Share News

ఊరంతా ఈగల మోత

ABN , Publish Date - Jul 11 , 2026 | 04:03 AM

ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత అనేది మనకు తెలిసిన సామెత. కానీ, ఆ ఊరి జనం మాత్రం ఇంట్లోనే కాదు, బయట కూడా ఈగల దాడులతో బెంబేలెత్తిపోతున్నారు.

ఊరంతా ఈగల మోత

  • భోజనం లేదు.. నిద్రా లేదు.. ముసిరే ఈగలతో సతమతం

  • లక్షల్లో దండులా పడుతుండటంతో ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఊళ్లకు

  • పొలాలకు వెళ్లి వంట తయారీ

  • టెక్కలిలోని బాలకవానిపేటలో వింత పరిస్థితి..

టెక్కలి రూరల్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత అనేది మనకు తెలిసిన సామెత. కానీ, ఆ ఊరి జనం మాత్రం ఇంట్లోనే కాదు, బయట కూడా ఈగల దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. రాజమౌళి నిర్మించిన ‘ఈగ’ సినిమాను గుర్తుకు తెచ్చేలా.. పగ పట్టినట్టు ఈగల దండు గ్రామస్థులను ఉరికిస్తోంది. ఒకటి కాదు..రెండు కాదు.. లక్షల్లో వచ్చిపడుతుండటంతో ఆ ఊరు దాదాపు ఖాళీ అవుతున్న పరిస్థితి! ఆ ఊరి పేరు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బూరగాం గ్రామపంచాయతీలోని బాలకవానిపేట. 13 ఇళ్లు, 60 మంది జనాభా ఉన్న ఊరది. అపరిశుభ్ర పరిసరాల్లో ఈగలు తిరుగుతుండటం సహజమే. కానీ ఆ గ్రామం చాలా పరిశుభ్రంగా ఉంటుంది. 4 రోజుల క్రితం చిన్నపాటి వర్షం పడింది. అప్పటినుంచి ఈగలు విపరీతంగా పెరిగిపోవడం గుర్తించారు. అవి జనాలను ఏ పనులూ చేసుకోనీయడం లేదు. ముఖాల నిండా ముసురుతుండటంతో వంట చేద్దామన్నా, వండింది తిందామన్నా.. చివరకు నీళ్లు తాగుదామన్నా వీలు కాని పరిస్థితి. ఓచోట స్థిమితంగా కూడా కూర్చోలేక పోతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్ల మీద ముసురుతూ చిన్న కునుకు కూడా తీయనీయడం లేదని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇళ్లకు తాళాలు వేసి జనం తమ బంధువుల ఊర్లకు వెళ్లిపోతున్నారు. పశువులను, ఇంటిని వదిలేసి వెళ్లలేనివారు పొలాలకు వెళ్లి అక్కడే వంట చేసుకుని తింటున్నారు.


మొదటి రెండు రోజులు పసుపునీరు చల్లడంతో పాటు మస్కిటో బ్యాట్‌తో ఈగలను చంపామని, ఆ తర్వాత మరింత ఎక్కువ అయ్యాయని గ్రామస్థులు చెబుతున్నారు. దోమతెరలు కట్టుకుని పడుకుందామన్నా వాటి మోతకు నిద్రరావడం లేదంటున్నారు. శివారున కోళ్లఫారాలు నడుపుతున్నారని, వాటివల్ల కూడా ఈగలు వచ్చుంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల వ్యర్థాలు కుళ్లిపోవడం వల్ల ఈగల బెడద పెరిగిందని అంటున్నారు. ఎంపీడీవో రేణుక శుక్రవారం గ్రామస్థులతో మాట్లాడారు. ఈగల నివారణ మందు పిచికారీ చేయించారు. అయినా తగ్గడం లేదని గ్రామస్థురాలు జ్యోతి తెలిపారు.


బంధువులు రావడానికి భయపడుతున్నారు : సాయమ్మ

‘‘ఈగల బెడదతో తిండి ఉండటం లేదు. నిద్ర పట్టడం లేదు. గ్రామానికి బంధువులు రావడానికి భయపడుతున్నారు. మా పిల్లలను బంధువుల ఊర్లకు పంపించాం.’’

భయమేస్తోంది: బాలక హేమలత

‘‘ఈగల బాధ తట్టుకోలేకపోతున్నాం. చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. భయం వేస్తోంది.’’

వంట కూడా చేసుకోలేక పోతున్నాం: బి.లక్ష్మి

‘‘వంట చేసుకోలేక పోతున్నాం ఎంత జాగ్రత్తగా చేద్దామన్నా ఈగలు పడుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలి.’’

Updated Date - Jul 11 , 2026 | 04:05 AM