Share News

ముంచుకొచ్చిన మృత్యువు

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:53 AM

మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారు. ఇంతలోనే మృత్యువు తరుముకొచ్చింది. దంపతులను తనతో తీసుకెళ్లిపోయింది. అప్పటి వరకూ ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

ముంచుకొచ్చిన మృత్యువు

  • కాల్వలోకి దూసుకుపోయిన కారు

  • ఊపిరాడక దంపతులు మృతి

  • బయటపడ్డ పిల్లలు, మృతుడి తల్లిదండ్రులు

  • మండపేట మండలం తాపేశ్వరం వద్ద ఘటన

మండపేట, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారు. ఇంతలోనే మృత్యువు తరుముకొచ్చింది. దంపతులను తనతో తీసుకెళ్లిపోయింది. అప్పటి వరకూ ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మండపేట రూరల్‌ సీఐ పి.దొర్రాజు, రూరల్‌ ఎస్‌ఐ కిశోర్‌ తెలిపిన వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన బోగిళ్ల వీర వెంకట సత్యనారాయణ (40) రాజమహేంద్రవరం పేపరుమిల్లులో విద్యుత్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 3న కాకినాడలో బంధువులు ఇంట జరిగిన వివాహానికి భార్య కిరణ్మయి(36), తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మ, ఇద్దరు కుమారులు మోక్షజ్ఞ(10), జితే్‌ష(7)లతో కలిసి సొంత కారులో వెళ్లారు. కాకి నాడలో శుభకార్యం ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి తిరిగి వెలగతోడు బయలు దేరారు. సత్యనారాయణ కారు డ్రైవింగ్‌ చేస్తుండగా భార్య కిరణ్మయి పక్కనే కూర్చుంది. తాతయ్య నానమ్మతో ఇద్దరు కుమారులు వెనుక కూర్చున్నారు. ఈలోగా కన్ను రెప్పపడిందో.. చీకట్లో దారే కనిపించలేదో కానీ.. తాపేశ్వరం పంచాయతీ పరిధి పేకేటిపాకల వద్ద.. కారు రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లి మట్టిలో కూరుకుపోయింది. దీంతో కారులో ముందున్న సత్యనారాయణ, కిరణ్మయి ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయారు. వెనుక సీట్లో కూర్చున్న తల్లిదండ్రులు, ఇద్దరు కుమారులను స్థానికులు అతికష్టం మీద బయటకు తీసి కాపాడారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్‌ సహాయంతో కారును పైకిలాగి సత్యనారాయణ, కిరణ్మయి మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం మృతదేహాలను కుటుంబీకులకు అందజేశారు.

Updated Date - Apr 07 , 2026 | 05:54 AM