ఎందరో పేరున్న వైద్య నిపుణులున్నారని, వీరంతా గ్రామీణులకు కూడా సేవలందించాలని కోరారు. ఇక్కడ చదువుకొన్న పూర్వ విద్యార్థులు మెడికల్ కాలేజీ కోసం నూతన భవనం నిర్మించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. కొందరు ఇరుకు మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని, ప్రతి ఒక్కరూ విశాలంగా ఆలోచించాలని కోరారు.
మత చిచ్చుపెట్టే వారిని ఉపేక్షించొద్దు
మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసే శక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పవన్ కల్యాణ్ పోలీసులకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడొద్దని, కఠినంగా వ్యవహరించాలన్నారు. రెండోరోజు కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పవన్ జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. కమాండ్ కంట్రోల్‌రూం, పోలీస్ ఆఫీసర్ల జిమ్ తదితర విభాగాలను పరిశీలించారు. డయల్ 100 పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించవద్దన్నారు. అంతకుముందు గొల్లప్రోలులో సుద్దగడ్డ కాలువపై రూ.3.05 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని పరిశీలించారు.