ఇంకిన కన్నీళ్లు!
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:19 AM
బస్సు ప్రమాద దుర్ఘటనలో ఆప్తులను పోగొట్టుకున్న కుటుంబసభ్యులు, బంధువులు రెండు రోజులుగా మార్కాపురం వైద్యశాల వద్ద మృతదేహాల కోసం ఎదురుచూస్తున్నారు.
మార్కాపురం జీజీహెచ్ మార్చురీలోనే మృతదేహాలు
బంధువుల నిరీక్షణ.. డీఎన్‌ఏ నివేదిక వచ్చాకే అప్పగింత
తీవ్రంగా గాయపడిన 14 మందికి ఒంగోలులో చికిత్స
క్షతగాత్రులకు ఆస్పత్రిలో మంత్రుల పరామర్శ
బస్సు ప్రమాద దుర్ఘటనలో ఆప్తులను పోగొట్టుకున్న కుటుంబసభ్యులు, బంధువులు రెండు రోజులుగా మార్కాపురం వైద్యశాల వద్ద మృతదేహాల కోసం ఎదురుచూస్తున్నారు. బస్సు మంటల్లో అయినవారు అగ్నికి ఆహుతి కావడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. నిస్సత్తువతో వైద్యశాలలో చతికిలపడి మృతదేహాల కోసం ఎదురు చూస్తున్నారు. మంటల్లో మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టేందుకు వీలు లేకుండా పోయాయి. మార్కాపురం జీజీహెచ్‌కు తరలించి మార్చురీ గదిలో భద్రపరిచారు. మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలకు పంపారు. నివేదిక రాగానే వారి బంధువులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహాలను తమకు ఎప్పుడు అప్పగిస్తారంటూ బంధువులు.. వైద్యశాల వద్దకు వచ్చి వెళ్లే అధికారుల వైపు దిగాలుగా చూస్తూ అడగడం కనిపించింది. నివేదిక రాగానే మృతదేహాలను అప్పగిస్తామని రూరల్ ఎస్సై వేమన వివరిస్తూ వారిని సముదాయిస్తున్నారు. రెండు రోజులుగా వైద్యశాల వద్ద ఉన్న మృతుల బంధువులకు మార్కాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో భోజనాలు, తాగునీరు ఏర్పాటు చేశారు.