మంగంపేట బెరైటీస్‌ను చెరబట్టారు!
ABN , Publish Date - May 26 , 2026 | 04:36 AM
మా తాత సుద్దపూస.. అంటూ వైఎస్ జగన్ మాటలు ఎంత బూటకమో శాసనసభాసంఘం నివేదిక బట్టబయలు చేసింది. ఉమ్మడి కడప జిల్లా మంగంపేటలోని బెరైటీస్ గనుల్లో రాజారెడ్డి చేసిన అక్రమాలను..
ఏపీఎండీసీ దన్నుతో రాజారెడ్డి దోపిడీ
3 రోజుల్లో 50 వేల టన్నుల అక్రమ తవ్వకం
లీజు ముగిసినా యథేచ్ఛగా తవ్వకం
1993లోనే అసెంబ్లీ సభాసంఘం నివేదిక
క్రిమినల్ చర్యలూ తీసుకోవాలని సిఫారసు
అమరావతి, మే 25 (ఆంధ్రజ్యోతి): మా తాత సుద్దపూస.. అంటూ వైఎస్ జగన్ మాటలు ఎంత బూటకమో శాసనసభాసంఘం నివేదిక బట్టబయలు చేసింది. ఉమ్మడి కడప జిల్లా మంగంపేటలోని బెరైటీస్ గనుల్లో రాజారెడ్డి చేసిన అక్రమాలను 1993లోనే హౌస్ కమిటీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. మూడ్రోజుల్లోనే 50 వేల టన్నులు అక్రమంగా తవ్వి తరలించుకుపోయారని తేల్చిచెప్పింది. ఆ నివేదికను మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మీడియాకు విడుదల చేశారు. మంగంపేటలో వైఎస్ కుటుంబ అక్రమ మైనింగ్‌పై ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో 1991 సెప్టెంబరు 6న అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు, మరో 10 మంది సభ్యులు ప్రశ్నించారు. సంబంధిత శాఖ మంత్రి సంతృప్తికరంగా సమాధానం ఇవ్వకపోవడంతో మరింత లోతైన విచారణ కోసం హౌస్ కమిటీ వేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్, సీఎం అంగీకరించారు. కమిటీ చైర్మన్‌గా బి.శేషశయనరెడ్డి ఉండగా.. సభ్యులుగా కోమటి భాస్కరరావు, టి.వెంకయ్య, పి.నరసింహారెడ్డి, జె.రాఘవరావు, కోనేరు రంగారావు, వి.శివరామకృష్ణారావు, పి.ఇంద్రారెడ్డి, ఎంవీ కృష్ణారావు, జి.యాదగిరిరెడ్డి, డి.రాజగోపాల్, సి.నర్సిరెడ్డి, వి.జగపతిరావు ఉన్నారు. కమిటీ తన నివేదికను 1993 మే 24న అసెంబ్లీకి సమర్పించింది.
నివేదికలో ఏముందంటే..
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) 1974-78 మధ్య జరిపిన పరిశోధనల్లో మంగంపేట, అనంతరాజుపేట గ్రామాల్లో 72 మిలియన్ టన్నుల బూడిద రంగు బెరైటీస్ నిల్వలు ఉన్నట్లు తేలింది. ఈ రకమైన బెరైటీస్ ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైనది కావడంతో భావి తరాల పరిశోధనల కోసం 36 ఇన్‌టు 30 మీటర్ల విస్తీర్ణంలో ఉన్న మైనింగ్ ప్రాంతాన్ని 1982లో జాతీయ స్మారక చిహ్నంగా జీఎస్ఐ గుర్తించింది. ఆ గుర్తించిన ప్రాంతంలో.. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి చెందిన 0.22 ఎకరాల భూమి, వైఎస్ రాజారెడ్డికి చెందిన శ్రీవిజయలక్ష్మి మినరల్ ట్రేడింగ్ కంపెనీ లీజులో ఉన్న 0.05 ఎకరాల భూమి(సర్వే నంబరు 70/3,5) ఉన్నాయి. ఈ స్థలాన్ని మైనింగ్ చేయకుండా భద్రపరిచే బాధ్యతను ఏపీఎండీసీకి అప్పగించారు. ఆ కంపెనీ లీజు 1986 డిసెంబరు 11తోనే ముగియగా.. ఏపీఎండీసీ లీజు కూడా 2004 జూలై 19న ముగిసింది. అయితే జీఎస్ఐ స్మారకంగా గుర్తించిన ప్రాంతంలోనే గాక.. చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున అక్రమంగా తవ్వేయడంతో స్మారక చిహ్నంగా గుర్తించిన ప్రాంతం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని సభాసంఘం పేర్కొంది. జాతీయ స్మారకం ఏర్పాటుకు జీఎస్ఐ నిధులివ్వకపోవడంతో ఆ ప్రాంతానికి రక్షణ కరువైందని, దీంతో విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలు చేపట్టారని నివేదికలో స్పష్టం చేసింది.
మంగంపేటలో నియమితులైన నాటి మైనింగ్ శాఖ అసిస్టెంట్ జియాలజిస్ట్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. 1990 జనవరి 13-15 మధ్య కేవలం మూడు రోజుల్లో సుమారు 50 వేల టన్నుల బెరైటీస్ ను అక్రమంగా తవ్వి తరలించేశారు. ఈ విషయంలో రాజారెడ్డికి ఏపీఎండీసీ కూడా సహకరించింది (అధికారిక రికార్డుల ప్రకారం.. 25 వేల టన్నుల బెరైటీస్ ను అక్రమంగా తవ్వినందుకుగాను శ్రీవిజయలక్ష్మి మినరల్ ట్రేడింగ్ కంపెనీ, ఏపీఎండీసీపై చెరి రూ.24.20 లక్షల చొప్పున జరిమానా విఽధించాలని సభాసంఘం సిఫారసుచేసింది. ఆ మేరకు గనుల శాఖ డిమాండ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ సంస్థలు దీనిని కూడా చెల్లించకుండా వివాదాస్పదం చేశాయి). ఏపీఎండీసీ, రాజారెడ్డి ఇద్దరూ స్మారక చిహ్న ప్రాంతంలో మైనింగ్ చేశారని అసిస్టెంట్ జియాలజిస్ట్ సైతం నివేదిక ఇచ్చారు. డిప్యూటీ డైరెక్టర్ హెచ్చరించిన తర్వాత ఏపీఎండీసీ ఆపినప్పటికీ.. రాజారెడ్డి యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు కొనసాగించారు. మెస్సర్స్ గింపెక్స్ కంపెనీ లిమిటెడ్ కూడా బెరైటీస్ అక్రమ మైనింగ్, రవాణాకు పాల్పడింది. వారు కోర్టు నుంచి దక్కించుకున్న 10 రోజుల స్టే వ్యవధిలోనే సుమారు 30 వేల టన్నుల బెరైటీస్‌ను అక్రమంగా తరలించారు. స్మారక చిహ్నానికి కేటాయించిన ప్రాంతం కుదించుకుపోయినట్లు సభాసంఘం గుర్తించింది. 25 వేల టన్నుల నష్టం జరిగినట్లు నిర్ధారించింది. ప్రత్యామ్నాయ లెక్కింపుల ప్రకారం 38 వేల టన్నుల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేసింది. అయితే ఇంతకు మూడింతలు ఎక్కువగా అక్రమ మైనింగ్ జరిగిందనేది టీడీపీ నేతల అభియోగం.
మంగంపేట బెరైటీస్‌కు ఎందుకంత డిమాండ్?
మంగంపేటలో ఉన్న బెరైటీస్.. ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ బెడ్డెడ్ బెరైటీస్ నిక్షేపం. దేశంలో ఉత్పత్తి అయ్యే బెరైటీ్‌సలో సుమారు 95 శాతం ఇక్కడి నుంచే వస్తుంది. ఒకే పొరలో అత్యంత మందంగా ఉన్న బెరైటీస్ ప్రపంచంలోనే అరుదైనది. ఈ కారణంగానే జీఎస్ఐ ఈ ప్రాంతంలో కొంత భాగాన్ని స్మారక చిహ్నంగా భద్రపరచాలని నిర్ణయించింది. బెరైటీస్‌ను ఆయిల్-గ్యాస్ డ్రిల్లింగ్‌లో, పెయింట్స్, ప్లాస్టిక్స్, మెడికల్ ఇమేజింగ్(ఎక్స్‌రేస్) వంటివాటిలో ఉపయోగిస్తుంటారు. డ్రిల్లింగ్ సమయంలో అధిక ఒత్తిడిని నియంత్రించి బ్లోఅవుట్‌లను నివారించే డ్రిల్లింగ్ మడ్‌లో వెయిటింగ్ ఏజెంట్‌గా దీనిని వాడతారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే బెరైటీస్‌లో 70 నుంచి 80 శాతం వరకు ఈ రంగంలోనే వినియోగిస్తుంటారు. ఆయిల్, గ్యాస్ వెలికితీతకు బెరైటీస్ కీలకం కావడంతో అంతర్జాతీయంగా అప్పట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇవన్నీ వైఎస్ కుటుంబానికి కలిసి వచ్చి అనతికాలంలోనే అక్రమ మైనింగ్‌తో కోట్లు గడించింది.
నాటి సభాసంఘం సిఫారసులివీ..
మంగంపేటలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడి అన్ని ఖనిజ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఏపీఎండీసీకి అప్పగించాలి.
మిగిలి ఉన్న జాతీయ స్మారక చిహ్నాన్ని సంరక్షించే బాధ్యతను తాత్కాలికంగా జిల్లా యంత్రాంగానికి కట్టబెట్టాలి. భవిష్యత్‌లో దీనిని జీఎస్ఐకి అప్పగించాలి.
మైనింగ్ ప్రాంతంలో భద్రత కోసం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీసుస్టేషన్‌పై ఆధారపడకుండా స్థానికంగానే కొత్త స్టేషన్‌ను ఏర్పాటు చేయాలి. అక్రమ మైనింగ్ నిరోధానికి డీఎస్‌పీ స్థాయి అధికారిని సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమించాలి.
ఖనిజాలను తరలించే ట్రక్కుల కదలికలను, రికార్డులను కచ్చితంగా నమోదు చేయడానికి తగిన ప్రదేశంలో టోల్‌గేట్ ఏర్పాటు చేయాలి.
1957 మైనింగ్ యాక్ట్ సెక్షన్ 21(4), (5) ప్రకారం ఖనిజం విలువను లేదా రాయల్టీని రికవరీ చేసే అవకాశం మాత్రమే ఉంది. ఇది సరిపోదు. అక్రమ మైనింగ్‌కు పాల్పడే వారిపై జరిమానాలతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకునేలా చట్టసవరణ చేయాలి.
బెరైటీస్ ఖనిజాన్ని విదేశాలకు విపరీతంగా ఎగుమతి చేయడం వల్ల భవిష్యత్తులో దేశీయ అవసరాలకు (ఉదాహరణకు ఓఎన్‌జీసీ వంటి సంస్థల డ్రిల్లింగ్ అవసరాలకు) కొరత ఏర్పడి, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోంది. ఇది దేశ ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఎగుమతి పర్మిట్లు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం జాగ్రత్త వహించాలి.