దళిత క్రైస్తవులకు రాజకీయపార్టీలు అండగా నిలవాలి
ABN , Publish Date - May 12 , 2026 | 05:17 AM
దళిత క్రైస్తవులకు రాజకీయపార్టీలు అండగా ఉండాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు. దళితులకు మత స్వేచ్ఛ లేకుండా చేసే రాజ్యాంగ విరుద్ధమైన 1950 ప్రెసిడెన్షియల్...
1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయాలి: మంద కృష్ణ మాదిగ
రాజమహేంద్రవరం అర్బన్, మే 11 (ఆంధ్రజ్యోతి): దళిత క్రైస్తవులకు రాజకీయపార్టీలు అండగా ఉండాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు. దళితులకు మత స్వేచ్ఛ లేకుండా చేసే రాజ్యాంగ విరుద్ధమైన 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను రద్దు చేయాలని, లేకుంటే సవరణ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై ఏపీ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రైస్తవ మతం స్వీకరించిన ఓసీలకు, బీసీలకు, ఎస్టీలకు లేని ఆంక్షలు దళిత క్రైస్తవులకు ఎందుకని ప్రశ్నించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తున్నామన్నారు. దళిత క్రైస్తవుల ఓట్లు వేయించుకున్న అధికార, ప్రతిపక్షాలు ఇప్పటికైనా స్పందించాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు. ఎస్సీల మత స్వేచ్ఛను అడ్డుకునే శక్తులు బలంగా ఉన్నాయని, దళిత క్రైస్తవుల ఉద్యమానికి అండగా ఉంటానని చెప్పారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న వారే దళిత క్రైస్తవుల మత స్వేచ్ఛ అడ్డుకోవడం అన్యాయమని మంద కృష్ణ పేర్కొన్నారు. కాగా.. తాను ఇప్పటికీ ఏ రాజకీయ పార్టీలోనూ లేనని, భవిష్యత్తులో ఏ పార్టీ కండువా కప్పుకోనని ఆయన స్పష్టంచేశారు.