చెక్ పవర్‌ను పునరుద్ధరించండి
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:31 AM
వ్యవసాయ మార్కెట్ కమిటీల(యార్డు) చైర్మన్లకు చెక్ పవర్‌ను పునరుద్ధరించాలని యార్డు చైర్మన్ల సంఘం మంత్రి లోకేశ్‌ను కోరింది.
లోకేశ్‌కు మార్కెట్ యార్డు చైర్మన్ల విజ్ఞప్తి
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కెట్ కమిటీల(యార్డు) చైర్మన్లకు చెక్ పవర్‌ను పునరుద్ధరించాలని యార్డు చైర్మన్ల సంఘం మంత్రి లోకేశ్‌ను కోరింది. చైర్మన్ల పదవీ కాలం కనీసం మూడేళ్లు ఉండేలా నిబంధనలను సవరించాలని విజ్ఞప్తి చేసింది. మంగళవారం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి లోకేశ్‌ను యార్డు చైర్మన్ల సంఘం కలిసి సమస్యలను వివరించింది. కమిటీల బలోపేతానికి, అలాగే, క్షేత్రస్థాయిలో రైతులకు మరిన్ని సేవలు అందించడంలో తమకు భాగస్వామ్యం కల్పించాలని కోరింది. ఇందుకోసం నిబంధనల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా రైతు శ్రేయస్సే లక్ష్యంగా మార్కెట్ కమిటీలను అభివృద్ధి చేసేలా, చైర్మన్ల అలవెన్సుల్లో తేడా లేకుండా ఒకేలా ఉండేలా, తెలంగాణ తరహాలో ఏపీలోనూ అమలు చేయాలని, రైతుబజార్లపై పర్యవేక్షణ యార్డుల చైర్మన్లకు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది. జిల్లా, నియోజకవర్గ పరిధిలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్లకు ప్రోటోకాల్ వర్తించేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటుపల్లి హరిబాబు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తదితరులు తెలిపారు.