Share News

Mauritius President: 2 వారాలకో భాష కనుమరుగు

ABN , Publish Date - Jan 05 , 2026 | 03:30 AM

భాషా వారసత్వాన్ని కాపాడుకోవడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని మారిషస్‌ అధ్యక్షుడు ధరంబీర్‌ గోకుల్‌ అన్నారు. అటు మారిషస్‌, ఇటు భారతదేశం కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

Mauritius President: 2 వారాలకో భాష కనుమరుగు

  • ఈ శతాబ్దం చివరికి సగానికి పైగా అంతరించే ముప్పు

  • ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్‌ అధ్యక్షుడు ధరంబీర్‌ గోకుల్‌ ఆవేదన

  • ఏఐ, డిజిటల్‌ సాధనాలతో పరిరక్షించుకోవాలి

  • ఈ దిశగా చంద్రబాబు కృషి అభినందనీయం

  • మారిషస్‌లో ఉగాది జాతీయ సెలవు దినమని వెల్లడి

గుంటూరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): భాషా వారసత్వాన్ని కాపాడుకోవడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని మారిషస్‌ అధ్యక్షుడు ధరంబీర్‌ గోకుల్‌ అన్నారు. అటు మారిషస్‌, ఇటు భారతదేశం కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రపంచంలోని భాషల గురించి సమగ్ర సమాచారాన్ని అందించే ఒక ప్రసిద్ధి డేటాబేస్‌ ప్రకారం ప్రతి రెండు వారాలకు ఒక భాష కనుమరుగైపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. 21వ శతాబ్దం చివరికి ప్రపంచ భాషల్లో సగానికి పైగా అంతరించే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వాటిని కాపాడుకోవడానికి, విస్తృత వ్యాప్తి కల్పించడానికి కృత్రిమ మేధస్సు(ఏఐ), డిజిటల్‌ వేదికలు, బహుభాషా విద్యాభ్యాసాలు అసాధారణ సాధనాలుగా ఉపయోగపడుతున్నాయన్నారు. గుంటూరు శివారులో ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు రెండో రోజైన ఆదివారం గోకుల్‌ తన సతీమణి బృందా గోకుల్‌తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. తరతరాల మధ్య భాషా సంక్రమణలో ఉన్న ప్రధాన లోపాలను కూడా ఏఐ సాధనాలు బయటపెడుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటమ్‌ టెక్నాలజీ కోర్సులను ప్రవేశపెట్టి యువతకు భావితరం నైపుణ్యాలను అందించేందుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో డిజిటల్‌ వేదికల ద్వారా ఏఐపై అవగాహన కల్పిస్తున్నందుకు సీఎంను అభినందించారు. ‘చంద్రబాబు మారిషస్‌, ఇతర దేశాలతో సాంస్కృతిక, విద్యా సంబంధాల బలోపేతంలో కీలక పాత్ర పోషించారు. 2003లో ఆయన మారిషస్‌ సందర్శిం చినప్పుడు పాలన, విద్య, అభివృద్ధిపై ఫలప్రదమైన చర్చలు జరిగాయి. మన ఉమ్మడి భాషా, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం ముఖ్య ప్రాధాన్యాంశంగా చేసుకోవాలి’ అని తెలిపారు.


50 దేశాల్లో తెలుగు వాడకం..

ప్రపంచ చరిత్రలో ఒక కీలక సమయంలో ఈ మహాసభ జరుగుతోందని గోకుల్‌ అన్నారు. దేశంలో అత్యధిక జనాభా మాట్లాడే మూడో భాష తెలుగు. ఇది ఇప్పుడు 50 దేశాల్లో వాడుకలో ఉంది. మారిషస్‌ నుంచి కూడా మా ప్రతినిధి బృందం ఇక్కడకు వచ్చినందుకు అభినందిస్తున్నాను. మా దేశంలో తెలుగు భాష, సంస్కృతి మా జీవితంలో అంతర్భాగమయ్యాయి. మా పూర్వీకులు పుణ్యభూమి భారతం నుంచి మారిషస్‌ వచ్చి వారి భాషలను కాపాడుకుని.. సంప్రదాయాలు, విలువలను నిలబెట్టుకుని.. సగౌరవంగా భావితరాలకు అందించారు. రాజనీతికి మించిన సంబంధాన్ని నిలబెట్టేది ప్రజల మధ్య ఉన్న బలమైన, శాశ్వత అనుబంధమే’ అని స్పష్టం చేశారు. మారిష్‌సలోని తెలుగు సమాజం తమ దేశ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషిస్తోందని గోకుల్‌ వెల్లడించారు. అక్కడ తెలుగు భాషను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయుల్లో అధికారిక విద్యా వ్యవస్థలో బోధిస్తున్నామన్నారు.

