Share News

బాధితులను ఆదుకుంటాం: హోంమంత్రి అనిత

ABN , Publish Date - Mar 27 , 2026 | 05:28 AM

ప్రైవేటు ట్రావెల్స్‌లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలు జరగటం దురదృష్టకరమని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

బాధితులను ఆదుకుంటాం: హోంమంత్రి అనిత

  • రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చట్టం: మంత్రి మండిపల్లి

మార్కాపురం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ట్రావెల్స్‌లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలు జరగటం దురదృష్టకరమని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. బస్సు ప్రమాద ఘటన స్థలాన్ని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాతో కలిసి ఆమె పరిశీలించారు. మార్కాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డితో కలిసి అనిత పరామర్శించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. స్లీపర్‌ బస్సుల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వాటి నిర్మాణ స్వరూపం మార్చే అంశం పరిశీలనలో ఉందని చెప్పారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని, గాయపడిన వారిని అవసరమైతే గుంటూరు తరలించి మెరుగైన వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. బస్సు యజమానిని కూడా అదుపులోకి తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో తనిఖీలు

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల తనిఖీలకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. గతంలో కర్నూలు, ఇప్పుడు మార్కాపురం ఘటనలు దురదృష్టకరమన్నారు. ఘటనలు జరిగినప్పుడే కాకుండా నిత్యం తనిఖీలు జరుగుతుంటాయని చెప్పారు. కర్నూలు ఘటన తర్వాత 270 బస్సులు సీజ్‌ చేశామని, వాటికి సంబంధించిన పత్రాలు అన్నీ చూపిన తర్వాతే రిలీజ్‌ చేశామని వెల్లడించారు. ప్రైవేటు బస్సులపై ప్రత్యేక నిఘా పెడతామని, త్వరలో ట్రావెల్స్‌ యజమానులతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెప్పారు.

Updated Date - Mar 27 , 2026 | 05:28 AM