Sankranti Betting: కోట్లలో కూత
ABN , Publish Date - Jan 17 , 2026 | 03:31 AM
సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. కోళ్లు కత్తులు రువ్వి నిర్వాహకుల పంట పండించాయి. కోడిపందేలతోపాటు గుండాట, కోతాటలతో హోరెత్తించారు.
దాదాపు రూ.2 వేల కోట్ల పందేలు
పండగ మూడు రోజులూ ‘బరి’లోనే గోదారి
తెలంగాణ వాసుల రాకతో జోష్
పశ్చిమలో రూ.300 కోట్లు
గుండాట, పేకాటల జాతర రూ.500 కోట్లు
రూ.800 కోట్లు రాబట్టిన ‘కృష్ణా’
బాపట్లలో 200 కోట్ల పందేలు
తాడేపల్లిగూడెంలో ఒకే పందెం రూ.1.53 కోట్లు
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. కోళ్లు కత్తులు రువ్వి నిర్వాహకుల పంట పండించాయి. కోడిపందేలతోపాటు గుండాట, కోతాటలతో హోరెత్తించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో మూడు రోజుల్లో రూ.500 కోట్ల వరకు పందేలు తెగినట్టు అంచనా. ఒక్క కాకినాడ జిల్లాలోనే ఏకంగా రూ.250 కోట్ల లావాదేవీలు సాగినట్టు చెబుతున్నారు. ఒక్కో బరి వద్ద మూడు నుంచి నాలుగు గుండాట బోర్డులు ఏర్పాటు చేయించి నిర్వాహకులు లాభాలు వెనకేసుకున్నారు. కరప మండలంలో కోడిపందేలు మూడు రోజులు కలిపి రూ.15 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయి. తాళ్లరేవులో అధికార పార్టీకి చెందిన ఓ కీలకనేత యానాం రిసార్ట్‌లో 40 గదులు బుక్ చేయించి మూడు రోజులు రేయింబవళ్లు పేకాట ఆడించారు. మూడు బోర్డుల గేమ్ పేకాటలో రోజుకు మొదటి విన్నర్ రూ.కోటి వరకు గెలుచుకున్నారు. మగువలను కూడా తీసుకువచ్చి చిందులేశారు. మొత్తం పేకాట టర్నోవర్ రూ.12 కోట్లని అంచనా. కాకినాడ రూరల్, కరప, ఉండూరు, కందరాడ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన పందేల వద్ద ప్రవేశ రుసుం కనీసం రూ.1.50 లక్షలుగా ఉంది. ఎక్కడిక్కడ భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. పందేలు తిలకిస్తున్న వారికి ఉదయం టిఫిన్, మధ్యలో స్నాక్స్, పలు రకాల వంటలతో మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఏర్పాటుచేశారు. పలు బరుల వద్ద రక్షణ కోసం బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. తునిలో రూ.8 కోట్లకుపైగా పందేలు జరిగాయి. పక్కనే ఉన్న అనకాపల్లి, విశాఖ జిల్లాల నుంచి పందెం రాయుళ్లు ఇక్కడకు పోటెత్తారు.
కోనసీమలో పందేల జోరు...
ఫ్లడ్‌లైట్లు, డిజిటల్ స్ర్కీన్‌లతో సర్వహంగులతో అంబేడ్కర్ కోనసీమ జిలాల్లోని ఐ.పోలవరం మండలం మురమళ్లలో ఏర్పాటుచేసిన అతిపెద్ద కోడిపందాల బరికి ప్రముఖులు పోటెత్తారు. ఇక్కడ కోట్లాది రూపాయలు చేతులు మారాయి. జిల్లావ్యాప్తంగా వందకుపైగా పందెంబరులతోపాటు వందలాది బోర్డులతో గుండాటలు, పేకాటలు వంటివి జోరుగా సాగాయి. మూడురోజులపాటు సుమారు రూ.150 కోట్ల మేర జూద క్రీడల జాతరలో వెచ్చించినట్టు సమాచారం. ఉభయ తెలుగురాష్ట్రాల నుంచి పందెంరాయుళ్లు ముఖ్యంగా మహిళలు కోడిపందాలను తిలకించారు. మురమళ్ల బరి వద్ద పార్లమెంటు సభ్యులు గంటి హరీశ్‌బాలయోగి(అమలాపురం), తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ (కాకినాడ), ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బరాజు(ముమ్మిడివరం), గిడ్డి సత్యనారాయణ(పి.గన్నవరం), ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, నిర్మాత ఆదిత్యరామ్, సినీ నటి హేమ సహా అనేకమంది ప్రముఖులు వీక్షించారు. ఇక రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట నియోజకవర్గాల పరిధిలో 20కి పైగా ప్రాంతాల్లో అశ్లీల రికార్డింగ్ డాన్స్‌లు హోరెత్తిపోయాయి.
