Share News

కాయ నిగనిగ ధర ధగధగ!

ABN , Publish Date - Feb 25 , 2026 | 03:26 AM

మధుర ఫలం.. బంగినపల్లి మామిడి ధర అ‘ధర’హో అనిపించింది! పురుగు ఆశించకుండా రక్షణగా నిలిచే కవర్లు తొడిగి పండిస్తున్న మామిడి కాయలకు డిమాండ్‌ ఏర్పడింది.

కాయ నిగనిగ ధర ధగధగ!

  • కవరు తొడిగిన మామిడికి మంచి రేటు.. బంగినపల్లి రకం టన్ను రూ.లక్షా 80 వేలు

  • రూ.లక్ష దాటిన తోతాపురి మామిడి.. ఎన్టీఆర్‌ జిల్లాలో తొలి కోత పండ్లకు డిమాండ్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మధుర ఫలం.. బంగినపల్లి మామిడి ధర అ‘ధర’హో అనిపించింది! పురుగు ఆశించకుండా రక్షణగా నిలిచే కవర్లు తొడిగి పండిస్తున్న మామిడి కాయలకు డిమాండ్‌ ఏర్పడింది. దీంతో బంగినపల్లి రకం టన్ను రూ.లక్షా80వేల దాకా పలుకుతోంది. కవర్లు లేకుండా పండించిన కాయలు టన్ను రూ.90వేలు కూడా పలకడం లేదు. కవర్లు కట్టిన తోతాపురి రకం మామిడి కూడా టన్ను రూ.లక్షపైనే పలుకుతోంది. సీజన్‌కు ముందే ధర పెరగడంతో మామిడి రైతుల ఆనందానికి అవధుల్లేవు. సాధారణంగా తొలి దశ కోత తర్వాత ధర తగ్గడం సహజం. కానీ ఈ సారి ధర తగ్గే ప్రసక్తే లేదని అధికారులు ధీమాగా చెప్తున్నారు. దీనికి కారణం.. రెండేళ్లుగా ఉద్యానశాఖ రాయితీపై పండ్ల తోటల రైతులకు కవర్లు సరఫరా చేస్తోంది. ఈ కవర్లు కట్టిన పండ్లు కంటికి ఇంపుగా కనిపించడమే కాకుండా, నాణ్యత చాలా బాగుంటోంది. అందువల్ల చాలా మంది రైతులు కవర్లు వాడటానికి ముందుకొస్తున్నారు. నిరుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి ధర పడిపోయి, రైతులు నష్టపోయారు. రైతులకు కిలో రూ.12 ధర వచ్చేలా, వ్యాపారులు రూ.8 చెల్లిస్తే ప్రభుత్వం రూ.4 భరించింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ జిల్లాలో టన్ను తోతాపురి మామిడి రూ.లక్షపైగా పలకడం విశేషం.


ఎన్టీఆర్‌ జిల్లాలో ముందస్తు కోతలు

రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా, ఎన్టీఆర్‌ జిల్లాలో 57వేల ఎకరాల్లో బంగినపల్లి, తోతాపురి, రసాలు, సువర్ణరేఖ రకాల మామిడి తోటలున్నాయి. విజయవాడ రూరల్‌, విసన్నపేట, ఎ.కొండూరు, జి.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం, తిరువూరు, నూజివీడు, జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల్లో మామిడి సాగులో ఉంది. ఈ జిల్లా నుంచి ఏటా 2.30 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. రెడ్డిగూడెం మండల రైతుల సాగు విధానం ప్రత్యేకంగా ఉండడంతో ఏటా పూత, కాయ త్వరగా వస్తోంది. 20 రోజులుగా ఈ జిల్లాలోని మామిడి తోటల్లో రైతులు కాపుకొచ్చిన పండ్లను కోస్తున్నారు. పెద్ద సైజులో, నాణ్యంగా ఉన్న పండ్లను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. మామిడి పచ్చళ్ల తయారీ కోసం ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులూ వచ్చి మంచి ధరకు కొనుగోలు చేస్తున్నారు. నున్న, రెడ్డిగూడెం, విసన్నపేట, ఎ.కొండూరు, మైలవరం ప్రైవేట్‌ మార్కెట్ల ద్వారా రైతులు విక్రయిస్తున్నారు.


కవర్ల తొడుగుతో నాణ్యత, ధరలో వ్యత్యాసం

కవర్లు కట్టిన మామిడి కాయలకు, కవర్లు లేకుండా పండించే కాయలకు నాణ్యతలో చాలా తేడా ఉంటోంది. ధర కూడా సగానికి సగం వ్యత్యాసం ఉంటోంది. కవర్ల వల్ల తెగుళ్లు, కోతలు, పక్షులు, ఇతర జంతువుల నుంచి రక్షణ లభిస్తుంది. చెట్లకు రసాయన మందులు పిచికారీ చేసినప్పుడు కాయలపై పడకుండా ఉంటాయి. కోత సమయంలో పండ్లు నేలపై పడినా దెబ్బతినకుండా ఉంటాయి. మంగు, మచ్చ, డాగు లేకుండా నిగనిగలాడుతూ నాణ్యతగా ఉంటాయి. మామిడి పండ్లకు తొడిగే కవర్లకు ఉద్యానశాఖ 50ు రాయితీ ఇస్తోంది. కవరు కేవలం రూ.2 మాత్రమే. అయితే కవర్‌ తొడగటానికి కూలీలు కవరుకు రూపాయి తీసుకుంటున్నారని రైతులు చెప్తున్నారు. మామిడితో పాటు జామ, అరటి, దానిమ్మ వంటి పండ్ల రైతులకు కూడా ఉద్యానశాఖ రాయితీపై కవర్లను అందిస్తోంది. 2025-26లో పండ్ల కవర్ల బడ్జెట్‌ను రూ.10కోట్లనుంచి రూ.36కోట్లకు పెంచినట్లు ఉద్యానశాఖ డైరెక్టర్‌ కె.శ్రీనివాసులు తెలిపారు. కాగా ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో ప్రస్తుతం మామిడి తోటలకు తెగుళ్లు విజృంభించడంతో పూత నిలబడక, దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల సిఫారసు మేరకు క్రిమి సంహారక మందులు పిచికారి చేయాలని, మామిడి పండ్లకు కవర్లు రక్షణగా నిలుస్తాయని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Feb 25 , 2026 | 03:52 AM