మల్లన్నకు శఠగోపం..!
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:52 AM
జిల్లాలో కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు అవినీతి అక్రమాలకు బరితెగిస్తున్నారు.
తల నీలాల టెండర్లలో గూడుపుఠాణి
విజయవాడ కనదుర్గమ్మ టెండర్ రూ.10కోట్లు
ఇక్కడేమో రూ.5.10కోట్లు మాత్రమే
తెరవెనుక ఓ ప్రజాప్రతినిధి హాస్తం
బెదిరింపులు.. దాడులతో రెండు సార్లు టెండర్లు వాయిదా
కనీసం కేసు కూడా నమోదు చేయని పోలీసులు
నంద్యాల, మార్చి17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు అవినీతి అక్రమాలకు బరితెగిస్తున్నారు. ఏకంగా తలనీలాల టెండర్ల విషయంలో శ్రీశైలం మల్లన్నకు సైతం శఠగోపం..! పెట్టారనే విమర్శలు గుప్పుమంటుండటం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఈవ్యవహారంలో జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధి సైతం కీలకంగా వ్యవహ రించారనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే సదరు టెండరు పక్రియను సదరు ప్రజాప్రతినిధి అనుచరుడు(సమీప బంధువు) పలు రకాల బెదిరింపులు..దాడులతో వారు ుదా వేయించారని తెలిసింది. ఆ తర్వాత ఆనలైన టెండరు నేపథ్యంలో కూడా తమ పంథా నెగ్గించుకున్నారని సమాచారం. ఇదే క్రమంలో గత వైసీపీ హాయాంలో టెండరుదారుడికే మళ్లీ కేవలం రూ.5.10 కోట్లకే గుట్టుచప్పుడు కాకుండా కట్టబెట్టే ప్రయత్నం చేశారని సమాచారం. పెద్దఎత్తున అమ్యామ్యాలు చేతులు మారాయనే ప్రచారం లేకపోలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. సదరు ప్రజాప్రతినిధికి కాసుల వర్షం.. శ్రీశైల మల్లన్న ఆదా యానికి భారీగా గండి అన్నట్లైంది. ఏది ఏమైనా మొదట అడ్డుకున్న వారే.. తిరిగి పాత కాంట్రాక్టర్‌కే తలనీలాల టెండరు దక్కే విధంగా తెరవెనుక రాజకీయం నడిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏది ఏమైనా శ్రీశైల మల్లన్న తలనీలాల టెండరు ఎంపిక విషయంలో గూడుపుఠాణీ జరిగిందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
ఇప్పటికే రెండు సార్లు వాయిదా...
శ్రీశైల మల్లన్న తలనీలాల టెండర్ గత ఏడాది డిసెంబరు 26వ తేదీకి గడవు
ముగిసింది. ఆలయాధికారులు రెండు సార్లు మ్యానువల్ టెండర్లు పిలవగా కర్ణాటక, తమిళనాడుతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 15మంది వరకు టెం డరుదారులు పాల్గొన్నారు. సదరు ప్రజాప్రతినిధి అనుచరులు టెండరుదారులతో పాటు ఆలయ అధికారులను భయబ్రాంతులకు గురి చేశారు. బెదిరింపులు చేయడంతో పాటు దాడులు చేశారు. ఈవ్యవహారంపై పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు. ఆలయ బోర్డు తీర్మానంతో ఫిబ్రవరిలో ఆనలైన టెండర్ పిలిచారు. సదరు పక్రియలో కూడా తెరవెనుక రాజకీయం నడిపి పాత కాంట్రాక్టర్‌కే సదరు కాంట్రాక్టు దక్కేలా వ్యవహరిం చారనే ప్రచారం లేకపోలేదు. ఆనలైన టెండర్లు పది రోజుల కిందట ఓపెన చేయగా మూడు టెండర్లు మాత్రమే వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం అవి కూడా రెండు డమ్మీ టెండర్లు కాగా.. ఒకటి వైసీపీలోని పాత కాంట్రాక్టర్‌కు చెందినదిగా తెలిసింది.
అక్కడ రూ. 10 కోట్లు.. ఇక్కడ రూ.5కోట్లేనా...
