మామిడి తాండ్ర తయారీ ఇక సులువు
ABN , Publish Date - Feb 05 , 2026 | 05:22 AM
తెలుగు రాష్ట్రాల్లో మామిడి తాండ్రకు ఎంతో ఆదరణ ఉంటుంది. రుచికరంగా ఉండే ఈ మామిడి తాండ్ర.. తయారీనే పెద్ద ప్రాసెస్..!
కొత్త యంత్రాన్ని ఆవిష్కరించిన బాపట్ల పీహెచ్‌టీసీ శాస్త్రవేత్తలు
బాపట్ల, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో మామిడి తాండ్రకు ఎంతో ఆదరణ ఉంటుంది. రుచికరంగా ఉండే ఈ మామిడి తాండ్ర.. తయారీనే పెద్ద ప్రాసెస్..! మాన్యువల్‌గా మూడు దశల్లో చేపట్టే ఈ ప్రక్రియలో.. తొలుత మామిడికాయల నుంచి గుజ్జు తీస్తారు. దానికి చక్కెర లేదా బెల్లం కలిపి ఉడికిస్తారు. ఆపై దాన్ని పొరలుగా చేసి చాపలపై ఆరబెడతారు. పూర్తిగా ఎండిన తర్వాత ముక్కలుగా కోసి ప్యాక్ చేస్తారు. దీనికి కొన్నిరోజుల సమయం పడుతుంది. అయితే.. బాపట్ల పోస్ట్‌హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ (పీహెచ్‌టీసీ) శాస్త్రవేత్తలు మామిడి తాండ్ర తయారీ యంత్రాన్ని రూపొందించారు. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ.. రోజుల తరబడి ఆరబెట్టే పని లేకుండా.. 12 గంటల్లోనే నాణ్యమైనతాండ్రను ఈ యంత్రంతో తయారు చేయవచ్చు. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వాసుదేవరావు కృషి ఫలితంగా ఈ యంత్రం అందుబాటులోకి వచ్చింది. ఈ యంత్రంలో ఏర్పాటు చేసిన 5 అరల్లో ఒక్కసారి 25 కిలోల మామిడి గుజ్జు వేస్తే.. 12.5 కిలోల తాండ్ర వస్తుందని .వాసుదేవరావు తెలిపారు. అరల సంఖ్య పెరిగే కొద్దీ ఉత్పత్తి పెరుగుతుందన్నారు. ‘ఈ యంత్రం సాయంతో మామిడి తాండ్ర తయారీకి 12 గంటల సమయమే పడుతుంది. పైన, కింద అరల్లో వేడినీళ్లు ఉంటాయి. మధ్య ఉన్న 5 అరల్లో మామిడి గుజ్జు పోస్తాం. బయట వాతావరణంతో పనిలేకుండా పూర్తిగా ఆరిపోయి నాణ్యమైన మామిడి తాండ్ర తయారవుతుంది. యంత్రం ఖరీదు సుమారు రూ.3లక్షలు. రైతుల కోసం రూ.2లక్షల్లోపే రూపొందించేలా చర్యలు చేపట్టాం’ అని వాసుదేవరావు తెలిపారు.