Share News

‘మగ’మహారాణులు

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:18 PM

హోలీ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది.. రంగులు చల్లుకోవడం, కాముని దహనం. హోలీ పండుగను దేశవ్యాప్తంగా రంగులు చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా చేసుకుంటారు.

   ‘మగ’మహారాణులు
స్ర్తీ వేషధారణలో కుటుంబ సభ్యులతో దేవాలయానికి వస్తున్న ‘మగ’మహారాణులు

ఆదోని రూరల్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : హోలీ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది.. రంగులు చల్లుకోవడం, కాముని దహనం. హోలీ పండుగను దేశవ్యాప్తంగా రంగులు చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా చేసుకుంటారు. కానీ ఆదోని మండలంలోని సంతేకుడ్లూరులో మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. మగవారు చీరలు కట్టుకుని స్త్రీ వేషధారణలో రతీమన్మథులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కామ దహనంతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు రెండు రోజుల పాటు కొనసాగుతాయి. మహిళలుగా ముస్తాబైన పురుషులు ఇళ్లలో పిండి వంటలు తయారు చేసి, కుటుంబ సభ్యులతో కలసి డప్పు వాయిద్యాలతో వీధుల్లో ఊరేగింపుగా రతీ మన్మథుల ఆలయానికి చేరుకుంటారు. చదువుకున్న వారు సైతం తమ కోరికలు నెరవేరితే ఇలా మొక్కుబడి చెల్లించుకుంటారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, పంటలు పండాలని, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణించాలని, ప్రేమ, పెళ్లి ఇలా వివిధ రకాల మొక్కులు తీర్చుకునేందుకు ‘మగ’మహారాణులు ఇలా అందంగా ముస్తాబవుతారు. రెండురోజులపాటు గ్రామంలో ఆధ్యాత్మికతను చాటిచెప్పేలా రతీమన్మథుల రథోత్సవం, కామదహనం, మగవారు మగువల వివిధ వేషధారణలతో గ్రామంలో తిరుగుతారు. గ్రామంలోని బసవేశ్వర స్వామి దేవాలయంలో వెలసిన రతీమన్మథులను హోలీ పండుగ సందర్భంగా వివిధ పూలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు.

‘మగ’మహారాణులు : పేద రైతు అయినా, పెద్ద భూస్వామి అయినా, ప్రభుత్వ ఉద్యోగి, ప్రజాప్రతినిధి, రోజువారి కూలీ ఇలా ఎవరైనా సరే కోరికలు తీరాలంటే కచ్చితంగా కొంగు కట్టాల్సిందే. కోరిక తీర్చే క్రమంలో అచ్చం మగువలా అంచు పట్టుచీర కట్టుకొని నెత్తిన పూలు పెట్టుకొని... నుదుట బొట్టు పెట్టుకొని చేతులకు గాజులు, కాళ్లకు పారాణి రాసుకొని, బంగారు ఆభరణాలు, నడుంకు వడ్డానం ధరించి కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలో పాల్గొంటారు. ఇక్కడి ప్రజలకు ఇది మామూలే అనిపించినా కొత్తవారికి మాత్రం ఇది వింత ఆచారమే.

చదువులో రాణించాలని

- ప్రణిత

మా అబ్బాయి పేరు యశ్వంత. ఫస్ట్‌క్లాస్‌ చదువుతున్నాడు. చదువు బాగా అబ్బాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మొక్కుకున్నా. నాకు కుమారుడు పుడితే ఇలా మొక్కులు తీర్చుకుంటానని స్వామివారిని వేడుకున్నారు. అనుకున్నట్లుగానే నా కోరికలు తీరాయి. రెండేళ్లుగా మా అబ్బాయి అమ్మాయిగా అలంకరించి స్వామివారిని దర్శించుకుంటున్నాము. ఇంకా మూడు సంవత్సరాలు నా కొడుకును ఇలాగే ముస్తాబు చేసి మొక్కులు తీర్చుకుంటాను.

ఉన్నత శిఖరాలను చేరుకోవాలని

-తల్లి శాన్విత

నా కుమారుడి పేరు నమిత కుమార్‌. నాకు కొడుకు పుడితే బాలిక వేషధారణలో స్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్నా. అలాగే బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్లాలని దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకున్నా. అనుకున్నట్లుగానే మా కుటుంబంపై స్వామివారు కరుణ చూపారు. అందుకే మా అబ్బాయికి బాలిక వేషంలో మొక్కులు తీర్చుకుంటున్నా.

ఎలక్ర్టిషన అయితే చీర కడతానని మొక్కుకున్నా

- శ్రీనివాసులు, సంతేకుడ్లూరు

ఎలక్ర్టిషన అయితే చీర కడతానని హోలీ పండుగ రోజు రతీమన్మథులను వేడుకున్నా. నా కోరిక నెరవేరింది. ఎలక్ర్టిషన అయ్యాను. అందుకే మూడు సంవత్సరాలుగా చీరకట్టులో దేవుడిని దర్శించుకుంటున్నా. అలాగే మా కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఆర్థికంగా స్థిర పడాలని మొక్కుకున్నా. ఇంకా రెండు సంవత్సరాలపాటు చీరకట్టులో స్వామిని దర్శించుకుంటా.

బాబు బాగుండాలని

- చెన్నమ్మ

నా కుమారుడు గణేష్‌ ఆరోగ్యం బాగుండాలని స్వామివారిని మొక్కుకున్నా. అందులో భాగంగానే ఇలా మా అబ్బాయికి స్త్రీ వేషధారణలో అలంకరించి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తున్నాం. ప్రతి ఏటా హోలీ రోజున ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నాం. జీవితాంతం మా అబ్బాయి ఇలా స్వామివారిని దర్శించుకునేలా మొక్కుకున్నాం. అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలని స్వామివారిని కోరుకున్నా.

Updated Date - Mar 04 , 2026 | 11:18 PM