Share News

‘మన సభ-జన సభ’కు విశేష స్పందన

ABN , Publish Date - Aug 15 , 2026 | 04:56 AM

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలను ప్రజాస్వామ్యానికి మరింత చేరువ చేసేలా ‘మన సభ-జన సభ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు.

‘మన సభ-జన సభ’కు విశేష స్పందన

  • అసెంబ్లీ సమావేశ మందిరాలను సందర్శించిన ప్రజలు, విద్యార్థులు

  • ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని మరింత చేరువ చేయడానికే..: స్పీకర్‌ అయ్యన్న

అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలను ప్రజాస్వామ్యానికి మరింత చేరువ చేసేలా ‘మన సభ-జన సభ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు. శాసనసభ కేవలం ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యే భవనం మాత్రమే కాదని, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిధ్వనిగా నిలిచే ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించారు. స్వాతంత్య్ర వేడుకలను ప్రజా పండుగలా నిర్వహించేందుకు అమరావతి అసెంబ్లీ ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. కేవలం విద్యుద్దీపాల అలంకరణలు, అధికారుల జెండా వందనానికే పరిమితం కాకుండా సామాన్య ప్రజలను, విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేయాలని అయ్యన్న తీసుకున్న నిర్ణయంతో అసెంబ్లీలో సరికొత్త సందడి నెలకొంది. అందుకు అనుగుణంగానే ‘మన సభ-జన సభ’ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ప్రజలు, విద్యార్థులకు అసెంబ్లీ ప్రాంగణంలోకి ఉచిత ప్రవేశం కల్పించి ఉభయ సభల సందర్శనకు అవకాశం కల్పించడం విశేష ఆకర్షణగా నిలిచింది. సందర్శకుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఫుడ్‌ కోర్టు కూడా ఏర్పాటు చేశారు. 14, 15 తేదీల్లో సాయంత్రం వేళల్లో ప్రజలు, విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించడంతో అసెంబ్లీ భవనాన్ని చూడడానికి శుక్రవారం భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో స్పీకర్‌తోపాటు శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, శాసస వ్యవస్థ సెక్రటరీ జనరల్‌ ప్రసన్నకుమార్‌ సూర్యదేవర తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ... ‘యువత రాజకీయాల్లోకి రావాలి. వారి భాగస్వామ్యం పెరిగినప్పుడే రాజకీయ వ్యవస్థ మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉంటుంది. శాసనసభ సందర్శన వంటి ప్రజాస్వామ్య సంప్రదాయాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు, శాసన వ్యవస్థకు మధ్య అనుబంధం మరింత బలపడుతుంది’ అని పేర్కొన్నారు. మోషేన్‌రాజు మాట్లాడుతూ... ‘ప్రజలతో కలసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలన్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. ప్రజలను ప్రజాస్వామ్య వ్యవస్థకు చేరువ చేసే ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలి’ అని ఆకాంక్షించారు. రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, సామాన్య ప్రజలకు సైతం అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశం కల్పించడం ద్వారా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం అభిందనీయమన్నారు. కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు ఉత్సాహపరిచాయి. కాజ వెంకట సుబ్రమణ్యం శిష్యురాలు ఇరుకులపాటి లక్ష్మీసహస్ర ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2026 | 04:57 AM