Tanakallu Demise Case: భార్యను ఎత్తుకెళ్లాడని నరికేశాడు
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:29 AM
వివాహేతర సంబంధం ఓ వ్యక్తిని బలితీసుకుంది. తన భార్యను ఎత్తుకెళ్లిపోయాడన్న ఆగ్రహంతో ఆమె భర్త.. తన సోదరులతో కలిసి సదరు వ్యక్తిని పోలీస్ స్టేషన్ ఎదుటే నరికేశాడు.
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి దారుణ హత్య
సోదరులతో కలిసి వేటకొడవళ్లతో దాడి
తనకల్లు పోలీస్ స్టేషన్ ఎదుటే ఘటన
తనకల్లు, జనవరి 5(ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధం ఓ వ్యక్తిని బలితీసుకుంది. తన భార్యను ఎత్తుకెళ్లిపోయాడన్న ఆగ్రహంతో ఆమె భర్త.. తన సోదరులతో కలిసి సదరు వ్యక్తిని పోలీస్ స్టేషన్ ఎదుటే నరికేశాడు. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండల కేంద్రంలో సోమవారం జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. కదిరి రూరల్ సీఐ నాగేంద్ర కథనం మేరకు, తనకల్లు మండలం మార్పురివాండ్లపల్లికి చెందిన ఇడగొట్టు ఈశ్వరప్ప(40)ను, ఇదే మండలంలోని రాగినేపల్లికి చెందిన ఎర్రి హరి.. తన సోదరులు ఎర్రి చెన్నప్ప, గంగులప్ప, శంకరప్పతో కలిసి వేటకొడవళ్లతో నరికి చంపేశారు. ఎర్రి హరి భార్య నాగ శిరీషను ఇడగొట్టు ఈశ్వరప్ప ఈ నెల ఒకటో తేదీన తీసుకుపోయాడు. హరి ఫిర్యాదు మేరకు తనకల్లు పోలీసులు గాలించి తిరుపతి జిల్లా గూడురులో ఉన్న ఈశ్వరప్ప, నాగ శిరీషతోపాటు, వారి వెంట ఉన్న నాగ శిరీష బంధువు రమ్యశ్రీని పట్టుకుని, తనకల్లు పోలీస్ స్టేషన్‌కు సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు తీసుకొచ్చారు. పోలీసు వాహనం నుంచి ఇడగొట్టు ఈశ్వరప్ప దిగగానే.. అక్కడే మాటు వేసి ఉన్న హరి, నలుగురు అన్నదమ్ములూ వేట కొడవళ్లతో నరికి పారిపోయారు. ఆ వెంటనే మహిళలు భయంతో పరుగులు తీశారు. ఈశ్వరప్పను పోలీసులు 108లో కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం జరిపించి, బంధువులకు అప్పగించారు. దాడి జరిగిన వెంటనే పారిపోయిన నాగ శిరీష, రమ్యశ్రీ.. పరాకువాండ్లపల్లి వద్ద ఓ తోటలో దాక్కోగా, పోలీసులు గాలించి ఇద్దరినీ పుట్టపర్తి వన్‌స్టాప్ కౌన్సెలింగ్ సెంటర్‌కు తరలించారు. నాగ శిరీషతో ఈశ్వరప్పకు వివాహేతర సంబంధం ఏర్పడిందని, అందుకే ఆమెను తీసుకువెళ్లాడని పోలీసులు తెలిపా రు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టామని పేర్కొన్నారు. కాగా, నెల క్రితమే ఈశ్వరప్ప భార్య విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఇప్పుడు తండ్రి హత్యతో.. ఎనిమిదో తరగతి చదువుతున్న వారి కుమార్తె దీప్తి ఒంటరిగా మిగిలిపోయింది.