Share News

మస్తర్‌.. మస్కా!

ABN , Publish Date - Feb 21 , 2026 | 01:10 AM

వీఎంసీ ప్రజారోగ్య విభాగంలో మస్తర్ల మాయాజాలం నడుస్తోంది. అక్రమ సంపాదన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం బురిడీ కొట్టించే కొత్త పంథాలు అనుసరిస్తున్నారు. ఐరిస్‌ మస్తర్‌ అమల్లో ఉన్నా యథేచ్ఛగా విధులకు పారిశుధ్య కార్మికులు డుమ్మా కొడుతున్నారు. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 800 నుంచి 1000 మంది పారిశుధ్య కార్మికుల గైర్హాజరవుతున్నారు. వీరంతా బయట మరింత ఆదాయం వచ్చే పనులకు వెళ్తున్నారు. ఇలా వెళ్లేందుకు వెసులుబాటు కల్పించినందుకు ఒక్కొక్క కార్మికుడు లీడ్‌ మేస్త్రీలకు రూ.500 నుంచి రూ.700 వరకు సమర్పిస్తున్నారని సమాచారం. ఈ విధంగా ఏటా రూ.18 కోట్ల వరకు అవినీతి జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.

మస్తర్‌.. మస్కా!

-వీఎంసీ ప్రజారోగ్య విభాగంలో భారీ అవినీతి

- ఐరిస్‌ మస్తర్‌ అమల్లో ఉన్నా.. యథేచ్ఛగా విధులకు డుమ్మా!

- రోజుకు 800 నుంచి 1000 మంది పారిశుధ్య కార్మికుల గైర్హాజరు

- వీరంతా బయట లాభదాయక పనులకు వెళ్తున్నట్టు సమాచారం

- మస్తరు వేసి బయటకు వెళ్లేందుకు లంచాల సమర్పణ

- ఒక్కొక్కరు రూ.500 నుంచి రూ.700 వరకు లీడ్‌ మేస్ర్తీలకు ఇస్తున్నట్టు సమాచారం

- సంవత్సరానికి రూ.18 కోట్ల వరకు జరుగుతున్న అవినీతి!

వీఎంసీ ప్రజారోగ్య విభాగంలో మస్తర్ల మాయాజాలం నడుస్తోంది. అక్రమ సంపాదన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం బురిడీ కొట్టించే కొత్త పంథాలు అనుసరిస్తున్నారు. ఐరిస్‌ మస్తర్‌ అమల్లో ఉన్నా యథేచ్ఛగా విధులకు పారిశుధ్య కార్మికులు డుమ్మా కొడుతున్నారు. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 800 నుంచి 1000 మంది పారిశుధ్య కార్మికుల గైర్హాజరవుతున్నారు. వీరంతా బయట మరింత ఆదాయం వచ్చే పనులకు వెళ్తున్నారు. ఇలా వెళ్లేందుకు వెసులుబాటు కల్పించినందుకు ఒక్కొక్క కార్మికుడు లీడ్‌ మేస్త్రీలకు రూ.500 నుంచి రూ.700 వరకు సమర్పిస్తున్నారని సమాచారం. ఈ విధంగా ఏటా రూ.18 కోట్ల వరకు అవినీతి జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

నగరంలో పారిశుఽధ్యాన్ని మెరుగుపరచటం కోసం కార్పొరేషన్‌ ప్రజారోగ్యశాఖ విభాగం పరిధిలో మొత్తం 3,450 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా కాంట్రాక్టు, ఎన్‌ఎంఆర్‌ కార్మికులే. వీరు కాకుండా మరో 300 మంది పర్మినెంట్‌ వర్కర్లు ఉన్నారు. నగరంలో 64 శానిటరీ డివిజన్లు ఉన్నాయి. ఇవి కాకుండా మలేరియా, నైట్‌ శానిటేషన్‌ విభాగాలలో కూడా పారిశుధ్య కార్మికులు పనిచేస్తారు. కార్పొరేషన్‌ ప్రజారోగ్య విభాగంలో ప్రతి 40 వేల మందికి ఒక శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఉంటారు. ఈ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పరిధిలో ముగ్గురు శానిటరీ మేస్త్రీలు పనిచేస్తారు. ఇలా ఉన్న ఐదుగురు శానిటరీ ఇన్‌స్పెక్టర్ల టీమ్‌కు ఒక శానిటరీ సూపర్‌వైజర్‌ ఉంటారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనధికారికంగా నగరంలో శానిటరీ వర్కర్ల నుంచి 170 మంది వరకు లీడ్‌ మేస్ర్తీలను తీసుకోవటం జరిగింది.

రూ.500 ఇస్తే పనిచేయకపోయినా మస్తర్‌ !

