Share News

ఊపిరి ఉండగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు

ABN , Publish Date - Mar 23 , 2026 | 04:57 AM

బతికున్న మనిషిని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన అమానుష ఘటన ఇది. ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలం ఆళ్లూరుపాడులో ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది.

ఊపిరి ఉండగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు

  • కుటుంబ సభ్యులపై బంధువుల ఆగ్రహం

  • తిరిగి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

  • ఎన్టీఆర్‌ జిల్లా ఆళ్లూరుపాడులో ఘటన

పెనుగంచిప్రోలు రూరల్‌/వత్సవాయి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): బతికున్న మనిషిని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన అమానుష ఘటన ఇది. ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలం ఆళ్లూరుపాడులో ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలివీ.. ఆళ్లూరుపాడుకు చెందిన వెంకటేశ్వర్లు (55) వారం కిందట అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ను ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయినా ఆరోగ్యం మెరుగుపడకపోవటంతో రెండు రోజుల క్రితం విజయవాడలోని ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యసేవలు చేయించారు. అయినా పరిస్థితి విషమించింది. ఆక్సిజన్‌ తొలగిస్తే చనిపోతాడని వైద్యులు చెప్పడంతో, ఇక బతకడని భావించి ఆదివారం ఉదయం అంత్యక్రియలు చేస్తామని బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో బంధువులంతా ఉదయానికల్లా ఆళ్లూరుపాడులోని వెంకటేశ్వర్లు ఇంటికి వచ్చారు. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ఇంటి ముందు షామియానాలు, కుర్చీలు వేశారు. ఏసీ బాక్స్‌ సిద్ధం చేసి మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. సుమారు 10 గంటల సమయంలో అంబులెన్స్‌లో వెంకటేశ్వర్లును గ్రామానికి తీసుకొచ్చారు. ఆయన్ను చూసిన బంధువులు ఊపిరితో ఉన్నట్టు గుర్తించి ఇలా ఎలా తీసుకొస్తారని కుటుంబ సభ్యులను నిలదీశారు. ఇలా చేయటం సరికాదని ఘర్షణకు దిగారు. పెద్దలు కల్పించుకుని వారికి సర్దిచెప్పారు. అంబులెన్స్‌లో మళ్లీ విజయవాడ ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గంమధ్యలోనే వెంకటేశ్వర్లు మృతిచెందారు. అనంతరం వెనక్కి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తిచేశారు.

Updated Date - Mar 23 , 2026 | 04:57 AM