మహారథంపై మలయప్ప
ABN , Publish Date - Sep 23 , 2026 | 07:37 AM
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారి మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తజనం
రాత్రి అశ్వవాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
నేడు ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
తిరుమల, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారి మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేకువజామున ఆలయంలో ఆగమోక్తంగా కైంకర్యాలు అందుకున్న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని మహారథం(చెక్క తేరు)పై అధిష్ఠింపజేశారు. ఉభయ దేవేరులతో స్వామి ఆలయ వీధుల్లో ఊరేగి భక్తకోటిని అనుగ్రహించారు. రథంలో కొలువుదీరిన శ్రీనివాసుడికి గ్యాలరీల్లోని భక్తకోటి అడుగుడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవింద నామస్మరణలతో ఆలయ మాడవీధులు మార్మోగాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన మహారథం ఊరేగింపు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయింది. వేలాది మంది భక్తులు రథానికి కట్టిన తాళ్లను లాగుతూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో చివరి వాహనమైన అశ్వవాహన సేవ రాత్రి 7 గంటలకు కనులపండువగా సాగింది. మరోవైపు బుధవారం ఉదయం శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. రాత్రి ఆలయంలో జరిగే ధ్వజావరోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి.