Share News

ఏడాదిగా ఆగిన పోస్టల్‌ డెలివరీ

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:32 AM

తపాలా శాఖ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంతో ఏడాది కాలంగా ప్రజలకు వచ్చిన లేఖలు, ముఖ్యమైన కవర్లు, పార్సిళ్లు సైతం బట్వాడాకు నోచుకోలేదు.

ఏడాదిగా ఆగిన పోస్టల్‌ డెలివరీ

  • గొట్లగట్టులో గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన లేఖలు

  • మార్కాపురం జిల్లాలో తపాలా సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం

కొనకనమిట్ల, మార్చి 2(ఆంధ్రజ్యోతి): తపాలా శాఖ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంతో ఏడాది కాలంగా ప్రజలకు వచ్చిన లేఖలు, ముఖ్యమైన కవర్లు, పార్సిళ్లు సైతం బట్వాడాకు నోచుకోలేదు. మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టు తపాలా ఉప కార్యాలయం పరిధిలో జరిగిందీ దారుణం. ఏబీపీఏం నరేంద్ర లేఖలు, పార్సిళ్లను బట్వాడా చేయకుండానే వాటిని బట్వాడే చేసేసినట్టు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుండటంతో ఏడాదిగా విషయం వెలుగులోకి రాలేదు. తపాలాశాఖ తాజా సంస్కరణల్లో భాగంగా లేఖలు బట్వాడా అయినవారికి సెల్‌ఫోన్లలో సందేశాలు పంపుతుండటంతో ఏబీపీఏం నిర్వాకం బట్టబయలైంది. సెల్‌ఫోన్లలో సందేశాలు వచ్చినప్పటికీ, తమకు లేఖలు అందకపోవడంతో బాధితులు తపాలా శాఖ జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు సోమవారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం హల్‌చల్‌ చేయడంతో గ్రామస్థులు తమ లేఖల బట్వాడాపై ఆరా తీయడం మొదలెట్టారు. దీంతో తపాలాశాఖ పొదిలి సబ్‌ డివిజనల్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.వెంకటేశ్వర్లు గొట్లగట్టు ఉపకార్యాలయానికి విచ్చేసి విచారణ చేపట్టారు. సబ్‌ పోస్టుమాస్టర్‌ స్వరూపరాణిని ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏబీపీఏం నరేంద్రపై ప్రాథమిక విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సబ్‌ డివిజనల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - Mar 03 , 2026 | 04:33 AM