మార్గదర్శిపై సుప్రీం తీర్పు ఊహించినదే: ఉండవల్లి
ABN , Publish Date - Aug 22 , 2026 | 04:24 AM
మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ముందుగా ఊహించినట్లుగానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వెల్లడించారు.
బర్కత్‌పుర, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ముందుగా ఊహించినట్లుగానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వెల్లడించారు. మార్గదర్శిలో ఆర్థికపరమైన అవకతవకలకు సంబంధించి తాను సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, ఆ తరువాత మార్గదర్శి చెల్లింపుల ప్రక్రియ చేపట్టిందని తెలిపారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో ఉండవల్లి మాట్లాడుతూ.. మార్గదర్శి అధినేత రామోజీరావు కొన్ని ఆస్తులు అమ్ముకొని బకాయిల చెల్లింపులు జరిపారని దీంతో తన లక్ష్యం నెరవేరిందని అన్నారు. బకాయిదారులకు ఎగవేయకుండా తాను చేసిన ప్రయత్నం సఫలమైందన్నారు. రామోజీరావు చనిపోవడం వల్ల క్రిమినల్ కేసు ఎత్తేశారని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ జోలికి వెళ్లకుండా తన అప్పీల్‌ను డిస్మిస్ చేసిందన్నారు. మార్గద ర్శి ఆర్థికపరమైన అవకతవకలను ఆర్‌బీఐ త్వరలో పరిశీలిస్తుందని, దీనిపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. రామోజీరావుపై తనకు ఎలాంటి కక్ష లేదని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశం ముగిసిన తరువాత బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఫొటోగ్రఫీ ప్రదర్శనను ఉండవల్లి అరుణ్‌కుమార్ తిలకించారు.