నగరంలో పారిశుధ్య విధులు నిర్వహించే విషయంలో పారిశుధ్య కార్మికులు విధిగా పనిచేసేలా చేయటం కోసం గతంలో ఉన్న మాన్యువల్‌ మస్తర్‌ విధానాన్ని కార్పొరేషన్‌ రద్దు చేసింది. ఆ స్థానంలో ఐరిస్‌ మస్తర్‌ విధానాన్ని తీసుకువచ్చింది. విధులకు వచ్చే ముందు, విధుల నుంచి వెళ్లిపోయే ముందు తప్పనిసరిగా ఐరిస్‌ వేయాల్సిందే. అప్పుడే వారు పనిచేసినట్టుగా పరిగణిస్తారు. ఈ ఐరిస్‌ మస్తర్‌ మాటున లీడ్‌ మేస్ర్తీలు పనిదొంగలకు వెసులబాటు కల్పిస్తున్నారు. పనిచేయకపోయినా పర్వాలేదు కానీ, ఐరిస్‌ వేసి వెళ్లిపోతే చాలు.. ఊరికినే మాత్రం కాదండోయ్‌! ఇలా పని తప్పించుకునేవాళ్లు లీడ్‌ మేస్ర్తీలకు ఐరిస్‌ వేసి వెళ్లిపోతే రూ.500 సమర్పించుకోవాలి. వీరికి వచ్చే జీతం రూ.25 వేలు కూడా ఉండదు. మరి వీరు లంచం ఎందుకిస్తారో అంటే పారిశుధ్య కార్మికులు బయట ఇంతకంటే ఎక్కువ డబ్బులు వచ్చే పనులకు ఒప్పుకుంటారు. ఇక్కడ రూ. 500 పోయినా అంతకంటే ఎక్కువుగా రూ. 2 వేలు ఆపైన పనులకు వెళ్తుంటారు కాబట్టి నష్టమన్నది లేదు. ఉదయం మస్తరు వేసి వెళ్లిపోతారు. వారి సొంత పని ముగించుకుని తిరిగి వచ్చేటపుడు మస్తరు వేసి వెళ్లిపోతారు. ఇలా ప్రతి రోజూ సగటున 800 నుంచి 1000 మందికిపైగా పారిశుధ్య కార్మికుల నుంచి లీడ్‌ మేస్ర్తీలు అడ్డగోలుగా ఐరిస్‌ మస్తర్లు తీసుకుని, వారిని వదిలేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఏడాదికి రూ.18 కోట్ల స్కామ్‌ జరుగుతోంది. రోజుకు సగటున రూ.5లక్షలు, నెలకు రూ.1.50 కోట్లు, ఏడాదికి రూ.18 కోట్ల మేర ప్రజాధనం లూటీ అవుతోంది.

ఐరిస్‌ మస్తర్‌ వేయకుండా అయితే సెప‘రేటు’!

ఐరిస్‌ మస్తర్‌ తీసుకుని వదిలేయటం ఒక ఎత్తు అయితే.. ఐరిస్‌ మస్తర్‌ తీసుకోకుండా వదిలేయటం మరో ఎత్తు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా ? కొంతమంది లీడ్‌ మేస్ర్తీలు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. తమ శానిటరీ డివిజన్‌ పరిధిలో పనిచేసే పారిశుధ్య కార్మికుల ఐరిస్‌తో కూడిన ఫొటోలను తీసుకుంటున్నారు. ఇవి సహజంగా అత్యంత నాణ్యంగా ఉంటాయి. వీటిని తమ ల్యాప్‌టాప్‌లలో భద్రం చేస్తున్నారు. వీటిని ఉపయోగించి లీడ్‌ మేస్ర్తీలే మస్తర్లు వేసేస్తున్నారు. ఇలా అయితే పారిశుధ్య కార్మికులు రూ.700 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం ఎక్కువుగా సెంట్రల్‌ నియోజకవర్గం పరిధిలోని సింగ్‌నగర్‌లో జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఒక లీడ్‌ మేస్ర్తీని గతంలో తొలగించినా.. మళ్లీ అదే పోస్టుకు వచ్చి ఇదే పనిచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

పర్మినెంట్‌ ఉద్యోగులకు ఏకంగా జీతగాళ్లు

నగర పారిశుధ్య విభాగంలో పనిచేసే పర్మినెంట్‌ పారిశుధ్య కార్మికులు మొత్తం 300 మంది ఉన్నారు. వీరిలో నూటికి తొంభై శాతంపైగా కార్మికులు క్షేత్ర స్థాయిలో అస్సలు పనిచేయడంలేదు. వీరికి నెల జీతం రూ.80 వేల నుంచి రూ.1.10 లక్షలు ఉంటుంది. తమ స్థానంలో ప్రైవేటుగా రూ.15 వేల నుంచి రూ.20 జీతం ఇచ్చి మరొకరిని పెట్టుకుంటున్నారు. ఇలా పెట్టుకున్నందుకు గాను శానిటరీ విభాగంతో పాటు, కార్పొరేటర్లకు కూడా వాటాలు వెళ్తున్నాయని సమాచారం.

పారిశుధ్య సమస్యలు ఉత్పన్నం

పారిశుధ్య బాధ్యతలు నిర్వహించాల్సిన కార్మికులు భారీ సంఖ్యలో విధులకు డుమ్మా కొడుతున్నారు. ఫలితంగా నగరంలో పారిశుధ్యలేమి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. నగరంలో దుమ్ము, ఽధూళి, వ్యర్థాల తొలగింపులో అంతులేని జాప్యం జరుగుతోంది.

పర్యవేక్షణ లోపం

ప్రజారోగ్య విభాగంలో అధికారులు కొందరు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించకపోవటంతోనే అవినీతికి కారణమవుతోంది. కార్పొరేషన్‌ ప్రజారోగ్యశాఖ ఉన్నతాధికారి నిజాయితీగా వ్యవహరిస్తున్నా.. తర్వాత స్థాయిలో కొందరు అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ సూపర్‌ వైజర్లు, లీడ్‌ మేస్ర్తీలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - Feb 21 , 2026 | 01:10 AM