దారులన్నీ దర్గా వైపే!
ABN , Publish Date - Jun 29 , 2026 | 05:50 AM
నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగకు ఆదివారం భక్తులు పోటెత్తారు. దారులన్నీ దర్గావైపే అన్నట్టుగా నగర ప్రధాన రోడ్లు, వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి.
నెల్లూరు(సాంస్కృతికం) జూన్ 28 (ఆంధ్రజ్యోతి): నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగకు ఆదివారం భక్తులు పోటెత్తారు. దారులన్నీ దర్గావైపే అన్నట్టుగా నగర ప్రధాన రోడ్లు, వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు ఘాట్ ప్రాంతాల్లో ఇసుక వేస్తే రాలనంత జనంచేరారు. పండుగలో ప్రధాన ఘట్టమైన గంధమహోత్సవం శనివారం అర్ధరాత్రి తర్వాత (ఆదివారం తెల్లవారుజాము) వేడుకగా జరిగింది. కోటమిట్టలోని అనీమియా మసీదులో 12 బిందెల్లో గంధం కలిపి ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకొచ్చారు. కడప పీఠాధిపతి ఆరీఫుల్లా హుసేనీ, శిష్యులు సమాధులకు గంధం లేపనం చేశారు. అనంతరం భక్తులకు గంధం అందజేశారు. ఈ ఘట్టం ముగియడంతో ఆదివారం రొట్టెలపండుగ జరిగింది. సెలవురోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. చదువు, వివాహ, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఆరోగ్యం, గృహం, సౌభాగ్యం, ప్రమోషన్ల రొట్టెలను అడిగి మరీ పట్టుకున్నారు. పగలంతా ఎండతో అల్లాడిపోయిన భక్తులు సాయంత్రం ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచడంతో సేద తీరారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. పోలీసులు విస్తృత బందోబస్తు నిర్వహించారు. సర్వేపల్లి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, స్వర్ణాల చెరువులో రొట్టెలు అందుకున్నారు. పేద విద్యార్థులందరికీ ఉచితంగా కార్పొరేట్ విద్య అందాలని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ భారీ రొట్టెను అందుకున్నారు.