ఏపీ అవతరణ దినోత్సవం మాకు వేడుక

‘ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నవంబరు 1న మారిష్‌సలో తెలుగు సమాజానికి మరో ముఖ్యమైన సాంస్కృతిక వేడుక. ఆ రోజు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం రోజున జాతీయ సెలవుదినంగా ప్రకటించాం. మారిష్‌సలోని హరిహర దేవస్థానంలో 108 అడుగుల అతి పెద్దదైన శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది’ అని చెప్పారు.


భారత మిత్ర అవార్డు ప్రదానం

కాగా.. గోకుల్‌కు ఆంధ్ర సారస్వత పరిషత్‌ తరఫున ‘భారత మిత్ర’ అవార్డును ప్రదానం చేశారు. పంచలోహ వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. గజమాలతో గోకుల్‌ దంపతులను ఘనంగా సత్కరించారు. పలువురికి ఆయన మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్‌, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మారిషస్‌ హరిహర దేవస్థానం నుంచి బృందావన్‌ పార్థసారఽథి, ఉత్తరాఖండ్‌ జోషిమఠ్‌ ఉత్తరాధికారి ముకుందానంద్‌ గిరి, మెట్రో ఇండియా చైర్మన్‌ సీఎల్‌ రాజం, ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌, మహాసభల సమన్వయకర్త పి.రామచంద్రరాజు పాల్గొన్నారు.

భాషా పరిరక్షణ మన ఇంటి నుంచే

ప్రారంభమవ్వాలి: త్రిపుర గవర్నర్‌

భాషా పరిరక్షణ మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని.. ప్రతి ఒక్కరూ ఇళ్లలో, కుటుంబ సభ్యులు మాతృభాషలో మాట్లాడటానికే ప్రాధాన్యం ఇవ్వాలని త్రిపుర గవర్నర్‌ ఎన్‌.ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి జరిగిన తెలుగు వైభవ సభలో ఆయన ముఖ్య అతిఽథిగా హజరై ప్రసంగించారు. త్రిపురలో బాధ్యతలు తీసుకున్న వెంటనే తెలుగు వారిని గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. వారిని ఒకే వేదికపైకి తెచ్చి సమావేశాలు నిర్వహించామన్నారు.


నేటితో ముగియనున్న సభలు

ప్రపంచ తెలుగు మహాసభలు సోమవారం సాయంత్రం ముగియనున్నాయి. ఉదయం జరిగే సభలో సీఎం చంద్రబాబు, గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం నుంచి జరిగే కార్యక్రమాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇతర ప్రముఖులు హాజరవుతారు.

తదుపరి తెలుగు మహాసభలు మారిష్‌సలో

2027 జనవరి 8, 9, 10 తేదీల్లో నిర్వహణ

తదుపరి ప్రపంచ తెలుగు మహాసభలు మారిషస్‌ దేశంలో 2027 జనవరి 8, 9, 10 తేదీల్లో జరగనున్నాయి. మారిషస్‌ నుంచి వచ్చిన ప్రతినిధి బృందంతో ఆ దేశ అధ్యక్షుడు ధరంబీర్‌ గోకుల్‌ సమక్షంలో ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఒప్పందం చేసుకుంది. ఆ మహాసభలకు అందరికి ఆహ్వానాలు పంపుతామని, అక్కడికి వెళ్లే విమానాలు తెలుగు భాషా ప్రియులతో నిండిపోవాలని సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - Jan 05 , 2026 | 03:34 AM