Mauritius President Dharambeer Gokhool: ఏపీని మోడల్‌గా తీసుకుంటాం
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:30 AM
సంస్కృతి, సంప్రదాయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని మారిషస్ స్ఫూర్తిగా తీసుకున్నదని ఆ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ చెప్పారు.
రాష్ట్రం స్ఫూర్తిగా మారిష్‌స అభివృద్ధి : ధరమ్ బీర్ గోకుల్
తిరుమల, జనవరి7(ఆంధ్రజ్యోతి): సంస్కృతి, సంప్రదాయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని మారిషస్ స్ఫూర్తిగా తీసుకున్నదని ఆ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ చెప్పారు. తిరుమలలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాన్ని బుధవారం సందర్శించిన ఆయన అక్కడ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. మారిష్‌సలో నిర్మిస్తున్న హరిహర దేవస్థానంలో టీటీడీ సలహాలు, సూచనలతో వేదపాఠశాల ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. వేదవిజ్ఞానపీఠంలో ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని స్వాగతం పలికి వేదవిజ్ఞానపీఠం చరిత్రను వివరించారు.
శ్రీవారిసేవలో ధరమ్ బీర్ గోకుల్
మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. ధరమ్ బీర్ గోకుల్ ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, క్యాలెండర్, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు.