Share News

మంగళగిరి ఎయిమ్స్‌ అధ్యాపకుడికి జాతీయ అవార్డు

ABN , Publish Date - Aug 25 , 2026 | 05:43 AM

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు(2026)కు ఎయిమ్స్‌, మంగళగిరి ప్రొఫెసర్‌ డాక్టర్‌ అరుణ్‌ బాబు, పీడియాట్రిక్స్‌ విభాగంలో ఎంపికయ్యారు.

మంగళగిరి ఎయిమ్స్‌ అధ్యాపకుడికి జాతీయ అవార్డు

  • దేశవ్యాప్తంగా మొత్తం 21 మంది ఎంపిక

  • సెప్టెంబరు 5న అవార్డులు ప్రదానం చేయనున్న రాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు(2026)కు ఎయిమ్స్‌, మంగళగిరి ప్రొఫెసర్‌ డాక్టర్‌ అరుణ్‌ బాబు, పీడియాట్రిక్స్‌ విభాగంలో ఎంపికయ్యారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలు(హెచ్‌ఈఐ), పాలిటెక్నిక్‌ కళాశాలలకు చెందిన 21 మంది అధ్యాపకులను కేంద్ర విద్యాశాఖ ఈ అవార్డులకు ఎంపిక చేసింది. అవార్డుల కోసం ఎంపికైన 21 మందిలో కేంద్ర ఉన్నత విద్యాసంస్థల నుంచి 12 మందికి అవకాశం దక్కింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల నుంచి ఐదుగురిని(మూడు ప్రభుత్వ, రెండు పైవ్రేట్‌ కళాశాలలు), పాలిటెక్నిక్‌ కళాశాలల నుంచి నలుగురిని(రెండు ప్రభుత్వ, రెండు పైవ్రేట్‌ కళాశాలలు) జాతీయ అవార్డులకు ఎంపిక చేశారు. మే 26 నుంచి జూలై 30 వరకు కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో(రాష్ట్రీయ పురస్కార్‌ పోర్టల్‌) నామినేషన్లను స్వీకరించింది. బోధనా సామర్థ్యం, విస్తరణ కార్యక్రమాలు, పరిశోధనలు, ఆవిష్కరణలు, ఫ్యాకల్టీ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌లు, కన్సల్టెన్సీ టీచింగ్‌ వంటి కీలక పారామితుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. వాస్తవానికి 2023 వరకు పాఠశాల ఉపాధ్యాయులకు మాత్రమే ఈ జాతీయ అవార్డులను అందించేవారు. జాతీయ విద్యా విధానం 2020 దార్శనికతకు అనుగుణంగా విద్యా పర్యావరణ వ్యవస్థలో విశేష కృషి చేస్తున్న ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్‌ కళాశాలల అధ్యాపకులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ అవార్డుల పరిధిని విస్తరించారు. సెప్టెంబరు 5న న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

Updated Date - Aug 25 , 2026 | 05:45 AM