మన్యంలో మారిషస్ పైనాపిల్
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:59 AM
పార్వతీపురం జిల్లా సీతంపేట ప్రాంతంలో సుమారు 500 ఎకరాల్లో మారిషస్ పైనాపిల్ సాగవుతోంది.
పార్వతీపురం, జూన్ 16(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం జిల్లా సీతంపేట ప్రాంతంలో సుమారు 500 ఎకరాల్లో మారిషస్ పైనాపిల్ సాగవుతోంది. పామాయిల్, జీడి వంటి ఉద్యాన తోటల్లో అంతర పంటగా దీన్ని సాగు చేస్తున్నారు. ఎకరాకు సుమారు రూ.లక్ష ఆదాయం వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇక్కడి వాతావరణం పంట సాగుకు అనుకూలంగా ఉందని చెప్పారు. ఒక్కో పండు 4 కిలోల బరువు ఉంటోందని, కిలోకు రూ.30-35 లభిస్తోందని రైతులు చెబుతున్నారు.
ఎంతో ఆనందంగా ఉంది: అచ్చెన్న
‘సీతంపేట ఐటీడీఏ పరిధిలో ప్రయోగాత్మకంగా మారిషస్ పైనాపిల్ సాగుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తొలుత 50 ఎకరాల్లో సాగు చేశారు. అద్భుతమైన ఫలితాలు రావడంతో మరింత ప్రోత్సహించి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సహకారాన్ని అందిస్తున్నాం’ అని మంగళవారం పార్వతీపురంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.