Share News

మార్కెట్‌ విలువలు ఖరారు!

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:42 AM

భూముల మార్కెట్‌ విలువలు దాదాపు ఖరారయ్యాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో కనిష్టంగా 4.8 శాతం నుంచి గరిష్టంగా 15 శాతం వరకు భూముల ధరలు పెరిగాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో తక్కువుగా, త్వరితగతిన అభివృద్ధి కలిగిన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువుగా మార్కెట్‌ విలువలు పెరిగాయి. ఖరారు చేసిన మార్కెట్‌ విలువలను అర్ధరాత్రి రిజిస్ర్టేషన్‌ వెబ్‌ పోర్టల్‌లోకి అప్‌లోడ్‌ చేయనున్నారు. ఆదివారం నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు.

మార్కెట్‌ విలువలు ఖరారు!

- ఉమ్మడి కృష్ణాలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్‌లో ప్రతిపాదనలు

- నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ

- బందరు రోడ్డులో గజం రూ.1.20 లక్షలు

- ఏలూరు రోడ్డులో గజం రూ.1.10 లక్షలు

- విజయవాడలో కనిష్టంగా మార్కెట్‌ విలువల పెరుగుదల

- గ్రేటర్‌ విలీన ప్రాంతాల్లో 10 శాతం మేర పెంపు

- ఓఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ పరిధిలోని గ్రామాల్లో విలువల పెంపు లేనట్లే!

భూముల మార్కెట్‌ విలువలు దాదాపు ఖరారయ్యాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో కనిష్టంగా 4.8 శాతం నుంచి గరిష్టంగా 15 శాతం వరకు భూముల ధరలు పెరిగాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో తక్కువుగా, త్వరితగతిన అభివృద్ధి కలిగిన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువుగా మార్కెట్‌ విలువలు పెరిగాయి. ఖరారు చేసిన మార్కెట్‌ విలువలను అర్ధరాత్రి రిజిస్ర్టేషన్‌ వెబ్‌ పోర్టల్‌లోకి అప్‌లోడ్‌ చేయనున్నారు. ఆదివారం నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

విజయవాడ నగరంలో 4.8 శాతం నుంచి 9.09 శాతం వరకు మార్కెట్‌ విలువలు పెరిగాయి. పటమట సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం పరిధిలో బందరు రోడ్డుపై గజం గతంలో రూ.1.15 లక్షలు ఉండగా.. ఈ సారి 4.8శాతం మాత్రమే పెంచారు. దీంతో బందరు రోడ్డులో గరిష్టంగా గజం రూ.1.20 లక్షలు అవుతోంది. విజయవాడలో మార్కెట్‌ విలువలతో సమానంగా రిజిస్ర్టేషన్‌ విలువలు ఉన్నాయి. అసాధారణ పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి కేవలం 4.8 శాతం మేర మాత్రమే బందరు రోడ్డు వెంబడి మార్కెట్‌ విలువలను పెంచారు. గుణదల సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం పరిధిలో విజయవాడ నగర పోర్షన్‌లో 5 శాతం నుంచి 7 శాతం వరకు పెంపుదల చేశారు. ప్రధానంగా ఏలూరు రోడ్డు వెంబడి 6 శాతం పెంపుదల చేపట్టారు. ప్రస్తుతం ఏలూరు రోడ్డులో గజం రూ. 1.05 లక్షలు ఉండగా.. తాజా ధరలతో రూ. 1.10 లక్షలు అవుతోంది.

బందరు రోడ్డులో మార్కెట్‌ విలువల పెంపుదల ఇలా..

బందరు రోడ్డు వెంబడి గజం రూ.44 వేలు ఉన్న చోట 9.09 శాతంతో రూ. 48 వేలు, రూ.51 వేలు ఉన్న చోట 9.8 శాతంతో రూ.56 వేలు, రూ.68 వేలు ఉన్న చోట 8.8 శాతంతో రూ.74 వేలు, రూ.71 వేలు ఉన్న చోట 7.04 శాతంతో రూ. 76వేలు, రూ. 85 వేలు ఉన్న చోట 5.88 శాతంతో రూ. 90 వేలు, రూ. 1.10 లక్షలు ఉన్న చోట 4.5 శాతంతో రూ. 1.15 లక్షలు, రూ. 1.15 లక్షలు ఉన్న చోట 4.34 శాతం పెంపుతో రూ.1.20 లక్షల మేర పెంపుదల చేపట్టారు.

-విజయవాడ నగరంలో ప్రతిపాదించిన ఇతర మార్కెట్‌ విలువలు ఇలా..

