రైలెక్కిన గంజాయి!
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:27 AM
రాయనపాడుకు చెందిన ఓ యువకుడు కొద్దిరోజుల క్రితం ఒడిశా వెళ్లాడు. అక్కడి నుంచి రెండు కిలోల గంజాయిని కొనుగోలు చేసి తెచ్చుకున్నాడు. ఆ సరుకుని చొక్కా లోపల నడుముకు కట్టేసుకున్నాడు. దానిపై జర్కిన్ ధరించాడు. రాయనపాడులో ఎండలు మండుతున్నా జర్కిన్ ధరించి తిరుగుతుండడంతో గస్తీ నిర్వహించే పోలీసులకు అనుమానం వచ్చి అతడిని తనిఖీ చేశారు. చొక్కా లోపల ఉన్న గంజాయి ప్యాకెట్లు బయట పడడంతో అవాక్కయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన ఘటన ఇది.
-నిఘా పెరగడంతో ట్రెండ్ మార్చిన మత్తుబాబులు
-రోడ్డు మార్గానికి స్వస్తి
-రైళ్లలో సరుకుతో రాకపోకలు
-జర్కిన్లలో దాచి తెచ్చుకుంటున్న యువకులు
-ఇటీవల వెలుగులోకి గంజాయి మాఫియా కొత్త ఎత్తుగడలు
- రాయనపాడుకు చెందిన ఓ యువకుడు కొద్దిరోజుల క్రితం ఒడిశా వెళ్లాడు. అక్కడి నుంచి రెండు కిలోల గంజాయిని కొనుగోలు చేసి తెచ్చుకున్నాడు. ఆ సరుకుని చొక్కా లోపల నడుముకు కట్టేసుకున్నాడు. దానిపై జర్కిన్ ధరించాడు. రాయనపాడులో ఎండలు మండుతున్నా జర్కిన్ ధరించి తిరుగుతుండడంతో గస్తీ నిర్వహించే పోలీసులకు అనుమానం వచ్చి అతడిని తనిఖీ చేశారు. చొక్కా లోపల ఉన్న గంజాయి ప్యాకెట్లు బయట పడడంతో అవాక్కయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన ఘటన ఇది.
- ఒడిశా నుంచి గంజాయిని బ్యాగ్‌ల్లో సర్దుకుని బయలుదేరిన ఒక గ్యాంగ్‌ను ఈగల్, జీఆర్పీ పోలీసులు విజయవాడ రైల్వేస్టేషన్‌లో నాలుగు రోజుల క్రితం పట్టుకున్నారు. తిరుపతి, గూడూరు, కేరళ ప్రాంతాలకు ఈ సరుకును తీసుకెళ్తున్నారు. పోలీసులకు చిక్కిన వాళ్లంతా అమ్మకందారులే.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
గంజాయి రవాణాపై నిఘా పెరగడంతో మత్తు బాబులు, మత్తును పంచే మాఫియా వర్గాలు మార్గం మార్చుకున్నాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సరుకును రవాణా చేస్తున్నాయి. విజయవాడ పోలీసులు, ఈగల్ పోలీసులు సంయుక్తంగా చేసిన సోదాల్లో ఈ కోణాలు వెలుగులోకి వచ్చాయి. మత్తును కొనుగోలు చేసే వారు ఒక మార్గాన్ని ఎంచుకుంటే, దాన్ని భారీగా రప్పించుకునే మాఫియా మరో మార్గాన్ని ఎంచుకుంటోంది. పోలీసులు తనిఖీలు చేసినప్పుడు తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరించేలా గంజాయి బాబులు ఎత్తులు వేస్తున్నారు.
సరుకు అప్పగించే బాధ్యత మీదే!
