మణిపూర్-తెలుగు విద్యార్థినుల కొట్లాట
ABN , Publish Date - Aug 23 , 2026 | 04:53 AM
సెల్‌ఫోన్ విషయమై తలెత్తిన ఘర్షణ మణిపూర్-ఏపీ తెలుగు నర్సింగ్ విద్యార్థినుల మధ్య కొట్లాటకు దారితీసింది. ఈ విషయంపై విచారణ చేపట్టాలని..
ఇద్దరికి స్వల్ప గాయాలు.. సెల్‌ఫోన్ అదృశ్యంపై వివాదం..
సర్పవరం జంక్షన్ (కాకినాడ), ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్ విషయమై తలెత్తిన ఘర్షణ మణిపూర్-ఏపీ తెలుగు నర్సింగ్ విద్యార్థినుల మధ్య కొట్లాటకు దారితీసింది. ఈ విషయంపై విచారణ చేపట్టాలని సీఎంవో నుంచి ప్రత్యేక ఆదేశాలు వెళ్లాయి. వివరాలివీ.. జిల్లా కేంద్రమైన కాకినాడలోని వైద్యనగర్‌లో ఎస్‌కే కాలేజీ ఆఫ్ నర్సింగ్, ఆర్‌కే స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో సుమారు 400 మంది తెలుగు విద్యార్థినులతోపాటు, మణిపూర్, అసోం, నాగాలాండ్‌కు చెందిన 31మంది విద్యార్థినులు నర్సింగ్ కోర్సు చదువుతున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో మణిపూర్‌కు చెందిన ఓ విద్యార్థిని సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టుకోగా కనిపించలేదు. తెలుగు విద్యార్థినులను అడగ్గా వారు తమకు తెలియదని చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, కొట్లాటకు దారితీసింది. మణిపూర్‌కు చెందిన విద్యార్థులంతా తెలుగు విద్యార్థినులపై దాడికి పాల్పడగా, వారు ప్రతిఘటించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ కొట్లాటలో ఇద్దరు మణిపూర్, తెలుగు విద్యార్థినులకు గాయాలు కావడంతో జీజీహెచ్‌లో చేరారు. తమపై తెలుగు విద్యార్థులు దాడికి పాల్పడ్డారంటూ మణిపూర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో, అక్కడి నుంచి ఏపీ సీఎంవో ఆఫీసుకు సమాచారం అందింది. వెంటనే విచారణ నిర్వహించాల్సిందిగా జిల్లా కలెక్టర్, డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్, డీఎంహెచ్‌వో డాక్టర్ అనిత, సర్పవరం పోలీ్‌సస్టేషన్ ఎస్‌హెచ్‌వో సీహెచ్ ప్రకాశ్‌లకు ఏపీసీఎంవో ఆఫీసు నుంచి ఆదేశాలు వచ్చాయి. శనివారం రాత్రి అధికారులు నర్సింగ్ కాలేజీకి చేరుకుని ఇరువర్గాల విద్యార్థినులతో విడివిడిగా విచారణ చేపట్టారు. వాదనలు విన్న అనంతరం భద్రతరీత్యా మణిపూర్ విద్యార్థినులను వేరొక హాస్టల్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రకాశ్ తెలిపారు.