నా కొడుకును తెచ్చిస్తారా ?
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:15 AM
తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన యువకుడు ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య ఘటన మరోసారి రాజకీయ దుమారానికి దారితీసింది.
ఆత్మహత్య చేసుకుంటే పోలీసులకు వంతపాడారు
కేసు ఉపసంహరణకు ఒత్తిళ్లు తెచ్చారు.. రాజీ కోసం ప్రలోభ పెట్టారు
మాకు త్రిమూర్తులు భరోసా ఇవ్వలేదేం?.. ఆయన కాపు ద్రోహి
మండపేట యువకుడు శ్రీకృష్ణ భగవాన్ తల్లి ఆగ్రహావేశాలు
గంజాయి కేసు ముద్దాయిలను పరామర్శించిన ఏకైక నేత జగనే
20కిపైగా కేసులున్న సాయికృష్ణ కుటుంబాన్ని ఎలా పరామర్శిస్తారు?
పవన్‌ను ఒక కులానికే పరిమితం చేసే యత్నాలు: జనసేన నేతలు
విజయవాడ, జూన్ 23(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన యువకుడు ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య ఘటన మరోసారి రాజకీయ దుమారానికి దారితీసింది. ఆ నియోజకవర్గానికి చెందిన వైసీసీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును కాపు ద్రోహిగా పరిగణిస్తున్నామని జనసేన నేతలు మండిపడ్డారు. భగవా న్ తల్లి ప్రగడ కుమారి, ఆమె కుటుంబ సభ్యు లు, సాగునీటి అభివృద్ధి సంస్థ చైర్మన్ లీలాకృష్ణ, జనసేన, టీడీపీ నేతలు మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఘటన సమయంలో అధికారంలో ఉన్న నాయకులు బాధిత కుటుంబానికి అండగా నిలవలేదని విమర్శించా రు. తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడేలా పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని కుమారి ఆరోపించారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయంపై అప్పుడు స్పందించని తోట త్రిమూర్తులు.. ఇప్పుడు కాపుల గురించి మాట్లాడడం విచారకరమన్నారు. తాము కూడా కాపు కులానికి చెందిన వారిమేనని, త్రిమూర్తులుకు నాడు లేని కులభావన నేడెలా వచ్చిందని ప్రశ్నించారు. తన కొడుకు చనిపోయిన తర్వాత ఒక్కసారైనా నేనున్నానని ఆయన భరోసా ఇవ్వలేదన్నారు. ‘చనిపోయిన నా కొడుకును డీఎస్పీ బాలచంద్రారెడ్డి తీసుకొస్తారా? సత్తి సోమిరెడ్డి, సీఐ దుర్గాప్రసాద్ తీసుకొస్తారా? లేక వీరికి అండగా నిలిచిన తోట త్రిమూర్తులు తీసుకొస్తారా.. వీళ్ల నాయకుడు జగన్ తీసుకొస్తారా’ అని కుమారి ప్రశ్నించారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేశ్ మాట్లాడుతూ.. గంజాయి కేసుల్లో ముద్దాయిలు, నేరస్థులను పరామర్శించిన ఏకైక మాజీ సీఎంగా దేశంలోనే జగన్ నిలిచారన్నారు. 20కు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న సాయికృష్ణ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించాలని వైసీపీ నాయకులను ప్రశ్నించారు.
కులాలతో రాజకీయం చేస్తే సర్వనాశనమవుతారని మండిపడ్డారు. తన నియోజకవర్గం, తన కులానికి చెందిన శ్రీకృష్ణ భగవాన్ కుటుంబానికి తోట త్రిమూర్తులు ఎందుకు న్యాయం చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. 2022లో జరిగిన ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య ఘటనలో న్యాయం కోసం కాపు సామాజికవర్గం పెద్దఎత్తున ఆందోళనలు చేపడితే.. అప్పటి అధికార యంత్రాంగం ఆందోళనకారులపైనే కేసులు నమోదుచేసి నిర్బంధించిందని లీలాకృష్ణ ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన నాయకులు మౌనం వహించారని, తోట త్రిమూర్తులు ఆ కుటుంబానికి అండగా నిలవలేదని విమర్శించారు. భగవాన్ సోదరుడు ప్రగడ వెంకటేశ్ మాట్లాడుతూ.. తన సోదరుడు శ్రీకృష్ణ భగవాన్ పట్ల కొందరు అధికారులు, కళాశాల యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపించారు. న్యాయం కోసం పోరాడుతున్న సమయంలో తమ కుటుంబాన్ని ఒంటరిగా వదిలేశారని, కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిళ్లు తెచ్చారని, రాజీ చేసేందుకు ప్రలోభాలు చూపారని ఆరోపించారు. న్యాయం కోసం నిలబడిన వారిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసే నాయకులు తమ కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు. రామచంద్రపురం జనసేన ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పవన్‌ను ఒక కులానికి పరిమితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆయన లక్ష్యం కులాలను కలపడమన్నారు. పవన్‌ను బూతులు తిట్టడానికే కాపు నేత పేర్ని నానికి మంత్రి పదవి ఇ చ్చారన్నారు. చంద్రశేఖర్‌రెడ్డిని వంగా గీత పక్క న పెట్టుకుని బూతులు మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. కులం పేరుతో రాజకీయం చేస్తున్న వైసీపీ కాపు నాయకులు రాజకీయ సన్యాసం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భగవాన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని జనసేన నాయకులు స్పష్టం చేశారు.
అసలేం జరిగింది?
శ్రీకృష్ణ భగవాన్ మండపేటలో స్థానికంగా ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె తరఫువారు పోలీసు పలుకుబడితో అతడిని రోజంతా పోలీసు స్టేషన్‌లో ఉంచారు. తండ్రి నుంచి పూచీకత్తు తీసుకుని వదిలేశారు. అయితే స్టేషన్‌లో ఉండడం అవమానంగా భావించిన భగవాన్ 2022 మార్చి 8న ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై అతడి తల్లి ప్రగడ కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఆందోళనలు కూడా జరిగి అప్పటి సీఐ సస్పెండయ్యారు.