తిరుమల తరువాత శ్రీశైలానికే పెద్దఎత్తున భక్తులు రానున్నట్లు తెలుస్తోంది. గత నెలలో విజయవాడ కనకదుర్గమ్మ తలనీలాల టెండర్లు రూ.10 కోట్లు పలికినట్లు తెలిసింది. శ్రీశైల మల్లన్న తలనీలాల టెండరు మాత్రం రెండేళ్లు గడువుతో కేవలం రూ.5.10 కోట్లకే సదరు టెండరు కట్టబెట్టే ప్రయత్నించారని తెలుస్తోంది. అదీ వైసీపీలో హాయాంలో టెండరు దక్కించుకున్న పాత కాంట్రాక్టర్‌కే కూటమిలోనూ మళ్లీ కాంట్రాక్టు పొందేలా చేయడం పలు విమర్శలకు తావిస్తోంది.
ఆలయ అధికారులపై ఒత్తిడి
టెండరు పక్రియపై ఆలయ అధికారులకు ఆశాఖ పైఅధికారులతో పాటు సదరు ప్రజా ప్రతినిధి నుంచి పెద్దఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయని తెలిసింది. శ్రీశైలం బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ‘ఉద్రిక్తత వెనుక కుట్ర కోణం?’ ఘటన నేపథ్యంలో అప్పటి వైసీపీ బక్తాధికారిని ఈవోగా తీసుకురావాలని సదరు ప్రజాప్రతినిధి ప్రయత్నించారనే ఆరోపణలు లేకపోలేదు. తాజాగా టెండరు వ్యవహారంలో సైతం సదరు ప్రజా ప్రతినిధి సైతం తెరవెనుక వ్యవహా రం నడిపించి పాత వైసీపీ కాంట్రాక్టర్‌కే మళ్లీ సదరు టెండరు దక్కే విధంగా వ్యవహరించారని సమాచారం.
అక్కడంతా వారిదే పెత్తానం...
శ్రీశైలంలో ఎక్కడ చూసిన సదరు ప్రజాప్రతినిధితో పాటు వారి అనుచరుడు(సమీప బంధువు) దందానే ఎక్కువుగా సాగుతోందని సమాచారం. స్పర్శ దర్శనాల నుంచి పలు రకాల పనుల, ఉద్యోగాల కాంట్రాక్టుల పరంగా అన్నింటా కూడా వారిదే పెత్తానం అని సమాచారం. ఆలయ అధికారులదీ కేవలం ప్రేక్షక పాత్ర అన్నట్లు సమాచారం. శ్రీశైలంలో స్పర్శ దర్శనాల కోసం ప్రత్యేక బ్యాచను తయారు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడంతా సదరు అనుచరుడి దందా అన్నట్లుగా పరిస్థితి తయారైంది.
99 శాతం పూర్తి
సదరు టెండరు ఎంపిక ప్రక్రియ 99 శాతం పూర్తయింది. త్వరగా బోర్డుమీటింగ్ పెట్టి సదరు పక్రియపై వెంటనే తీర్మానించాలని పై వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువైనట్లు తెలు స్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 25, 26వ తేదీల్లో శ్రీశైలం బోర్డుమీటింగ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోసారి టెండర్లు పిలుస్తారా?
ఆనలైన టెండరులో లోగుట్టు వ్యవహారాన్ని రట్టు చేసి మరోమారు పారదర్శకంగా టెండర్లు పిలుస్తారా..? అనే సందేహాలు లేకపోలేదు. సదరు ప్రజాప్రతినిధితో పాటు అ నుచరుడు, ఆశాలోని ఓపై స్థాయి అధికారి కలిసి సదరు కాంట్రాక్టును వారు అను కున్నట్లుగా వైసీపీలోని పాత కాంట్రాక్టరుకే మళ్ళీ కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా సదరు టెండరు ఎంపిక పక్రియపై స్పష్టత రావాలంటే త్వరలో జరిగే బోర్టుమీటింగ్ వరకు ఆగాల్సిందే. ఆనలైన టెండరు ఓపెన చేసినప్పటికి అధికారికంగా ప్రకటన చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.