పటమట సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం పరిధిలో విజయవాడ పోర్షన్‌లో ప్రస్తుతం రూ.26 వేలు మార్కెట్‌ విలువలు ఉన్న చోట 7.69 శాతంతో రూ.28 వేలకు పెంపుదల చేపట్టారు. రూ.31 వేలు ఉన్న చోట 9.69 శాతంతో రూ.34 వేలు, రూ.43 వేలు ఉన్న చోట 4.61 శాతంతో రూ.45 వేలు, రూ.49 వేలు ఉన్న చోట 8.1శాతంతో రూ.53 వేలు, రూ.58 వేలు ఉన్న చోట 8.6 శాతం పెంపుతో రూ.63 వేలు, రూ.66 వేలు ఉన్న చోట 6.06 శాతంతో రూ. 70 వేలు, రూ. 69 వేలు ఉన్నచోట 8.6 శాతంతో రూ. 75 వేలు పెంపుదలకు ప్రతిపాదించారు.

గ్రేటర్‌ విజయవాడ విలీన ప్రాంతాల్లో ఇలా..

గ్రేటర్‌ విజయవాడ విలీన ప్రతిపాదిత ప్రాంతాల్లో విజయవాడను ఆనుకుని ఉన్న కానూరులో కనిష్టంగా 10 నుంచి గరిష్టం 15 శాతం పెంపుదల చేశారు. ఇక్కడ మార్కెట్‌ విలువలు విజయవాడ నగరంతో సమానంగా ఉన్నా.. రిజిస్ర్టేషన్‌ విలువలు తక్కువుగా ఉండటంతో భారీగానే పెంచారు. గజం రూ.18 వేలు ఉన్న చోట రూ. 20వేలు చేశారు. రూ.20 వేలు ఉన్న చోట రూ.23 వేలుగా పెంచారు. రూ. 50 వేలు ఉన్న చోట రూ. 55 వేలు చేశారు. యనమలకుదురు గ్రామంలో 10.23 శాతం నుంచి 11.76 శాతం పెంపుదల చేపట్టారు. గజం రూ.17 వేలు ఉన్న చోట రూ.19 వేలు, ఎకరం రూ.1.13 కోట్లు ఉన్న చోట రూ.1.25 కోట్లు, ఎకరం రూ.4.11 కోట్లు ఉన్న చోట రూ.4.59 కోట్లు, ఎకరం రూ. 8.22 కోట్లు ఉన్నచోట రూ. 9.19 కోట్లు మేర పెంపుదల చేపట్టారు. తాడిగడపలో 10.69 శాతం నుంచి గరిష్టంగా 13.33 శాతం పెంపుదలకు ప్రతిపాదించారు. గజం రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచారు. రూ. 30 వేలు ఉన్న చోట రూ.33 వేలు, ఎకరం రూ.98.61 లక్షలు ఉన్న చోట రూ.1.10 కోట్లు, ఎకరం రూ.3.71 కోట్లు ఉన్నచోట రూ.4.14 కోట్లు, ఎకరం రూ.7.26 కోట్లు ఉన్న చోట రూ.8.22 కోట్లు పెంచారు. పెదపులిపాకలో కనిష్టంగా 10 శాతం నుంచి గరిష్టంగా రూ.12.5 శాతం పెంచారు. గజం రూ. 8 వేల నుంచి రూ.9 వేలకు పెంచేలా ప్రతిపాదించారు. ఎకరం రూ. 46.53 లక్షల ధర ఉన్న చోట రూ. 52 లక్షలు పెంచారు. ఎకరం రూ.1.93 కోట్లు ఉన్న చోట రూ.2.13 కోట్లు, ఎకరం రూ. 3.87 కోట్లు ఉన్న చోట రూ. 4.35 కోట్ల మేర పెంపుదల చేపట్టారు.

ఓఆర్‌ఆర్‌ పరిధిలో పెరగని మార్కెట్‌ విలువలు

అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ పరిధిలో ఉన్న ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రామాల్లో ధరలను పెంచలేదు. రిజిస్ర్టేషన్స్‌ శాఖ అధికారులు ధరల పెంపుదలకు ప్రతిపాదించినప్పటికీ ఎన్టీఆర్‌ జాయింట్‌ కలెక్టర్‌ అంగీకరించలేదు. దీంతో ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న రిజిస్ర్టేషన్‌ ధరలే కొనసాగనున్నాయి.

Updated Date - Jan 25 , 2026 | 12:42 AM