‘తూర్పు’ పందెం రూ.100 కోట్లపైనే
తూర్పుగోదావరి జిల్లాలో చాలాచోట్ల కార్పొరేట్ లెవల్‌లో కోడి పందాలు, గుండాటలు, పేకాటలు జోరుగా సాగాయి. రూ.100కోట్లకుపైగానే చేతులు మారినట్టు అంచనా. మొత్తం 150 వరకూ బరులు నిర్వహించారు. ఒక్కో బరి వద్ద నాలుగు నుంచి ఆరు వరకు గుండాట బోర్డులు ఏర్పాటు చేశారు. ఈసారి బరులను కొంతమంది వ్యక్తులు పాడుకోవడం గమనార్హం. బరిని బట్టి రూ.లక్ష నుంచి కోటి వరకూ పాడుకున్నారు. పందెం కమీషన్లుతోపాటు, గుండాట నిర్వాహకులు ఇచ్చే సొమ్ము, పేకాట, మద్యం. ఇతర దుకాణాల నుంచి వచ్చే సొమ్ముతో వీళ్లు లాభాలు గడించారు. ఇక.. పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు రోజులు కలిపి సుమారు రూ. 300 కోట్లు చేతులు మారాయి. ఉండి నియోజకవర్గం కాళ్ల మండలంలోని పెద అమిరం, సీసలి బరుల్లో ప్రతి పందెం కనిష్ఠంగా రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు కాశారు.
‘బాపట్ల’లో 200 కోట్ల పందేలు
బాపట్ల జిల్లావ్యాప్తంగా నిర్వహించిన కోడి పందేల్లో దాదాపు రూ.200 కోట్ల వరకు చేతులు మారినట్లు సమాచారం. ఒక్క చెరుకుపల్లి మండల పరిధిలో ఏర్పాటు చేసిన బరిలోనే పండుగ 3 రోజుల్లో దాదాపు రూ.100 కోట్ల వరకు పందేలు సాగినట్లు అంచనా. పిట్టలవానిపాలెం మండల పరిధిలోని బరిలో రూ.60 కోట్ల లావాదేవీలు జరగ్గా, వేమూరు పరిధిలో కూడా భారీగానే పందే లు కాశారు. బరుల వద్ద గుండాట, పేకాట యథేచ్ఛగా కొనసాగాయి. ప్రధాన బరుల వద్ద నిర్వహించిన కోడి పందేల్లో ఆరుగురు బుల్లెట్లను గెలుచుకున్నారు. పల్నాడు జిల్లాలో ప్రతి పందేనికి రూ.లక్షల్లో నగదు చేతులు మారింది.
ఏలూరులో 200 కోట్లు తెగాయి
ఏలూరు జిల్లాకు ఈసారి పెద్దఎత్తున తెలంగాణ జిల్లాల నుంచి ప్రముఖులు, పలువురు ప్రజా ప్రతినిధులు పోటెత్తడంతో కోడి పందేలు రంజుగా సాగాయి. భోగి నుంచి కనుమ పండగ శుక్రవారం సాయంత్రం వరకు రూ.200 కోట్ల పైగా పందేలు తెగినట్టు చెబుతున్నాయి. నూజివీడు మండలం మీర్జాపురం పది ఎకరాల బరితో కలిపి, మరికొన్ని బరుల్లో మెట్టగూడెం, నూజివీడు టౌన్, సిద్ధార్థనగర్, ఆగిరిపల్లి, జనార్దనవరం, కోటపాడు, ముసునూరు, చెక్కపల్లి, కాట్రేనిపాడు కోడి పందేల్లో రూ.120 కోట్ల పైమాటే చేతులు మారినట్లు అంచనా. ఈసారి పెద్దఎత్తున తెలంగాణ వాసులు, ప్రముఖు రాకలతో శిబిరాలు హైటెక్ సొబగులను అద్దుకున్నాయి. యథేచ్ఛగా గుండాట, పేకాట, లోపల-బయట మ్యాచ్‌ల్లో రూ.100 కోట్ల పైబడి చేతులు మారాయి. కైకలూరులోని భుజబలపట్నంలో ఎమ్మె ల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ మాగంటి బా బు, జబర్దస్త్ అవినాశ్ పందెం పోటీలను తిలకించా రు. ముదినేపల్లి మండలంలో అల్లూరు, పెయ్యేరు, పెదపాలపర్రు, సింగరాయపాలెం-కోరుకొల్లు రోడ్లవద్ద భారీ ఎత్తున పందేలు జరిగాయి. గురు, శుక్రవారాల్లో రూ.5 కోట్ల చేతులు మారాయి. ఏడు బుల్లెట్‌లు, కారు, రెండు హోండా యాక్టివాలను ఎక్కువ పందేలను గెలుచుకున్న వారికి బహూకరించారు. కొయ్యలగూడెం రామానుజపురంలో 4 ఎకరాల తోటల్లో కోడి పందేలు నిర్వహించారు. రూ.3.5 కోట్లు చేతులు మారాయి. లింగపాలెం మండలంలో భారీ పందెలు జరిగాయి. ఇక్కడ యాంకర్ ఆర్‌ఏ శ్యామల తిలకించేందుకు వ చ్చారు.