Investment Fraud: వాట్సాప్ కాల్‌తో కోటిన్నర కొట్టేశారు!
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:53 AM
పెట్టుబడుల పేరుతో వాట్సాప్ కాల్ ద్వారా మోసం చేసిన అపరిచితులపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అనకాపల్లి పట్టణ ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు అందించిన వివరాలిలా ఉన్నాయి.
అనకాపల్లి టౌన్, జనవరి 6(ఆంధ్రజ్యోతి): పెట్టుబడుల పేరుతో వాట్సాప్ కాల్ ద్వారా మోసం చేసిన అపరిచితులపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అనకాపల్లి పట్టణ ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గవరపాలేనికి చెందిన శరగడం మహేంద్ర సూర్యకుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసి, ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. గత ఏడాది అక్టోబరు 7న గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ కాల్ చేశాడు. తాను చెప్పిన గ్రూపులో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని ఆశ చూపాడు. దీంతో సూర్యకుమార్ తొలుత రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టారు. కొద్దిరోజుల్లోనే ఆయన ఖాతాలోకి 2.2 లక్షలు జమయ్యాయి. మరో రెండుసార్లు ఇదేవిధంగా పది శాతం చొప్పున లాభం జమయింది. నాటినుంచి గత నెల 26వరకు దఫదఫాలుగా గుర్తు తెలియని వ్యక్తి ఖాతాకు రూ.1,63,97,750 జమ చేశారు. 27 నుంచి ఆ వ్యక్తి నుంచి సమాధానం రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.