భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
ABN , Publish Date - May 02 , 2026 | 04:42 AM
రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో, వివిధ హోదాల్లో పనిచేస్తున్న పలువురు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఖాళీగా ఉన్న కీలకమైన డివిజన్లకు ఆర్డీవోలను, జిల్లాలకు..
కీలకమైన డివిజన్లకు ఆర్డీవోలు.. జిల్లాలకు డీఆర్వోల నియామకం
పలు శాఖల్లో డీసీ పోస్టుల భర్తీ : ఉత్తర్వులు జారీ
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో, వివిధ హోదాల్లో పనిచేస్తున్న పలువురు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఖాళీగా ఉన్న కీలకమైన డివిజన్లకు ఆర్డీవోలను, జిల్లాలకు డీఆర్వోలను నియమించింది. పలు శాఖల్లో డీసీ పోస్టులను భర్తీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో మార్చి మొదటి, రెండో వారాల్లో భారీగా ఆర్డీవోల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. కొత్త అధికారులను వెంటనే ఆయా పోస్టులకు పంపించాలని భావించినా ప్రజాప్రతినిధుల సిఫారసులతో వ్యవహారం రచ్చకెక్కింది. దీంతో సీఎం జోక్యం చేసుకొని బదిలీల ప్రక్రియను నిలిపివేశారు. రెవెన్యూ, సాధారణ పరిపాలన శాఖలు సంయుక్తంగా ఇచ్చిన పోస్టింగ్ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించింది. నిఘా నివేదికలు తెప్పించుకుంది. అయినా అనేక అంశాలు తెరపైకి రావడంతో ఆ ప్రక్రియ కొలిక్కిరాలేదు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జనగణన మొదలైంది. ఇంకా ఎనిమిది జిల్లాలకు డీఆర్వోలు, 28 డివిజన్లకు ఆర్డీవోలు లేరు. ఈ ప్రభావం జనగణనపై పడుతోందని, తక్షణమే డిప్యూటీ కలెక్టర్ పోస్టింగ్‌లు ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లు కోరుతున్నారు. సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చిన రె వెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గతనెల రోజులుగా పెండింగ్‌లో ఉన్న బదిలీల జాబితాను కొలిక్కి తీసుకొచ్చారు. దాన్ని సీఎం చంద్రబాబు ఆమోదించడంతో మొత్తం 25మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు (జీవో 886) జారీ చేశారు.
డీఆర్వో బదిలీలు...
పి. రోహిణి (ఏలూరు జిల్లా), పి. కొండయ్య (శ్రీసత్యసాయి జిల్లా), వి. సుబ్బారావు (కోనసీమ జిల్లా), ఎం. రాజేశ్వరి (అల్లూరి జిల్లా)
ఆర్డీవో బదిలీలు...
జి.వి.వి. సత్యనారాయణ (కొత్తపేట), ఎ. సరళావతి (రామచంద్రాపురం), వెన్నెల శ్రీను (విజయవాడ), జి. అనిల్‌కుమార్ (నందిగామ), టి. అజయ్‌కుమార్ (కనిగిరి), చిన్న ఓబులేసు (పత్తికొండ), తుమ్మటి చంద్రశేఖర్‌నాయుడు (ఒంగోలు). కె. స్వాతి (రంపచోడవరం). మిగిలినవారిని ఏపీసీఆర్‌డీఏ, పురపాలక శాఖ, విద్యాశాఖలోని సమగ్ర శిక్షాభియాన్ ప్రాజెక్టులకు బదిలీ చేశారు.