తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
ABN , Publish Date - Mar 01 , 2026 | 11:04 PM
ఉమ్మడి జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి అధికారులను ఆదేశించారు.
బోర్లకు మరమ్మతులు చేపట్టాలి
కేజీబీవీల్లో సీట్ల సంఖ్య పెంపునకు ప్రతిపాదనలు
‘పది’లో వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి
జిల్లాపరిషత చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి
ముగిసిన సర్వసభ్య సమావేశం
కర్నూలు న్యూసిటీ, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం జెడ్పీ సమావేశ భవనంలో చైర్మన అధ్యక్షతన గ్రామీణ నీటి సరఫరా-పారిశుధ్యం, విద్యాశాఖ, ప్రజాపంపిణీ వ్యవస్థ అంశాలపై సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లా కలెక్టర్లు డా.ఏ.సిరి, రాజకుమారి, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, కురువ కార్పొరేషన చైర్మన దేవేంద్రప్ప, బొందిలి కార్పొరేషన చైర్మన విక్రమసింహ, ఉమ్మడి జిల్లాల జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. పాపిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని 8 మండలాలు కోడుమూరు, క్రిష్ణగిరి, వెల్దుర్తి, కౌతాళం, తుగ్గలి, నందవరం, కొలిమిగుండ్ల, నందికొట్కూరులో సుజల స్రవంతి కింద మదర్ ప్లాంట్లను రూ.14కోట్లతో ఏర్పాటుచేశారన్నారు. వాటిని వినియోగంలోకి తీసుకురాకుండా అధికారులు నూతనంగా ఆర్‌వో ప్లాంట్లను ఏర్పాటుచేయడం సబబు కాదని అన్నారు. ఈ ప్లాంట్ల ద్వారానే సమీప గ్రామాలకు తాగునీరు ఇవ్వడంతో పాటు కేంద్రంలో కూడా రోజుకి పదివేల లీటర్ల నీటిని ఇవ్వడానికి ఆస్కారం ఉందన్నారు. ఆ దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మళ్లీ కొత్తగా ఆర్‌వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ ప్రజాఽధనాన్ని దుర్వినియోగం వద్దని సూచించారు. గ్రామా ల్లో బోర్లకు మరమ్మతులు చేయడంతో పాటు నూతనంగా బోర్లు ఏర్పాటుచేసి దాహార్తిని కొంతవరకు తగ్గించేందుకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కేజీబీవీల్లో సీట్ల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రతి మండలానికి ఒక మోడల్ పాఠశాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నాడు-నేడు కింద మిగిలిన పనులు త్వరిగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లాలో పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణ సాధించేలా కృషిచేయాలని విద్యా శాఖ అధికారులకు సూచించారు. పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న అదనపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.
నీళ్లివ్వండి.. మహాప్రభో
ఉమ్మడి జిల్లాలో కొన్నిగ్రామాల్లో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, నీళ్లివ్వాలని జడ్పీటీసీలు వేడుకున్నారు. కొన్ని మండలాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించాలని, ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేయాలని కోరారు. కోడుమూరు, ఓర్వకల్లు, కొత్తపల్లి, వెల్దుర్తి, హలహర్వి, దొర్నిపాడు మండలాల్లో తీవ్ర నీటిఎద్దడి ఉందని, సమస్యను పరిష్కరించాలని జడ్పీటీసీలు చైర్మన దృష్టికి తీసుకొచ్చారు. నంద్యాల మండలంలోని 10 గ్రామాల్లో నీటి సమస్య ఉందని ఎంపీపీ, హలహర్విలో చేతి పంపులు మరమ్మతులు చేపట్టాలని జడ్పీటీసీ, వెల్దురికి తాగునీటి సమస్య పరిష్కారం కోసం బ్రహ్మగుండం నుంచి మరో పైప్‌లైన వేయాలని జడ్పీటీసీ సుంకన్న, కొత్తపల్లి మండలం గువ్వలకుంట, లింగాపురం గ్రామాల్లో నీటి వృథాను అరికట్టాలని, చేతి పంపులు రిపేరీ చేయాలని జడ్పీటీసీలు కోరారు.
