Share News

నిధులున్నా.. ఖర్చుకు అధికారమేదీ?

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:18 AM

రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు కమిటీలు నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నాయి! ప్రభుత్వం నామినేషన్‌ పద్ధతిలో నియమించే యార్డుకమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యారు!

నిధులున్నా.. ఖర్చుకు అధికారమేదీ?

  • అభివృద్ధి పనులకు ‘చెక్‌ పవర్‌’ ఇవ్వాలి

  • పదవీ కాలం కనీసంగా రెండేళ్లతో పాటు గౌరవ వేతనం పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

  • త్వరలో సీఎంను కలవనున్న చైర్మన్ల సంఘం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు కమిటీలు నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నాయి! ప్రభుత్వం నామినేషన్‌ పద్ధతిలో నియమించే యార్డుకమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యారు!! నిధుల వినియోగం విషయంలో అధికారాలు లేక తమ పోస్టులు అలంకారప్రాయంగా మారాయని వారు అంటున్నారు. మార్కెట్‌ కమిటీల చైర్మన్ల పదవీ కాలాన్ని కనీసం రెండేళ్లకు పెంచడం, గౌరవ వేతనం పెంపుదల, మార్కెట్‌ కమిటీలు చేసే అభివృద్ధి పనుల చెక్కులపై సంతకాలు చేసే అధికారాన్ని చైర్మన్లకు పునరుద్ధరించడంతో పాటు పలు ఇతర అంశాలను పరిష్కరించాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చైర్మన్ల సంఘం కోరుతోంది. ఈ మేరకు దీనిపై మరోసారి సీఎం చంద్రబాబును కలవాలని సంఘ ప్రతినిధులు యోచిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల విధివిధానాల్లో ప్రభుత్వ నిబంధనల మార్పు కోరుతూ.. వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను వసూలు, చైర్మన్ల గౌరవ వేతనాలు పెంపు, ఇతర అధికారాల వర్తింపు, కమిటీల ద్వారా వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు వంటి అంశాలను మార్కెట్‌ కమిటీల చైర్మన్ల సంఘం ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో మార్కెట్‌ యార్డుల్లో గత వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసిన రైతుబంధు పథకాన్ని కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. యార్డు గోదాముల్లో పంట ఉత్పత్తిని నిల్వ చేసి, 90 రోజుల పాటు వడ్డీ లేని రుణాలు తీసుకునే వెసులుబాటును రైతులకు కల్పించింది. అలాగే ప్రతి యార్డు పరిధిలో అభివృద్ధి పనులకు రూ.కోటి మంజూరు చేసింది. కానీ నిబంధనల సాకుతో చాలా చోట్ల పనులు చేయకుండా అధికారులు సహకరించడం లేదని చైర్మన్లు వాపోతున్నారు. యార్డు పరిధిలోని పశుపోషకుల కోసం ఏటా రూ.50 వేల ఖర్చుతో ఉచిత పశువైద్య శిబిరాలకు ప్రభుత్వం అనుమతించింది. తిరుపతి శ్రీవారి ఆలయంలో యార్డు చైర్మన్లు, డైరెక్టర్లకు ఎల్‌1 దర్శనానికి అనుమతించింది. అయితే ఇంకా కీలక అంశాల్లో తమ విజ్ఞప్తులను అధికారులు పెడచెవిన పెడుతున్నారని పలువురు చైర్మన్లు పెదవి విరుస్తున్నారు.


సంఘం విజ్ఞప్తుల్లో కొన్ని..

  • మార్కెట్‌ కమిటీల చైర్మన్ల పదవీ కాలాన్ని కనీసం రెండేళ్లకు పెంచడం.

  • మార్కెట్‌ కమిటీలు చేసే అభివృద్ధి పనుల చెక్కులపై సంతకాలు చేసే అధికారాన్ని చైర్మన్లకు పునరుద్ధరించడం.

  • పుంత (లింక్‌) రోడ్ల నిర్మాణానికి యార్డు ఆదాయంలో 50 శాతం నిధులు ఖర్చు పెట్టేందుకు చైర్మన్లకు అనుమతివ్వడం.

  • రూ.10 లక్షల లోపు పనులను నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చే అధికారం చైర్మన్లకు ఇవ్వడం.

  • మార్కెట్‌ కమిటీల నిధుల నుంచి పెన్షన్‌ కంట్రిబ్యూషన్‌ తగ్గించడం.

  • రైతుబజార్లలో యార్డు కమిటీల భాగస్వామ్యాన్ని పెంచడం, చైర్మన్లకు కీలక పాత్ర కల్పించడం.

  • తెలంగాణ తరహాలో రాష్ట్రంలోనూ యార్డు కమిటీ చైర్మన్ల గౌరవ వేతనం పెంచడం.

  • కమిటీల జనరల్‌ బాడీ మీటింగ్‌ అలవెన్సును చైర్మన్‌, వైస్‌చైర్మన్‌, డైరెక్టర్లకు ఒకేలా ఇవ్వడం.

Updated Date - Aug 17 , 2026 | 05:18 AM