Share News

బస్సు ప్రమాదంపై విచారణ కమిటీ!

ABN , Publish Date - Apr 04 , 2026 | 03:59 AM

మార్కాపురం సమీపంలో గతనెల 26న జరిగిన బస్సు ప్రమాద ఘటనపై త్వరలో విచారణ కమిటీ రానున్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలకు...

బస్సు ప్రమాదంపై విచారణ కమిటీ!

  • రవాణా శాఖ తరఫున ప్రత్యేకంగా నియామకం

మార్కాపురం, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): మార్కాపురం సమీపంలో గతనెల 26న జరిగిన బస్సు ప్రమాద ఘటనపై త్వరలో విచారణ కమిటీ రానున్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఘటనను సీరియ్‌సగా తీసుకున్న అధికారులు విచారణను వేగవంతం చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వారిలో బస్సు డ్రైవర్‌ యువరాజు, బస్సు కండిషన్‌ సరిగ్గా లేదని తెలిసీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన లీజుదారుడు హరికృష్ణారెడ్డి ఉన్నారు. ప్రమాదం జరిగిన రోజే ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం బస్సు, టిప్పర్‌ వాహనాల నుంచి కొన్ని నమూనాలను సేకరించారు. వీటిపై విచారణ జరిపి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు రవాణా శాఖ తరఫున ప్రత్యేకంగా ఒక విచారణ కమిటీని నియమించినట్టు సమాచారం. గతంలో కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై హైలెవల్‌ కమిటీ వేసి విచారణ జరిపిన తరహాలోనే ఇక్కడ కూడా చేయనున్నట్టు ఆ శాఖ అధికారుల ద్వారా తెలిసింది. బస్సు ప్రమాదానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రాఽథమికంగా నిర్ధారణకు వచ్చినప్పటికీ రవాణా శాఖ తరఫున బస్సు ఫిట్‌నెస్‌, బ్రేకులు, ఎలక్ట్రికల్‌ సిస్టం బాగుందా, లేదా? అనే విషయాలు నిర్ధారించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ, ఫైర్‌ ఎగ్జిట్‌లు ఉన్నాయా? ఏదైనా ఎలక్ట్రిక్‌ వ్యవస్థను బస్సు నమూనాకు విరుద్ధంగా మార్పులు చేశారా? అనేది కూడా తేలాల్సి ఉంది.


అక్రమ వైరింగ్‌, లేదా మండే స్వభావం ఎక్కువ ఉన్న పదార్థాలు బస్సులో ప్రత్యేకంగా అమర్చినా, ఫైర్‌ ఎగ్జిట్‌ లేకున్నా రవాణాశాఖ కూడా పరోక్షంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. నిర్ణీత కాలవ్యవధిలో బస్సు తనిఖీ జరిగిందా లేదా? అనే అంశాలు కూడా పరిగణనలోకి రానున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బస్సు డిజైన్‌లో మార్పులు ఉంటే కంపెనీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ట్రావెల్స్‌ సంస్థ బాధ్యత, లైసెన్స్‌, బస్సు ఫిట్‌నెస్‌ తనిఖీ ఎప్పుడు జరిగింది.. ఇలా పలు అంశాలపై కమిటీ విచారణ నిర్వహించాకా ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

Updated Date - Apr 04 , 2026 | 04:01 AM