Share News

విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్‌ కేసు..

ABN , Publish Date - Feb 09 , 2026 | 04:43 AM

ఎస్‌ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్‌, ఉపాధ్యక్షుడు వినోద్‌లపై మోహన్‌బాబు యూనివర్సిటీ ప్రతినిధులు, బౌన్సర్లు దాడి చేసిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ...

విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్‌ కేసు..

  • అందుబాటులో లేని మోహన్‌బాబు

  • మంచు విష్ణుకు నోటీసులు

తిరుచానూరు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్‌, ఉపాధ్యక్షుడు వినోద్‌లపై మోహన్‌బాబు యూనివర్సిటీ ప్రతినిధులు, బౌన్సర్లు దాడి చేసిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్‌ బృందం మంచు విష్ణుకు నోటీసులు అందజేసింది. అయితే ఈ నెల 15 వరకు ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయని, ఆతర్వాత విచారణకు వస్తానని విష్ణు చెప్పినట్టు సీఐ తెలిపారు. మరోమారు నోటీసులు ఇచ్చి, విచారణకు హాజరు కావాలని విష్ణును కోరతామన్నారు. కాగా, హైదరాబాద్‌లోని మోహన్‌బాబు నివాసానికి పోలీసులు నోటీసులు తీసుకెళ్లగా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో చంద్రగిరి మండలం రంగంపేటలోని ఎంబీయూకు వెళ్లారు. అక్కడ కూడా లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. మోహన్‌బాబు ఎక్కడ ఉన్నా నోటీసులు అందజేస్తామని సీఐ చెప్పారు. కాగా, ఈ కేసుకు సంబంధించి తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఎంబీయూ పీఆర్వో సతీష్‌, ప్రతినిధులు, బౌన్సర్లను ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ2గా మంచు మోహన్‌బాబు, ఏ3గా విష్ణు ఉన్నారు. కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో మోహన్‌బాబు క్వాష్‌ పిటిషిన్‌ వేసిన విషయం తెలిసిందే.

Updated Date - Feb 09 , 2026 | 04:44 AM