అరకొరగా పరిహారం!
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:34 AM
జిల్లాలోని అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పీచుమామిడి సమీపంలో శనివారం జరిగిన డీజిల్ పేలుడు ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోతే మృతుల కుటుంబాలకు పరిహారం అరకొరగా ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది.
పీచుమామిడి పేలుడు ఘటనలో ఏడుగురి మృతి
పోలీసు కేసు, కాంట్రాక్టర్‌తో రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటనతో సరిపెట్టిన యంత్రాంగం
పేలుడులో ఇళ్లు ధ్వంసమై ఇబ్బందులు పడుతున్న గిరిజనులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పీచుమామిడి సమీపంలో శనివారం జరిగిన డీజిల్ పేలుడు ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోతే మృతుల కుటుంబాలకు పరిహారం అరకొరగా ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది.
గతంలో రాష్ట్రంలో జరిగిన పలు ప్రమాదాల్లో మృతుల కుటుంబాలకు కనిష్ఠంగా రూ.25 లక్షలు, గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు పరిహారం అందించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అనంతగిరి మండలం పీచుమామిడి ఘటనలో ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకపోగా, రోడ్డు కాంట్రాక్టర్ సొమ్ముతో ఒక్కో కుటుంబానికి కేవలం రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు ప్రకటించడం విమర్శలకు తావిస్తున్నది. వాస్తవానికి కాంట్రాక్టర్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వమే కనీసం ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం అందించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మృతుల కుటుంబాలకు పరామర్శ ఊసేలేదు
పేలుడు ఘటనలో ప్రభుత్వ టీచర్‌తో సహా ఏడుగురు మృతి చెందినప్పటికీ వారి కుటుంబాలను అటు అధికారులు గాని, ఇటు ప్రజాప్రతినిధులు గాని పరామర్శించిన దాఖలాలు లేవు. మృతుల్లో టింక చంద్రవంశీసింగ్ బిహార్ రాష్ట్రం, నజీర్ అస్సాం రాష్ట్రం కాగా, ఆదిబోయిన గురుపవన్ కడప జిల్లా వాసి. మిగిలిన నలుగురు మృతులు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వాసులే. ఉపాధ్యాయిని జాగరపు సునీతది హనుమంతవాక, మాన్యాల మణికంఠ ది అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, పాంగి చిరంజీవి స్వస్థలం పెదబయలు, మండల నారాయణరావు అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం సూర్యనారాయణపురం గ్రామానికి చెందిన వ్యక్తి. అయినప్పటికీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం మృతుల కుటుంబీకులను మచ్చుకైనా పరామర్శించలేదు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ నిషాంతి, ఎస్‌పీ అమిత్‌బర్దార్ సైతం పీచుమామిడి ఘటనపై ప్రకటనలతో సరి పెట్టారు.
పోలీసు కేసుతో సరిపెట్టిన అధికారులు
పీచుమామిడిలో పేలుడు ఘటనలపై అనంతగిరి స్టేషన్‌లో పోలీసు కేసు నమోదుతో తమ పనైపోయిందని అధికారులు మిన్నకున్నారు. రోడ్డు నిర్మాణం చేపడుతున్న ఏకేవీఆర్ కనస్ట్రక్షన్ కంపెనీకి చెందిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారని, దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. కానీ వాస్తవానికి మొదటి రోజు మినహా తరువాత సంఘటనా స్థలానికి పోలీసులుగాని, జిల్లా స్థాయి అధికారులుగాని వెళ్లిన పరిస్థితి లేదు. అలాగే కేసు నమోదు చేసినప్పటికీ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు, అరెస్టులు చేయలేదు. ప్రధానంగా మండే స్వభావమున్న డీజిల్, పెట్రోల్ రవాణాతో పాటు నిల్వ, సరఫరా చేసే క్రమంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా, అటువంటివేవీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యహరించడం వల్లే పేలుడు సంభవించి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఇదేదో చిన్నా చితకా ప్రమాదమన్నట్టుగా అధికారులు మిన్నకుండడం గమనార్హం. రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో చోటు చేసుకుంటున్న చట్ట ఉల్లంఘనలపై పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు కనీసం దృష్టి సారించడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా డీజిల్, పెట్రోల్ వంటి చమురు పదార్థాలు, గ్యాస్ సిలిండర్లు, బండరాళ్లను పేల్చే జిలిటెన్ స్టిక్స్‌ను కనీస జాగ్రత్తలు పాటించకుండా అక్రమ రవాణా చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు.
ఇళ్లు ధ్వంసమైన గిరిజనులను పట్టించుకోరా?..
పేలుడు ఘటనతో పీచుమామిడి గ్రామంలోని 14 గిరిజన కుటుంబాలకు చెందిన ఇళ్లు ధ్వంసమయ్యాయి. కానీ వారికి ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏమిటని బాధిత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ స్థాయిలో భారీ పేలుడు జరగడం, ఏడుగురు మృతి చెందడం ఇదే ప్రప్రథమం. ఈ ఘటనపై అధికారులు స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.