సత్వరమే చర్యలు తీసుకుంటాం : డా.ఏ.సిరి, కర్నూలు జిల్లా కలెక్టర్
వేసవిలో తాగునీటి సమస్య రాకుండా సత్వరమే చర్యలు తీసుకుంటాం. ఎస్‌ఎస్(సమ్మర్ స్టోరేజీ) ట్యాంకులకు జనవరి 10 వరకు నీటిని విడుదల చేశాం. ఏప్రిల్ రెండో వారం నుంచి మళ్లీ తుంగభద్ర నీటిని విడుదల చేయాలని అదికారులను కోరాం. దేవనంకొండ మండలం లో మోడల్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తున్నాం. ‘అక్షరాంధ్ర’లో భాగంగా 1,61,000 మంది నిరక్షరాస్యులను గుర్తించి, 16,000 మంది వలంటీర్ల ద్వారా వారికి రెండు నెలలుగా విద్యను బోధిస్తున్నాం.
వాటర్ గ్రిడ్‌లకు ప్రతిపాదనలు: రాజకుమారి, నంద్యాల జిల్లా కలెక్టర్
డోన వాటర్ గ్రిడ్‌ను రూ.450కోట్ల వ్యయంతో అమలు చేస్తున్నాం. అదనంగా నంద్యాల జిల్లాలో మరో ఐదు వాటర్ గ్రిడ్‌ల కోసం సుమారు రూ.2500కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్ పరిశీలన పూర్తై, మంజూరుకు సిద్ధంగా ఉంది. కొత్తపల్లె మండలంలోని బావాపురంలో తాగునీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం. అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి.
నిధులు మంజూరు చేయాలి: గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్యే, పాణ్యం
పాణ్యం మండలం తమ్మరాజపల్లెలో పైప్‌లైన పనుల కోసం జెడ్పీ నుంచి రూ.4 లక్షల మంజూరు చేయాలి. గడివేముల మండలం కరిమద్ద గ్రామంలో కొత్గఆ బోరు వేయడంతో పాటు పైప్‌లైన పనుల కోసం రూ.5లక్షలు అవసరం. గని గ్రామంలో వాల్మీకి వీధిలో నీటి సమస్య ఉందని కనీసం రూ.4లక్షలు విడుదల చేయాలి. ఈ మూడు ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా జెడ్పీ నుంచి నిధులు మంజూరు చేయాలి.
తక్కువ ధరకే టెండర్లు వేస్తున్నారు : మానివి దేవేంద్రప్ప, చైర్మన, రాష్ట్ర కురువ కార్పొరేషన
ప్రస్తుతం ఎండాకాలం దృష్ట్యా ఎస్‌ఎస్ ట్యాంకుల రిపేరీ కోసం టెండర్లు పిలుస్తున్నారు. కొందరు 40 నుంచి 50 శాతం తక్కువ(లెస్) ధరకే టెండర్లు వేస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇంత తక్కువ ధరకు టెండర్లు తీసుకుంటే పనుల్లో నాణ్యత ఉండదు. తుంగభద్ర డ్యామ్ గేట్ల మరమ్మతులతో జనవరి 15 నుంచి నీటి సరఫరా ఆగిపోయింది. తక్షణమే నీటిని విడుదల చేయించాలి.
ఫ జిల్లా పరిషత, అనుబంధ శాఖల 2025-2026 సంవత్సర సవరణ బడ్జెట్, 2026-2027 ఆర్థిక సంవత్సర అంచనాల బడ్జెట్ వివరాలను జెడ్పీ డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బారెడ్డి సభ్యులకు చదివి వివరించారు. సభ్యులు ఆమోదం తెలిపారు.
ఫ ఉదయం జడ్పీ మినీ సమావేశ భవనంలో 1వ స్థాయీ సంఘ సమావేశం జరిగింది. అభివృద్ధి సంబంధించి 6 అంశాలను తీర్మానించారు. జెడ్పీ సీఈవవో జి.నాసరరెడ్డి, పరిపా లన అధికారులు జితేంద్ర, మురళీమోహనరెడ్డి, బసవశేఖర్, సరస్వతమ్మ పాల్గొన్నారు.