హెల్త్ వర్సిటీలో ‘శంకర్‌దాదా’లు!
ABN , Publish Date - Apr 29 , 2026 | 04:32 AM
వైద్య విద్య వార్షిక పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ విద్యార్థులు నిఘా కళ్లకు చిక్కుతున్నారు. ఎంబీబీఎస్, పీజీ, డెంటల్, ఆయుష్ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడుతూ 20 మంది విద్యార్థులు అడ్డంగా దొరికారు.
మెడికల్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్
దొరికిపోయిన 20 మంది విద్యార్థులు
కాపీయింగ్‌ను గుర్తించిన నిఘా వ్యవస్థ
చీటీలతో 16 మంది.. స్మార్ట్‌వాచీలతో ఇద్దరు
సెల్‌ఫోన్లు వాడుతూ దొరికిన మరో ఇద్దరు
నిఘాకు చిక్కిన వారిలో ఇన్విజిలేటర్లు కూడా
పరీక్షల్లో పారదర్శకత పెంచాలి.. మంత్రి ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): వైద్య విద్య వార్షిక పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ విద్యార్థులు నిఘా కళ్లకు చిక్కుతున్నారు. ఎంబీబీఎస్, పీజీ, డెంటల్, ఆయుష్ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడుతూ 20 మంది విద్యార్థులు అడ్డంగా దొరికారు. వైద్య విద్య పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ఆరోగ్యశాఖ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీ సెంటర్)ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరాలు పరీక్షలు రాసే విద్యార్థులపై నిఘా పెడతాయి. వీటి ద్వారా విద్యార్థుల కదలికలను నిశితంగా పరిశీలిస్తారు. ఈ క్రమంలో చీటీలు, ఇతర మార్గాల్లో మాల్ ప్రాక్టీస్‌కుపాల్పడి.. జవాబులు రాస్తున్నవారు కెమెరాల కళ్లకు దొరికిపోతున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి దశల వారీగా ప్రారంభమైన యూజీ, పీజీ మెడికల్, ఆయుష్, డెంటల్ వార్షిక పరీక్షల సందర్భంగా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ 14 మంది విద్యార్థులు, ఆరుగురు విద్యార్థినులు దొరికారు. మంగళవారం పరీక్షలు రాసిన విద్యార్థుల్లో ముగ్గురు పట్టుబడ్డారు. వీరిలో ఇద్దరు హోమియో, ఒకరు ఆయుర్వేద విద్యార్థి ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా ఈ నెల 2 నుంచి మంగళవారం వరకు 20 మంది విద్యార్థులు పట్టుబడ్డారు. వీరిలో 16 మంది చీటీలతో దొరికిపోయారు. ఇద్దరు స్మార్ట్‌వాచీ లు, మరో ఇద్దరు సెల్‌ఫోన్లు వాడుతూ పట్టుబడ్డారు. ఈ విషయాన్ని హెల్త్ వర్సిటీ అధికారులు మంత్రి సత్యకుమార్‌కు వివరించారు.
తనిఖీలు దాటుకుని..
ఎగ్జామ్ హాల్ ప్రవేశ మార్గాల్లో తనిఖీలను కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ కొందరు వాటిని దాటుకుని దొంగచాటుగా సెల్‌ఫోన్‌లు, చీటీలను ఎగ్జామినేషన్ హాళ్లల్లోకి తీసుకెళ్తున్నారు. నిషిద్ధ స్మార్ట్ వాచీలను కూడా ఎగ్జామ్ హాల్‌లోకి తీసుకువెళ్లి వాటి సాయంతో జవాబులు రాసేందుకు ప్రయత్నించారు. ఇలాంటి వారు కెమెరాలకు చిక్కారు. దేశంలో కర్ణాటక తర్వాత ఏపీలోనే వైద్య విద్య పరీక్షల్లో పారదర్శకత పెంచేందుకు హెల్త్ వర్సిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంట ర్ ద్వారా పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. దీంతోపాటు ఇతర అంశాలపై కూడా హెల్త్ వర్సిటీ అధికారులు దృష్టి పెట్టారు.
540 కెమెరాలతో అనుసంధానం
రాష్ట్రంలోని 28 మెడికల్ కాలేజీలు, 9 డెంటల్ కాలేజీలు, 7 ఆయుష్ కళాశాలల్లో 540 కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. హెల్త్ వర్సిటీలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వీటిని అనుసంధానం చేశారు. సెంటర్‌లోని కెమెరాల ద్వారా ఇక్కడున్న సిబ్బంది విద్యార్థుల కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. వీడియో దృశ్యాల ద్వారా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే విశ్వవిద్యాలయం తరపున ఎగ్జామ్ హాల్‌లో పనిచేస్తున్న అబ్జర్వర్‌లకు సమాచారాన్ని పంపుతున్నారు. అబ్జర్వర్ వెంటనే సదరు గదిలోకి వెళ్లి విద్యార్థులను గుర్తించి తనిఖీ చేస్తున్నారు. తనిఖీల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు నిర్థారణ అయితే వెంటనే వారిని ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు పంపిస్తున్నారు. అక్కడ నుంచి మాల్ ప్రాక్టీస్ నిబంధనల ప్రకారం విద్యార్థిపై చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ కేసులను వర్సిటీలో ప్రత్యేక కమిటీ పరిశీలిస్తోంది. సదరు కేసుల తీవ్రత ఆధారంగా గరిష్ఠంగా రెండేళ్లు వరకు డీబార్ చేసే అవకాశం ఉంది.
ఇన్విజిలేటర్లూ దొరికారు!
నిబంధనల ప్రకారం పరీక్షల నిర్వహణలో నేరుగా పాల్గొనేవారు ఎవరూ సెల్‌ఫోన్లు వాడకూడదు. అయినప్పటికీ పలువురు ఇన్విజిలేటర్లు నిబంధనలను అతిక్రమించారు. రెండు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఒక్కొక్కరు చొప్పున ఇన్విజిలేటర్లు విద్యార్థుల ముందు సెల్‌ఫోన్ చూడడం.. కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది గమనించారు. దీనిపై చీఫ్ సూపరింటెండెంట్లకు సమాచారం అందించడంతో సదరు ఇన్విజిలేటర్లను తనిఖీ చేసి, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఇన్విజిలేటర్లను మూడేళ్ల పాటు పరీక్షల విధులకు దూరంగా ఉంచనున్నారు. మొత్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు కూడా పట్టుబడుతున్నారు. హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయిసుదీర్ నేతృత్వంలో ఈ నిఘా కొనసాగుతోంది.
పారదర్శకతలో రాజీపడొద్దు: మంత్రి సత్య
ప్రజారోగ్య వ్యవస్థలో వైద్య విద్య అత్యంత ముఖ్యమైందని మంత్రి సత్యకుమార్ అన్నారు. పరీక్షలు పారదర్శకంగా జరిగితేనే మెరిట్ విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో హెల్త్ వర్సిటీ అధికారులు రాజీపడవద్దని సూచించారు. ప్రస్తుత పరీక్షల ద్వారా వచ్చే అనుభవాలు పరిగణనలోనికి తీసుకుని పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.