Share News

Naidupeta Solar Manufacturing Hub: ఏపీలో భారీ సోలార్‌ కాంప్లెక్స్‌

ABN , Publish Date - Jan 13 , 2026 | 05:18 AM

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ సోలార్‌ ప్రాజెక్టు వస్తోంది. ప్రముఖ సంస్థ వెబ్‌సోల్‌ రెన్యువబుల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ రాష్ట్రంలో రూ.3,538 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

Naidupeta Solar Manufacturing Hub: ఏపీలో భారీ సోలార్‌ కాంప్లెక్స్‌

  • రూ.3,538 కోట్లతో వెబ్‌సోల్‌ సంస్థ ఏర్పాటు

  • నాయుడుపేటలో 8 గిగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌

  • ప్రాజెక్టు ద్వారా 2 వేల మందికి ఉద్యోగాలు.. 2027 నాటికి ఉత్పత్తి లక్ష్యం

  • దక్షిణ భారతంలోనే అతి పెద్ద సోలార్‌ తయారీ హబ్‌గా నాయుడుపేట

  • కమలపాడు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు డీపీఆర్‌కూ ఆమోదం

అమరావతి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ సోలార్‌ ప్రాజెక్టు వస్తోంది. ప్రముఖ సంస్థ వెబ్‌సోల్‌ రెన్యువబుల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ రాష్ట్రంలో రూ.3,538 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎంపీ సెజ్‌లో 8 గిగావాట్ల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కాంప్లెక్స్‌లో 4 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్‌ సెల్స్‌ తయారీ ప్లాంటు, 4 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్‌ మాడ్యూల్స్‌ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2 వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో 120 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారు. 2027 జూలై నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కాంప్లెక్స్‌కు అవసరమైన విద్యుత్తును స్వయంగా ఉత్పత్తి చేసుకునేలా సుమారు 300 ఎకరాల్లో 100 మెగావాట్ల క్యాప్టివ్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రీమియర్‌ ఎనర్జీస్‌, టాటా పవర్‌, వోల్ట్‌సన్‌ వంటి ప్రముఖ సంస్థలు సోలార్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లను నెలకొల్పుతున్నాయి.

కమలపాడు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు ఓకే..

అనంతపురం జిల్లా కమలపాడు వద్ద ఏపీజెన్కో, నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న పంప్డ్‌ స్టోరేజి హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 950 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 7,376.74 కోట్లు.

Updated Date - Jan 13 , 2026 | 05:19 AM