శోకసంద్రం.. తుంగాతీరం
ABN , Publish Date - Jun 01 , 2026 | 05:47 AM
కర్నూలు జిల్లా మంత్రాలయం తుంగభద్ర తీరం శోకసంద్రమైంది. శనివారం ఇక్కడ సరదాగా ఈతకు వెళ్లిన మంత్రాలయానికి చెందిన..
గల్లంతైన నలుగురి మృతదేహాలు లభ్యం
మంత్రాలయం, మే 31(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా మంత్రాలయం తుంగభద్ర తీరం శోకసంద్రమైంది. శనివారం ఇక్కడ సరదాగా ఈతకు వెళ్లిన మంత్రాలయానికి చెందిన కాలప్ప ఆచారి కుమారుడు, బంధువుల్లో మొత్తం అయిదుగురు గల్లంతవగా, ఎమ్మిగనూరుకు చెందిన ధను (22) మృతదేహం ఆరోజే లభ్యమెంౖది. మిగిలిన నలుగురు.. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీశ్ చంద్ర(36), ఆయన పెద్ద కుమారుడు యువన్‌చంద్ర (5), ఉరవకొండకు చెందిన సంధ్య (21), మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర ఆచారి (28) మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. మంత్రాలయం పాతవీధిలో కంసాలి కాలప్ప ఆచారి కొడుకు శశిధర్, ఉరవకొండకు చెందిన పూర్ణిమతో ఇటీవల ఎంతో అట్టహాసంగా వివాహం జరిగింది. సత్యనారాయణస్వామి పూజ నిమిత్తం మళ్లీ మంత్రాలయం వచ్చిన బంధువులు ఐదుగురు గల్లంతు కావడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను బయటికి తీయడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో మంత్రాలయం సమీపంలోని తుంగాతీరం కన్నీటి సంద్రంగా మారింది.