భారీగా గంజాయి పట్టివేత
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:19 AM
అనకాపల్లి మండలం కోడూరు వద్ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ) అధికారులు మంగళవారం భారీగా గంజాయిని పట్టుకున్నారు.
లారీలో 1300 కిలోలు తరలింపు
విలువ రూ.6 కోట్లకు పైగా
వేంపాడు వద్ద మరో 264 కిలోలు
కొత్తూరు (అనకాపల్లి)/నక్కపల్లి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలం కోడూరు వద్ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ) అధికారులు మంగళవారం భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారిపై ఉత్తరప్రదేశ్‌కు లారీలో గంజాయి తరలిస్తున్నట్టు విశాఖలో గల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు సమాచారం అందింది. దీంతో అనకాపల్లి జిల్లా మర్రిపాలెం వద్ద గల టోల్‌ప్లాజా వద్ద మాటువేశారు. ఈసమయంలో ఉత్తరాఖండ్‌కు చెందిన లారీ రాగా, డ్రైవర్ నార్కోటిక్స్ బృందాన్ని గమనించి టోల్‌ప్లాజా వద్ద కూడా ఆపకుండా వేగంగా ముందుకుపోనిచ్చాడు. బృందం వెనుక వెంబడించింది. అనకాపల్లి మండలం కోడూరు పంచాయతీ గొల్లపేట గ్రామం వద్ద లారీని విడిచి పెట్టి పారిపోయేందుకు డ్రైవర్ యత్నించగా, అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసుల సహాయంతో అనకాపల్లి డీఎస్పీ కార్యాలయం వద్దకు లారీని తరలించి తనిఖీ చేశారు. లారీ క్యాబిన్‌పైన ఐదు కిలోల చొప్పున 263 గంజాయి ప్యాకెట్లు, గోనె సంచుల్లో మరికొంత లోపల ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 1,305 కిలోల గంజాయి ఉందని, మార్కెట్ విలువ రూ.6 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ గంజాయిని రాయగడ నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి తరలిస్తున్నట్టు డ్రైవర్ తెలిపాడని అధికారులు చెప్పారు.
వేంపాడు వద్ద 264 కిలోల గంజాయి పట్టివేత
నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు మంగళవారం 264 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిని రవాణా చేస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు... సోమవారం వేంపాడు టోల్ ప్లాజా వద్ద నక్కపల్లి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా విశాఖ నుంచి తుని వైపు వెళుతున్న రెండు కార్లలో గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. వాహనాల్లో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకొని, గంజాయితో సహా పోలీసు స్టేషన్‌కు తరలించారు. మొత్తం 264 కిలోల గంజాయి ఉన్నట్టు నిర్ధారించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులు కేరళ రాష్ర్టానికి చెందిన సోమేశ్, హైదరాబాద్‌కు చెందిన కారు డ్రైవర్ కావటి సాయితేజ, మధ్యప్రదేశ్‌కు చెందిన సచిన్ గెహ్లాట్, అనకాపల్లి జిల్లా రోలుగుంటకు చెందిన రాజబాబుగా నిర్ధారణ అయింది. వీరు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో కిలో రూ.10 వేల చొప్పున గంజాయి కొనుగోలు చేసినట్టు విచారణలో తేలింది.