వివాహిత హత్య
ABN , Publish Date - May 05 , 2026 | 12:19 AM
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్యను ఆరు నెలల తర్వాత భర్త పట్టుకున్నాడు. ఇంటికి రావాలని వేడుకోగా.. రాననడంతో ఇనుపరాడ్డుతో మోది హత్య చేసిన ఘటన పామర్రులో సోమవారం జరిగింది.
- ఆరు నెలల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య
- గాలించి పట్టుకున్న భర్త... ఇంటికి రావాలని విజ్ఞప్తి
- రాననడంతో ఇనుపరాడ్డుతో తలపై మోది హత్య
- పామర్రులో ఘటన.. కేసు నమోదు చేసిన పోలీసులు
పామర్రు(గుడివాడ), మే 4 (ఆంధ్రజ్యోతి):
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్యను ఆరు నెలల తర్వాత భర్త పట్టుకున్నాడు. ఇంటికి రావాలని వేడుకోగా.. రాననడంతో ఇనుపరాడ్డుతో మోది హత్య చేసిన ఘటన పామర్రులో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా, నూజివీడు మండలం, మీర్జాపురానికి చెందిన ప్రసన్న(30)కు కృష్ణాజిల్లా, నందివాడ మండలం, తమిరిశకు చెందిన దిమ్మిటి మురళీకృష్ణతో 15 ఏళ్ల కిందట వివాహమైంది. వీరి ఇద్దరు సంతానం. ఆరు నెలల కిందట ప్రసన్న ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంత వెతికిన జాడ తెలియలేదు. ప్రస్తుతం పామర్రులోని ప్రసన్న కళాశాల ప్రాంతంలో నిడుమోలుకు చెందిన అయ్యప్ప అనే వ్యక్తితో కలిసి ఉంటున్నట్టు భర్తకు సమాచారమందింది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో తన సోదరులు రాంబాబు, నాగేశ్వరరావు, అన్న కుమారుడు పవన్‌తో కలిసి మురళీకృష్ణ పామర్రులో ప్రసన్న ఉంటున్న ఇంటికి వెళ్లాడు. తలుపులను పగులగొట్టి లోపలకు వెళ్లిన మురళీకృష్ణ ఇంటికి తిరిగి రావాలని ప్రసన్నను కోరాడు. కుదరదు అనడంతో ఆగ్రహించిన మురళీకృష్ణ ఇనుపరాడ్డుతో బలంగా ప్రసన్న తలపై మోదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న గుడివాడ డీఎస్పీ పాల శ్రీనివాస్, ఇన్‌చార్జి సీఐ జె.ఆర్.కె. హనీస్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె.శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.