ఒడిశా గంజాయి సాగుకు కేంద్రంగా మారిపోయింది. ప్రస్తుతం మత్తుబాబుల చేతుల్లోకి అక్కడి నుంచే సరుకు వస్తోంది. ఇక్కడి నుంచే వివిధ రాషా్ట్రలు, వివిధ జిల్లాలకు సరఫరా అవుతోంది. ఇప్పటి వరకు గంజాయిని కొనుగోలు చేసే మాఫియా కొంతమందిని పనికి కుదుర్చుకుని వారి ద్వారా రప్పించుకునేది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాషా్ట్రలకు చెందిన వాళ్లంతా ప్రత్యేక వాహనాల్లో ఒడిశాకు వచ్చి అక్కడ గంజాయిని భారీగా కొనుగోలు చేసుకుని తీసుకెళ్లేవారు. ఈ క్రమంలో రహదారుల వద్ద పోలీసులు తనిఖీలు చేస్తే సమాచారం ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక పైలెట్ వాహనాన్ని ఏర్పాటు చేసుకునేవారు. పోలీసులకు ఎక్కడైనా చిక్కినప్పుడు ఆ వాహనాలను సీజ్ చేయడంతోపాటు వాటిల్లో ఉన్న వాళ్లందరిని అరెస్టు చేస్తున్నారు. దీని వల్ల వాహనాల పరంగా, సరుకు పరంగా మొత్తం నష్టపోతున్నారు. కేసుల్లో ఇరుక్కుపోవడంతో సరుకు తరలింపు పనికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన యువకులు మోటారు సైకిళ్లను దొంగిలించి ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వారూ ఒక మోటారు సైకిల్‌ను పైలెట్‌గా ఏర్పాటు చేసుకుని తీసుకొస్తున్నారని పలు కేసుల్లో తేటతెల్లమైంది.
రైళ్లలోనే తరలింపు
భారీ మొత్తంలో గంజాయిని కొనుగోలు చేసే ఇతర రాషా్ట్రల్లోని మాఫియాలు ఇప్పుడు రూటు మార్చాయి. సరుకును కొనుగోలు చేయడానికి బేరం కుదిరిన తర్వాత దాన్ని సురక్షితంగా అప్పగించే బాధ్యతను అమ్మకందారులపై వేస్తున్నారు. దీంతో మాఫియా నుంచి అడ్వాన్స్‌గా కొంత మొత్తం వసూలు చేసిన తర్వాత సరుకును ప్యాకెట్లలో అమర్చి బ్యాగ్‌ల్లో పెడుతున్నారు. ఒడిశాలో రైళ్లు ఎక్కి ఆయా గమ్యస్థానాలకు చేరుతున్నారు. రైల్వే స్టేషన్‌లోకి వెళ్లేటప్పుడు బ్యాగ్‌లను ఇతరులకు ఇచ్చి లోపలకు పంపుతున్నారు. జనరల్ భోగీలో ప్రయాణానికి టికెట్లు తీసుకుని అందులోకి వెళ్తున్నారు. ఈ బ్యాగ్‌లను వారు కూర్చున్న సీట్లకు సమీపంలో కాకుండా భోగీలో దూరంగా పెట్టిస్తున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఇటీవల ఈగల్, జీఆర్పీ పోలీసులు పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో సోదాలు చేసినప్పుడు ఈ కోణం బయటపడింది. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, 66 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇద్దరు తిరుపతిలో, ఒకరు కేరళలో, మరొకరు గూడూరులో గంజాయిని మాఫియాకు అప్పగించడానికి బయలుదేరారు. వాళ్లంతా గంజాయిని విక్రయించేవాళ్లు కావడం గమనార్హం.
‘పాత’ జర్కిన్ కొత్తగా..
గంజాయికి అలవాడు పడిన కొంతమంది యువకులు నేరుగా ఒడిశాకు రైళ్లలో వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. నిఘా కట్టుదిట్టంగా ఉన్నా చాప కింద నీరులా కొంతమంది యువకులు ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. తక్కువ మొత్తంలో గంజాయిని కొనుగోలు చేయడానికి వెళ్లే వారు వెంట జర్కిన్లను తీసుకెళ్తున్నారు. చలికాలం, వర్షాకాలంలో జర్కిన్లను ధరించడం సర్వసాధారణం. గంజాయిని కొనుగోలు చేయడానికి వెళ్లే యువకులు మండు వేసవిలో జర్కిన్లను ధరించడం గమనార్హం. ఇబ్రహీంపట్నం మండలం రాయనపాడుకు చెందిన ఒక యువకుడు కొద్దిరోజులుగా జర్కిన్‌తో పదేపదే కనిపిస్తుండడంతో పోలీసులు అతడిని తనిఖీ చేశారు. చొక్కా లోపల గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. ఎత్తుగా కనిపించకుండా చొక్కాపై జర్కిన్ ధరించాడు. ఒడిసా నుంచి ఈ విధంగానే గంజాయిని రైలులో తీసుకొచ్చినట్టు తేలింది. వాస్తవానికి ఇది పాత విధానమేనని ఈగల్ పోలీసులు చెబుతున్నారు. ఈ పాత విధానాన్ని కిక్ బాబులు కొత్తగా అమలు చేస్తున్నారని పోలీసులు గ్రహించారు.