Share News

సస్పెన్షన్లే కాదు.. శిక్షలు కఠినంగా ఉండాలి!

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:12 AM

వేట్లపాలెంలో బాణసంచా విస్ఫోటం సంభవించి 23 మంది మృతికి దారితీసిన పరిస్థితులపై అధికారులను సస్పెండ్‌ చేయడంతో పాటు బాధ్యులకు శిక్షలు కఠినంగా ఉండాలని ..

సస్పెన్షన్లే కాదు.. శిక్షలు కఠినంగా ఉండాలి!

  • వేట్లపాలెం బాణసంచా ఘటనపై మంద కృష్ణ మాదిగ

సామర్లకోట, మార్చి 2(ఆంధ్రజ్యోతి): వేట్లపాలెంలో బాణసంచా విస్ఫోటం సంభవించి 23 మంది మృతికి దారితీసిన పరిస్థితులపై అధికారులను సస్పెండ్‌ చేయడంతో పాటు బాధ్యులకు శిక్షలు కఠినంగా ఉండాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనల్లో యావజ్జీవ శిక్షలు ఉండాలని, పీడీ యాక్ట్‌ కింద తయారీదారుడి ఆస్తులు జప్తు చేసి బాధితులకు అందజేయాలన్నారు. సోమవారం ప్రమాదస్థలాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భం గా మాట్లాడుతూ... బాణసంచా తయారీదారుడు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడడం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే 23 మంది పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఆరోపించారు. కాగా.. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు, గంటల వ్యవధిలో ప్రమాద స్థలానికి చేరుకోవడం, మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.20 లక్షలు నష్ట పరిహారం ప్రకటన సహా సీఎం చంద్రబాబు స్పందన అమోఘమని తెలిపారు. ప్రమాదం జరిగిన 18 గంటల్లోనే బాధిత కుటుంబాలకు మంత్రుల ద్వారా ఆర్థికసాయం చెక్‌లు పంపిణీ చేయడం, పిల్లల చదువులకు ఆదుకోవడం వంటి చర్యలు విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు నిదర్శనమని చెప్పారు. నష్ట పరిహారం రూ.50 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. అంతకుముందు వేట్లపాలెంలోని బాధిత కుటుంబాలను మంద కృష్ణ మాదిగ పరామర్శించారు.

Updated Date - Mar 03 , 2026 | 04:13 AM