యువత మత్తుకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:06 AM
యువత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని, మత్తు ఊబిలో కూరుకుపోకుండా వారిలో చైతన్యం కలిగించి సన్మార్గం వైపు మరలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని...
వివాహాలను సులభతరం చేయాలి.. ఇస్తేమాలో ధార్మిక పండితుల పిలుపు
కడప, జనవరి 24(ఆంధ్రజ్యోతి): యువత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని, మత్తు ఊబిలో కూరుకుపోకుండా వారిలో చైతన్యం కలిగించి సన్మార్గం వైపు మరలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఢిల్లీ నిజాముద్దీన్‌కు చెందిన ఇస్లాం ధార్మిక పండితుడు హజరత్ మౌలానా సాబ్ కాందలవి పేర్కొన్నారు. కడప జిల్లా సీకేదిన్నె మండలం కొప్పర్తి పారిశ్రామికవాడలో తబ్లిక్ జమాత్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఇస్తేమా రెండో రోజైన శనివారమూ కొనసాగింది. ఉదయం నుంచి రాత్రి వరకు పలువురు ధార్మిక పండితులు ఉపన్యసించారు. సమాజంలో శాంతి నెలకొని, భేదాభిప్రాయాలు తొలగాలంటూ సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మౌలానా సాబ్ కాందలవి, మౌలానా యూసు్‌ఫసాబ్ కాందలవి మాట్లాడుతూ మద్యం, జూదం తదితర వ్యసనాలకు నేటి యువత బానిసగా మారుతున్నదని, ఈ పరిణామం రేపటి తరానికి నష్టం చేకూర్చుతుందని హెచ్చరించారు. యువత బాధ్యతను గుర్తుచేసి, వారికి నమాజ్, సత్కార్యాలు, పాపభీతుల తారతమ్యాలను వివరించి దైవభీతితో రుజుమార్గంలో పయనించేలా చేయడమే ఇస్తేమా మూల ఉద్దేశ్యమని వివరించారు. వివాహాలను సులభతరం చేయాలని కోరారు. ఆర్భాటాలు, అట్టహాసాలతో ఆడపిల్లల కుటుంబాలపై అనవసరమైన ఖర్చులు మోపరాదన్నారు. వరకట్నం పేరిట అధిక మొత్తాల్లో నగదు, బంగారం వసూలు చేయడం సమ్మతం కాదన్నారు. పెళ్లి వయసు వచ్చినా వివాహాలు కాక తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారని, దీనిని సమతుల్యం చేయాల్సిన బాధ్యత ముస్లిం సమాజంపై ఉందని చెప్పారు. మంచిని వ్యాప్తి చేయడానికి ప్రతి ఒక్కరూ భూమండలంపై విస్తరించాలన్నారు. మానవ జన్మ ఎంతో విలువైందని, ఇహ పరలోక సాఫల్యం కోసం సత్కార్యాలు తప్ప మరో దారి లేదని వివరించారు.